కెసిఆర్ కిట్ల పంపిణీ షురూ

cm-kcr-formally-launched-the-kcr-kits-and-distributed-to-six-women

cm-kcr-formally-launched-the-kcr-kits-and-distributed-to-six-women
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఎంతో మెరుగవుతున్నాయని, అందుకే బెడ్ల సంఖ్యకు మించి పేషంట్లు వస్తున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంపొందించేందుకు, ఇతరత్రా మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని వెల్లడిండారు. కేసీఆర్ కిట్ ప‌థ‌కాన్ని ఈరోజు  సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

హైద‌రాబాద్‌లోని పాత బ‌స్తీలో ఉన్న పేట్ల‌బురుజు ఆస్ప‌త్రిలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. మొద‌ట కేసీఆర్ కిట్ వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్క‌రించారు. ఆ త‌ర్వాత మెట‌ర్నిటీ హాస్ప‌ిట‌ల్లో బాలింత‌ల‌కు సీఎం కేసీఆర్ కిట్‌ల‌ను అంద‌జేశారు. మొద‌టి కేసీఆర్ కిట్‌ను మేక‌ల స‌బిత అందుకున్నారు. కేసీఆర్ కిట్ అందుకున్న‌వారిలో ర‌హీదా బేగం, మెహ‌జెమీన్‌, స‌రిత‌మ్మ‌లు ఉన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బాలింత‌లు ఆత్మీయంగా కిట్‌ల‌ను అందుకున్నారు.

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యంత మానవత్వంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు సిఎం వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కూడా పెంచామని చెప్పారు. దీని ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషంట్ల సంఖ్య పెరుగుతున్నది వెల్లడించారు. పెట్ల బుర్జ్ ఆసుపత్రిలో 462 బెడ్లు ఉంటే, 700 మంది పేషంట్లు వచ్చారని, దీని వల్ల బెడ్ల కొరత ఏర్పడిందని వెల్లడించారు. అయినా సరే, బెడ్లు లేవనే కారణంగా పేషంట్లను పంపించడం లేదని, ఎక్కువ మందికి సేవలందిస్తున్నందుకు ప్రభుత్వ వైద్యులను అభినందించాలని సిఎం అన్నారు.

పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నందున పెట్లబుర్జ్ ఆసుపత్రిలో మరో బ్లాక్ నిర్మిస్తామని సిఎం వెల్లడించారు. ఇదే ఆసుపత్రిలో గతంలో మహాలక్ష్మి అనే డాక్టర్ గొప్పగా పనిచేశారని, ధనవంతులు కూడా వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకునే వారని సిఎంగ గుర్తు చేశారు. ఈ ఆసుపత్రి మళ్లీ ఆ స్థాయిలో సేవలందించాలని, ఇదే ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలందించడానికి వీలుగా మరో భవనం నిర్మిస్తామని సిఎం హామీ ఇచ్చారు.

గతంలో పేషెంట్ల బంధువులు ఉండడానికి వీలుగా ప్రభుత్వ ఆసుపత్రులకు అనుసంధానంగా ధర్మశాలలు ఉండేవని, మళ్లీ అలాంటి ధర్మశాలలు ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. నర్సింగ్ స్టాఫ్ కు స్టయిఫండ్, మెస్ నిర్వహణలో విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

కిట్‌లో ఏమేముంటాయి
– దోమతెర (రూ.350)
– బేబీ మాస్కిటోస్ (రూ.90)
– దుస్తులు (రూ.200)
– రెండు టవల్స్ (రూ.100)
– బేబీ న్యాప్‌కిన్స్ (రూ.100)
– జాన్సన్ బేబీ పౌడర్ (రూ.120)
– బేబీ షాంపు (రూ.85)
– బేబీ ఆయిల్ (రూ.200)
– బేబీ సబ్బు (రూ.90)
– బేబీ సోప్ బాక్స్ (రూ.25)
– ఆట వస్తువులు (రూ.50)

తల్లి కోసం రూ.350 విలువచేసే రెండు చీరలు, రూ.40 విలువైన రెండు సబ్బులు, రూ.150 విలువైన కిట్‌బ్యాగ్, రూ.50 విలువ చేసే ప్లాస్టిక్ బకెట్ ఉంటాయి. దీంతోపాటు ఖ‌ర్చుల కోసం ఆడ బిడ్డ పుడితే 13 వేల రూపాయ‌లు, మ‌గ బిడ్డ పుడితే 12 వేల రూపాయ‌లు త‌ల్లి అకౌంట్లో జ‌మ చేస్తారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ప్ర‌స‌వించిన వారికే ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది.

అంత‌క‌ముందు సీఎం కేసీఆర్ హాస్పిట‌ల్‌ వార్డుల్లో తిరిగారు. వార్డు డాక్ట‌ర్ల‌తో పాటు న‌ర్సుల‌ను ఆయ‌న వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఆసుపత్రిలోని అల్ట్రాసౌండ్ సెంటర్, ఎమర్జెన్సీ వార్డు, జనరల్ వార్డు, స్టెబిలైజేషన్ సెంటర్లను పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బంది, పేషంట్లతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సిఎం మహ్మద్ మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ఖాద్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.