‘నంద్యాల పంచాయితీ’ ఎప్పటికి తేలేనో??

Confusion continues over Nandyal by poll contestant in TDP

Confusion continues over Nandyal by poll contestant in TDP

నంద్యాల ఉప ఎన్నికల పంచాయితీ అధికార తెలుగుదేశంపార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేట్లు కనిపిస్తోంది. విడవమంటే కప్పకు కోపం, కరవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత జరుగుతున్న ఉపఎన్నిక కావడంతో భూమా వర్గం, శిల్పా వర్గం మధ్య సీటు పంచాయితీ తేల్చడానికి అష్టకష్టాలు పడుతున్నారు.

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్ధిత్వంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నంద్యాల ఉప ఎన్నికలో తాను నూటికి నూరుపాళ్లు పోటీ చేసి తీరతానని శిల్పా మోహన్‌రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితమే శిల్పా సోదరులు సీఎంను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తన వర్గాన్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి పోటీ చేయక తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ కూడా తమ అనుచరులకే సీటు ఇవ్వాలని పట్టుపడుతున్నారు.

దీంతో ఇరువురి మధ్య విభేదాల నేపథ్యంలో ఏకాభిప్రాయం కోసం చంద్రబాబు పాట్లు పడుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కళా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి అఖిలప్రియ, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరై నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై చర్చించారు. నంద్యాల ఉప ఎన్నికపై నేతలతో కళా వెంకట్రావు విడివిడిగా భేటీ అవుతున్నారు. అలాగే ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి కూడా వెంకట్రావుతో మాట్లాడారు.

ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ స్థానంలో అభ్యర్థిపై విషయాన్ని ఇంకా వాయిదా వేయకూడదని తెదేపా భావిస్తోంది. అయితే, ఓ స్థానంలో ఎమ్మెల్యే మరణిస్తే.. ఆ కుటుంబానికి అవకాశం ఇస్తున్న విషయాన్ని అఖిలప్రియ కళా వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనిపై స్పందించిన ఆయన పార్టీ శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.