నంద్యాల సీటు ఎవరిది?

Confusion over Nandyal Assembly By poll - YSRCP or TDP

Confusion over Nandyal Assembly By poll - YSRCP or TDP

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతి అందరిని బాధించింది. ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అదే సమయంలో భూమా మృతితో, నంద్యాల అసెంబ్లీ సీటు ఖాళీ పై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఎవరైనా సిటింగ్ ఎమ్మెల్యే చనిపోతే, ఆయన కుటుంబానికి చెందిన వారికే ఎమ్మెల్యే పదవిని ఇవ్వడానికి పోటీ లేకుండా ప్రతి పక్షం అంగీకరిస్తుంది. అది ఇప్పటివరకు కొనసాగుతున్న ఆనవాయితి.

ఆళ్లగడ్డలో ఎన్నికలకు ముందే ఎంఎల్ఏ అభ్యర్ధి శోభానాగిరెడ్డి మృతిచెందగా, ఆమె కుమార్తె అఖిలప్రియ వైసీపీ పక్షాన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా తిరుపతి, నందిగామలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చనిపోతే ఆ విధంగానే వైసీపీ పోటీచేయలేదు. కానీ నంద్యాల అసెంబ్లీ సీటు ఎవరికి దక్కుతుందన్న విషయంలో  కొంత గందరగోళం చోటుచేసుకుంది.

నంద్యాల అసెంబ్లీ సీటును వైసీపీ అభ్యర్ధి భూమా నాగిరెడ్డి గెల్చుకున్నారు. ఆయన వైసీపీ లో ఉండగానే, తెలుగుదేశం పార్టీ ఆయనను పలురకాలుగా ఇబ్బందులకు గురిచేసింది. ఆయనపై రౌడీషీట్ తెరవడం, కేసులు పెట్టి జైలుకు పంపడం లాంటి చర్యలకు పాల్పడింది. కారణం ఏదైనప్పటికీ, ఆళ్లగడ్డ ఎంఎల్ఏ అఖిలప్రియతో కలిసి నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

మంత్రి పదవి వస్తుందనుకున్నప్పటీకీ అది రాకుండానే ఆయన మృతి చెందడంతో ఇప్పుడు నంద్యాల సీటుకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ సీటు వైసీపీదా? టీడీపీదా అన్న తర్జనభర్జన మొదలైంది. నాగిరెడ్డి వైసీపీ నుండి గెలుపోందారు కాబట్టి అది తమదేనని ఆ పార్టీ పట్టుబట్టవచ్చు. భూమా ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్నారు కాబట్టి, అది తమ సీటే అని టీడీపీ కూడా వాదించవచ్చు. టీడీపీ వాదనను ఒప్పుకుంటే ఫిరాయింపులకు ఆమోదముద్ర వేసినట్లు అవుతుందని మరో అబిప్రాయం. వైసీసీకి వదలివేస్తే భూమా టీడీపీలోకి రావడం తప్పు అన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళుతుందని తెలుగుదేశం సందేహించవచ్చు. అందువల్ల ఈసారి సంప్రదాయానికి బిన్నంగా టీడీపీ, వైసీపీలు వచ్చే ఉప ఎన్నికలో పోటీచేస్తాయా లేదా అనేది కొంత ఆసక్తికరమైన అంశం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.