కాంగ్రెస్, టీఆర్ఎస్ డిష్యూం డిష్యూం

వివేక్

హైదరాబాద్, మే 22:

తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమైన రెండు ప్రధాన పక్షాలూ కలహించుకుంటున్నాయి. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లు రెండూ కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే అధికారం హస్తగతం చేసుకోవచ్చుననీ, హైదరాబాద్ లో వరుసగా మూడోసారి కాంగ్రెస్ పతాకం ఎగురవేయవచ్చుననీ భావించిన కాంగ్రెస్ వాదులకు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి కలిగించే వ్యూహ రచన చేశారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని తేలిన తర్వాత కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్న వాగ్దానాన్ని తుంగలో తొక్కడం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రి దళితుడు, ఉపముఖ్యమంత్రి ముస్లిం ఉంటారంటూ చేసిన బాసను కూడా కేసీఆర్ సమయానుకూలంగా విస్మరించారు.

నవతెలంగాణ నిర్మాణం టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో అంటే తన పర్యవేక్షణలోనే జరగాలన్నది కేసీఆర్ కొత్త  పాట. తెలంగాణ రాష్ట్ర కల సాకారం కోసం పదమూడు సంవత్సరాలుగా ఉద్యమం నిర్వహించిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం తొలిముఖ్యమంత్రిగా ఉండాలని కేసీఆర్ కోరుకోవడంలో తప్పులేదు. దళితులనూ, ముస్లిలనూ శుష్కవాగ్దానాలతో మభ్యపెట్టడం మాత్రం శుద్ధతప్పు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ ఎస్ ను విలీనం చేయరాదన్న నిర్ణయం వెనుక కొంత బలమైన వాదన లేకపోలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కలిసిపోతే, ప్రతిపక్ష స్థానంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల కూటమి ఉంటుంది. అప్పుడు టీడీపీకి తెలంగాణలో సముచితమైన స్థానం ఉన్నట్టు అవుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ కానీ బీజేపీ కానీ రెండు కలిసి కానీ అవతరించే అవకాశం ఉన్నది. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు విలీనం కాకుండా ఎన్నికల పొత్తు పెట్టుకున్నప్పటికీ టీడీపీ, బీజేపీలకు గణనీయమైన సంఖ్యలో స్థానాలు లభించే అవకాశం ఉన్నది. ఒక వేళ పొత్తంటూ కుదిరితే, టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ 50 లేదా 60 స్థానాలు వదిలిపెట్టిన పక్షంలో టీఆర్ఎస్ అన్ని స్థానాలలోనూ గెలిచే అవకాశం ఉండదు. అటువంటి ఆనవాయితీ కూడా లేదు. 2004లో కాంగ్రెస్ తోనూ, 2009లో టీడీపీతోనూ పొత్తు పెట్టుకున్నప్పుడు టీఆర్ ఎస్ పోటీ చేసిన స్థానాలలో కొన్ని మాత్రమే గెలుచుకున్నది. ఇప్పుడు కూడా అంతకు భిన్నంగా జరిగే అవకాశం లేదు. కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ టీఆర్ ఎస్ అభ్యర్థులపైన పోటీ అభ్యర్థులను ఇండిపెండెంట్లుగా నిలుపుతాయి. కాంగ్రెస్ ఓటు కానీ టీడీపీ ఓటు కానీ టీఆర్ఎస్ కు బదిలీ కాదు. అందువల్ల ఎన్నికల పొత్తు పెట్టుకొని స్థానాలు సర్దుబాట్లు చేసుకోవడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ అంగీకరించినప్పటికీ టీడీపీ-బీజేపీ కూటమికి ప్రధాన ప్రతిపక్షం హోదా లభించే అవకాశం ఉంది. విలీనం లేదా పొత్తు లేకుండా కాంగ్రెస్, టీఆర్ఎస్ లు విడివిడిగా ఎన్నికలలో పోటీ చేసే పక్షంలో మొదటి రెండు స్థానాలలో ఆ రెండు పార్టీలే ఉంటాయి. మొదటి స్థానంలో టీఆర్ఎస్ ఉంటే రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది. అట్లా కాకుండా కాంగ్రెస్ ప్రథమ స్థానంలో ఉంటే టీఆర్ఎస్ ద్వితీయ స్థానంలో ఉంటుంది. ఒక రకంగా ఇది వ్యూహాత్మకమైన నిర్ణయం అవుతుంది.

బహుశా అగ్ర స్థాయిలో, అంటే కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో కేసీఆర్ ఇటువంటి అంగీకారానికి వచ్చి ఉండవచ్చునేమో కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఈ విషయంలో నాటకాలు ఆడుతున్నాయని నిందిస్తున్నవారు ఎవ్వరూ లేరు. రెండు పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మళ్ళీ గడీల రాజ్యం రానివ్వబోమనీ, కేసీఆర్ ది దొరహంకారమనీ  మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ధ్వజమెత్తితే, టీఆర్ఎస్ తో తాడోపేడో తేల్చుకుంటామంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడుగా నియుక్తుడైన పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అందరికీ సమాధానం చెప్పగల వాగ్ధాటీ, సమయస్ఫూర్తీ ఉన్న కేసీఆర్ అదను చూసి పదునైన అస్త్రాలు సంధిస్తున్నారు. రాజకీయ ఉష్ణోగ్రత పెంచే సామర్థ్యం కలిగిన కేసీఆర్ తనయకుడు తారకరామారావూ, మేనల్లుడు హరీష్ రావూ తమ వంతు దాడులు కాంగ్రెస్ నాయకత్వంపైన చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జాప్యం చేయబట్టే వందలమంది యువకులూ, విద్యార్థులూ అత్మహత్యలు చేసుకున్నారంటూ టీఆర్ ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతుంటే టీడీపీ, బీజేపీల మధ్య దూరం తగ్గుతోంది. ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడానికి సమాలోచనలు సాగుతున్నాయి. నామినేషన్ల తేదీలు సమీపించే కొద్దీ పొత్తుల విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది. బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ బీజేపీ నాయకులకు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. తెలంగాణ లోని అన్ని లోక్ సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేస్తే ఈ ఎన్నికలలలో ఘనవిజయాలు సాధించకపోయినప్పటికీ ఉత్తరోత్తరా పార్టీ బలపడుతుందనీ, నాయకశ్రేణులు ఏర్పడాయనీ, కార్యకర్తలు సమకూరుతారనీ బీజేపీకి చెందిన తెలంగాణ నాయకులు తలపోస్తున్నారు. అందుకే పొత్తు వద్దంటున్నారు. కానీ సీమాంధ్రలో బీజేపీకి టీడీపీ స్నేహహస్తం అవసరం. చివరికి బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ విభాగం నాయకుల మెడలు వంచి టీడీపీతో పొత్తుకు ఒప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు ప్రకాష్ జావ్ దేకర్ హైదరాబాద్ లో బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి.

Comments are disabled