లీకేజీలో కుట్రకోణం నిజంగానే దాగుందా??

Conspiracy behind AP Assembly rain water leakage

Conspiracy behind AP Assembly rain water leakage

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువుని దిగజార్చే కుట్రలు జరుగుతున్నాయా?? వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని నిర్మించి నాలుగు నెలల్లో వర్షాలు పడ్డప్పటికీ ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే ఎందుకు రాద్ధాంతం జరుగుతోంది? అసెంబ్లీ ప్రారంభమైన కొత్తల్లో పడ్డ భారీ వర్ష సమయంలో అసెంబ్లీ బయటి ప్రాంతాలు చిత్తడి చిత్తడిగా మారినా లోపల మాత్రం ఎలాంటి లీకేజీలు జరగనప్పుడు ,  నిన్న కురిసిన 20 నిమిషాల వర్షం ఇంత పెద్ద దుమారానికి తెరలేపింది. జగన్‌ రూంలో నీరు కారడం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా ప్రచారం జరిగి ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ దగ్గర ధర్నా చేస్తే, ఏకంగా ప్రభుత్వ పరువుని కాపాడడానికి స్పీకరే రంగంలోకి దిగారంటే  పరిస్థితి ఎక్కడికి చేరుకుందో అర్థమౌతోంది.

ఎవరినో ఇరికిద్దాం… ఏదో చేసేద్దాం… ప్రభుత్వం పరువు బజారుకీడుద్దాం అనుకున్న వాళ్ళు సెల్ఫ్‌గోల్ వేసుకొనేలా చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అసలు నిన్న కురిసిన వర్షానికి ఒక్క ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లోకి నీరు ఎలా వచ్చిందనే అంశంపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులోభాగంగానే నీరుఎలా వచ్చిందో, దానికి ఎవరు బాధ్యులో తేల్చేందుకు ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించారు. నిర్మాణసంస్థల ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో కలిసి సీఐడీ ఎస్పీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నలుగురు డీఎస్పీలు, మరో నలుగురు సీఐలు జగన్ ఛాంబర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అసలు జరిగిన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిన సీఐడీ అధికారులకు సంచలన విషయాలు వెలుగుచూశాయి.

అసెంబ్లీ భవనంలో ఏసీ వైర్లు, కేబుల్స్ వెళ్లేందుకు గోడల్లోంచి పీవీసీ పైపులు ఏర్పాటు చేశారని, అయితే జగన్ పీఏ రూమ్‌పైన పీవీసీ పైపును ఎవరో కట్ చేశారని అధికారులు తెలిపారు. అసెంబ్లీ మొదటి అంతస్థులో వర్షపు నీరు వెళ్లే పైప్‌‌లైన్‌కి కొంచెం దూరంలో కేబుల్స్‌ వెళ్లే పీవీసీ పైప్‌ ఉందని, భారీ వర్షానికి స్లాబ్‌పై నీరు చేరడంతో కట్ చేసిన పైపు నుంచి వర్షపు నీరు లీక్ అయిందని అధికారులు స్పష్టంచేశారు. అంతేగాక విపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్‌పైన వర్షం నీరు దిగే పైపు కత్తిరంచడం వెనుక కుట్రకోణం ఉన్నట్టు సీఐడీ నిర్ధారణకు వచ్చింది. ఇదే విషయాన్ని మరింత క్షుణ్ణంగా విచారణ చేయాలని స్పీకర్ ఆదేశించారు.

లీకేజీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ ‘‘భవనం ప్రారంభించి నాలుగు నెలలైంది. అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ జరిగిన సమయంలోనే పెద్ద వర్షం పడింది. ఆ తర్వాత కూడా వర్షాలు పడ్డాయి. నిన్న కురిసిన వర్షానికి ప్రతిపక్ష నాయకుడు ఛాంబర్‌లోకి మాత్రమే నీళ్లు వెళ్లాయి. దానిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవంతి నిర్మాణం బాగాలేదని, అధికారులు భవన నిర్మాణంపై శ్రద్ధ తీసుకోవడంలేదంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఈరోజు ధర్నా చేశారు. అసెంబ్లీ నడవని రోజుల్లో కూడా కేవలం ఎమ్మెల్యేలు, అధికారులు మాత్రమే ఇక్కడకు వస్తారు. మిగతావారిని రానీయం.’

‘అయితే, నిన్న జరిగిన దానికి స్పందించిన అధికారులు వెంటనే జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత విచారించగా.. ఎవరో కావాలనే పైప్‌ను కట్‌చేసినట్టు గుర్తించాం. అలా పైప్‌ను కట్‌చేయడం వల్లే ప్రతిపక్ష నేత గదిలోకి నీళ్లు వచ్చాయి. దాన్ని చిలువలు పలువలు చేసి లేనిది ఉన్నట్టు చెప్పి.. ప్రభుత్వ భవనాలు నాశిరకమని అంటున్నారు. అసలు.. ఎవరి ప్రమేయం లేకుండా ఏసీ పైపు ఏ రూపంలో కట్‌ అవుతుంది? ఎవరూ దాని జోలికి పోకపోతే కట్‌ అయ్యే అవకాశమే లేదు. ఎలా జరిగిందనే విషయాన్ని సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించాం. ఏవైనా వివరాలు కావాలంటే నా వద్దకు రావొచ్చు. దీనికి బాధ్యత ఎవరిది, ఎందుకు చేశారు? ఎలా చేశారనేది సీఐడీ విచారణలోనే తేలుతుంది’ అని స్పష్టంచేశారు.

మొత్తానికి నిన్నటినుండి జగన్‌ రూంలో వర్షపు నీళ్ళు అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసిన వీడియోలు, ఫోటోలకు అసలు కారణం తేల్చేశారు అధికారులు. అయితే ఎవరైనా ఈ పైపులను కావాలనే కట్ చేశారా లేక అసలు ఈ తతంగం వెనక ఎవరైనా ఉండి మొత్తం నడిపించి హడావిడి చేశారా అన్నది విచారణలో తేలనుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • D S SESHA SAI says:

    Yes. It’s a conspiracy. Let’s leave it to public to decide who is the culprit.