జగన్ కు ఊరట: బెయిలు రద్దుకు నిరాకరించిన కోర్టు

DA case Relief To Jagan, CBI court rejects Petition Against Jagan's Bail

DA case Relief To Jagan, CBI court rejects Petition Against Jagan's Bail

వైసీపీ అధినేత, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ కోర్టు కొట్టేసింది. దీంతో ఆయనకు కాస్త ఊరట లభించినట్లైంది. అక్రమాస్తుల కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన జగన్‌ షరతులను ఉల్లఘించారని.. అందువల్ల ఆయన బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది.

జగన్‌ ఉద్దేశపూర్వకంగానే సాక్షులను బెదిరిస్తున్నారని.. కోర్టులో విచారణను కూడా ప్రభావితం చేసేలా ప్రవరిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. అంతేగాక తన పిటిషన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి ఇంటర్వ్యూను సాక్షి ఛానెల్ ఇటీవలే ప్రసారం చేయడాన్ని చూపింది. ’మనసులో మాట‘ అన్న శీర్షికతో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ పరంపరలో భాగంగా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఈ ఇంటర్వ్యూ చేశారు.

ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ సిబిఐ జగన్ కేసు దర్యాప్తును ప్రొఫెషనల్ గా నిర్వహించలేదంటూ రమాకాంత రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐ దాఖలు చేసిన కేసులలో రమాకాంత రెడ్డి సాక్షిగా ఉన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా జగన్ మోహన్ రెడ్డికి గతంలో కోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయాలంటూ సిబిఐ పిటిషన్ ను దాఖలు చేసింది. ఆయన సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ స్పష్టంచేసింది.

సీబీఐ ఆరోపణలను జగన్‌ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. సాక్షి నిర్వహణతో గానీ.. రమాకాంత్‌రెడ్డి ఇంటర్వ్యూలో ఈ కేసు విచారణను ప్రభావితం చేసే అంశాలు లేవని కోర్టుకు తెలిపారు. ఊహాజనిత అంశాలతో బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరడం సమంజసంగా లేదని వాదించారు న్యాయవాదులు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసింది.

 

వెకేషన్‌కు ఓకే

దీనితో పాటుగా జగన్ మోహన్‌రెడ్డి వేసవి సెలవుల సందర్భంగా కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్ళేందుకు న్యాయమూర్తి అనుమతించారు. కాగా, తన కుటుంబాన్ని తీసుకొని మాత్రమే జగన్ న్యూజిలాండ్‌కు వెళ్ళాలని న్యాయమూర్తి షరతు విధించారు. మే 15 నుంచి జూలై 15 మధ్యలో 15 రోజుల పాటు విదేశాలకు వెళ్ళేందుకు జగన్ గతంలో కోర్టు అనుమతిని కోరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.