దర్శకరత్న సినిమాలు మేలిమి రత్నాలు

Darsakaratana's Films Are Truely Pearls

Darsakaratana's Films Are Truely Pearls

దాసరి పట్టుకోని కథ, తీయని సినిమా, చేయని ప్రయోగం లేదనే చెప్పాలి. ఆయన అన్నిరకాల చిత్రాలూ తీశారు. అంతవరకూ మూస చట్రంలో మగ్గిపోయిన తెలుగు సినిమాకు కొత్త దిశను చూపారు. దశ తిప్పారు. అప్పటిదాకా హీరో చుట్టూ తిరిగిన మన సినిమా దాసరి వచ్చిన తర్వాత రూట్ మారింది. సినిమాలో కథకు ప్రాధాన్యం వచ్చింది. బలమైన కథలతో ఆణిముత్యాల్లాంటి సినిమాలను మనకందించారు. నటీనటులు ఎవరైనా సరే .. .. వారిని మౌల్డ్ చేసి అద్భుతాలు చేసి చూపించిన సినిమా మాంత్రికుడు దాసరి అనడంలో సందేహం లేదు.

దర్శకుల్లో దాసరి ఓ దిగ్గజం. కొన్నేళ్లు తెలుగు సినిమాకు మార్గదర్శకుడిగా వెలిగారు. దర్శకుడంటే కేవలం స్టార్ట్, కట్ చెప్పే మనిషి కాదని, ఇన్ క్రెడిబుల్ క్రియేటర్ అని నిరూపించారు దాసరి. డైరెక్టర్ కు స్టార్ గ్లామర్ తెచ్చిన వ్యక్తి దాసరి. ఆయన తెలుగు సినీ పరిశ్రమకు మూలస్తంభంగా నిలిచారు. మంచి సినిమాలు తీయడమే కాదు .. ..మంచి మనసున్న మంచి మనిషి కూడా. అందుకే ఆయనను తెలుగు సినిమాకు పెద్దదిక్కు అంటారు. ఆయన లేని తెలుగు సినీ పరిశ్రమ ఎలా ఉంటుందో ఊహించలేం.

దాసరి నారాయణరావుకు మంచి విజన్ ఉండేది. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు. కథ మీద, నటన మీద పట్టు ఉండేది. ఏ కథను ఎలా తీయాలి? ఎవరితో తీస్తే పండుతుంది? అనేది దాసరికి బాగా తెలుసు. అది తెలుసు కనకే కొత్తవారితో తీసినా, స్టార్స్ తో తీసినా రత్నాల్లాంటి సినిమాలు అందించి నిజంగా దర్శకరత్న అనిపించుకున్నారు. మొదటి సినిమా తాత-మనవడు తోనే తనేమిటో నిరూపించుకున్నారు దాసరి.

దాసరి సినిమాల్లో మనకు సమాజం కనిపిస్తుంది. సగటు మనిషి సమస్యలు కనిపిస్తాయి. మధ్యతరగతి పడుతున్న అవస్థలు కనిపిస్తాయి. అంతవరకూ ప్రేమ చుట్టూ తిరిగిన  సినిమాను  సామాన్యుడి వైపు మళ్లించారు. సినిమాకు సామాజిక స్పృహ ఉండాలి అని చాటి చెప్పారు. అద్భుతమైన కథల్ని కొత్తవారితో  తీసి రక్తి కట్టించారు. విజయం సాధించారు. సినిమా అంటే కమర్షియల్ ఫార్ములా మాత్రమే కాదు .. .. జనం కష్టాల్ని కూడా చూపించాలి అని చెప్పి, ఆచరించి చూపించిన దర్శకుడు దాసరి నారాయణరావు.

స్టార్స్ తో సినిమా తీసినా, సామాన్యుడి సమస్యలపై తీసినా ఆయన తీసిన ప్రతి సినిమాపైనా ఆయన ముద్ర స్పష్టంగా కనబడుతుంది. మరచిపోగలమా మేఘసందేశాన్ని. మరువగలమా రాములమ్మను. ఓ స్వర్గం –నరకం, ఓ బలిపీఠం, సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం, మామగారు, సూరిగాడు, అమ్మ రాజీనామా .. .. ఇలా ఎన్నో సినిమాలున్నాయి.  అన్నీ ఆణిముత్యాలే.  ఎన్నో రత్నాల్ని మనకందించి ఆయన వెళ్లిపోయారు. కనుమరుగైన ఆ దర్శక దిగ్గజానికి సకలం.కామ్ నివాళులర్పిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.