ముగిసిన దాసరి అంత్యక్రియలు

Dasari Narayana Rao last rites performed

Dasari Narayana Rao last rites performed

హైదరాబాద్: ఒక శిఖరం ఒరిగింది. ఒక శకం ముగిసింది. నేలకొరిగిన ఆ దర్శక శిఖరాన్ని కడసారి చూసుకొని అశేష ప్రజానీకం కన్నీటీ తర్పణం వదిలారు. “ఆగదు ఏ నిమిషం నీ కోసమూ..“ అన్న మాటను నిజంచేస్తూ దాసరి నారాయణరావు శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయారు. ఆయన అంతిమ యాత్రకు తరలివచ్చిన లక్షలాదిమంది ప్రముఖులు, అభిమానులు, సామాన్యుల గుండె చెరువు కాగా, వారి కన్నీటిమధ్య దాసరి ఫాం హౌస్ లో అంత్యక్రియలు జరిగాయి.

తాము ఎంతగానో అభిమానించే దర్శకుడు దాసరి నారాయణరావు మృతిచెందారన్న చేదు నిజాన్ని ఇప్పటికీ ఎవరూ నమ్మలేకపోతున్నారు. కానీ మనిషి అబద్ధం చెప్పవచ్చు కానీ కాలం అబద్ధం చెప్పదు. “మరణం తథ్యమనీ, ఏ జీవికి తప్పదనీ“ అన్నమాట దాసరిపట్ల కూడా నిజమైంది. నిన్నటి వరకూ మనతో ఉన్న దాసరి ఇప్పుడు ఓ కలగామారిపోయారు. ఆయన ఓ సినిమాపాటలో “కలచెదిరిందీ, కథ మారిందీ, కన్నీరే ఇక మిగిలిందీ“ అన్నారు. దానిని నిజంచేస్తూ అభిమానులకు కన్నీటిని మిగిల్చి వెళ్లారు.

గత నాలుగు నెలలుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దాసరి మంగళవారంనాడు హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కన్నుమూశారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి తరలించారు. ఎందరోఅభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు అక్కడికి తరలివచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. శోకతప్త హృదయాలతో ఆయనను చివరిసారి దర్శించుకున్నారు. తుది వీడ్కోలు చెబుతూ శ్రద్ధాంజలి ఘటించారు. అశ్రునయనాలతో నివాళులర్పించారు.

బుధవారం ఉదయం దాసరి నారాయణరావు పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఫిలిమ్ నగర్ లోని ఫిలిమ్ ఛాంబర్కు తరలించారు. లక్షలాది అభిమానులు ఆయన భౌతికకాయాన్ని దర్శించుకుని నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడినుండి మొయినాబాద్ లోని ఆయన ఫాంహౌజ్ వరకు అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. అప్పటికే ఫాం హౌస్ కు సినీ, రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు చేరుకుని ఉండగా, వారి కన్నీటిధారల మధ్య దాసరి అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. దాసరి కోరిక మేరకు భార్య పద్మ సమాధి పక్కనే ఆయన కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు పూర్తిచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.