పరిశోధనాత్మక వార్త ప్రచురణ కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధపడ్డ దాసరి

ఉదయం చైర్మన్ దాసరి నారాయణరావు గారి ఇంట్లో రాత్రి 12 తరువాత కీలకమైన సమావేశానికి రావాలని పిలుపు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి పై న్యాయకమిషన్ నివేదిక ప్రతిని ముందే సంపాదించాం. అందులో ఉన్న లోపాలను చీల్చి చెండాడుతూ కొన్ని వ్యాసాలు రాసి సిద్ధంగా ఉంచాం, వాటి ప్రచురణపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. కమిషన్ నివేదిక పై విమర్శావ్యాసాలు ప్రచురించడం చట్ట వ్యతిరేకమా అని అడిగారు. నేను అవునన్నాను. కమిషన్ ఆఫ్ ఇంక్వయిరీ చట్టం 1952 కింద కమిషన్ పనిని కించపరుస్తూ రాస్తే నేరం. అదీగాక అసెంబ్లీలో సమర్పించకముందే బయటపెడితే ప్రివిలేజెస్ భంగపరిచారనే ఆరోపణను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రభుత్వం తలచుకుంటే అరెస్టు కూడా చేయవచ్చు అని వివరించాను. మరేం చేద్దామంటారు అన్నారాయన. ఖచ్చితంగా నివేదికను ఉదయంలో ఉతికి ఎండేయాల్సిందే. మీరు దానికి ముందో ఘాటుమాట రాస్తే బాగుంటుంది. లేదా మా పేర్లతో ప్రచురిస్తే మేం పరిణామాలు ఎదుర్కొనడానికి కూడా సిద్దం అన్నాను.  అంటే చైర్మన్ గారిని అరెస్టుచేయించాలని నీకుందన్నమాట అని మా ఎండీగారు అన్నారు. నేను దాసరి గారిని చూసాను. ఆయన ఏమంటావన్నట్టు చూసారు. మిమ్మల్ని అరెస్టు చేయాలని ఎన్టీ ఆర్ క్యాబినెట్ నిర్ణయిస్తుందంటారా అని నేనడిగాను. చూద్దాం ఏం చేస్తారో అని నవ్వుతూ దాసరి  ఆ విమర్శావ్యాసాలను ప్రచురించడమే కాకుండా తన సంతకంతో ముందుమాట కూడా రాసి, అరెస్టు చేస్తే చేస్కోండి అన్నట్టు సవాలు విసిరారు. మరో ఎడిటర్ ప్రొప్రయిటర్ అయితే ఇంత ధైర్యసాహసాలు చూపేవారా?  శ్రీ వేంకటేశుని పాదపద్మాల సాక్షిగా అనే శీర్షికతో ఆయన మొదటి పేజీ లేఖతో మా వ్యాస పరంపర సంచలనం రేపింది. ప్రభుత్వం వారు పెట్టిన క్రిమినల్ పరువు నష్టం దావాను ఆ తరువాత మేం పదకొండు సంవత్సరాలు ఎదుర్కోవలసి వచ్చింది.

టిటిడిపై మేం రాసిన పరిశోధనాత్మక వార్తారచన పర్యవసానాలు దాదాపు రెండుమూడు సంవత్సరాల పాటు ఉదయంలో రాయవలసిన తీవ్ర సంఘటనలు జరిగాయి. కాంట్రాక్టుల కుంభకోణం తదితర అక్రమాల ఫైళ్లు మాకు చూపాలని కమిషన్ ముందు మేం పిటిషన్ పెట్టాం. టిటిడి అధికారులు ఇవి మా ఫైళ్లు మీరెవరు అడగడానికి అని వాదించారు. తిరుమల హుండీలో ఒక్క రూపాయి వేసిన వాడికి కూడా తన డబ్బు ఏ విధంగా ఖర్చు చేసారో తెలుసుకునే హక్కుందని మేం వాదించాం. కమిషన్ మా వాదనను అంగీకరించి వేలాది ఫైళ్లు టేబుల్ పైన పరిచింది. ఆ ఫైళ్లు చూసే పని నామీదే పడింది. ఆ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఏకధాటిగా ఫైళ్లను పరిశీలించి దాదాపు 250 ఫైళ్లు వేలాది పత్రాల జాబితా తయారు చేసాను. మరునాడు వాటి ప్రతులు కావాలని పిటిషన్ పెట్టాను. దానికి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కాని కమిషన్ నాకు ఆ ప్రతులన్నీ ఇప్పించింది. అవినీతి అక్రమాలపైన విస్తారమైన సాక్ష్యాలు దొరికాయి. అప్పట్లో ప్రభుత్వం కార్యాలయంలో ఫైళ్లు చూపాలని డిమాండ్ చేసే హక్కు లేదు. 2005 సమాచార హక్కుచట్టం లో ఇప్పుడు ఈ హక్కులున్నాయి. 20 ఏళ్ల కిందట లేని ఈ హక్కును ఉదయం అమలు చేయగలిగింది. పై అధికారులను తప్పించడానికి తప్పుడు నిర్ధారణలుచేసినా, కమిషన్ ముందు ఉదయం చేసిన ఆరోపణలన్నా దాదాపు నిర్ధారణ జరగడం అప్పట్లో పెద్ద సంచలనం.

తిరుమల తిరుపతిలో దుర్మార్గాలను ఎండగట్టిన ఆరోపణలు విచారణకు వచ్చినప్పుడు, నేను టిటిడి వారి ఫైళ్లుచూస్తానని కమిషన్ ను కోరాను. అటువంటి సంఘటన అంతకుముందెన్నడూ జరగలేదు. 2005 లో సమాచార హక్కు చట్టం కింద ఫైళ్ల పరిశీలన హక్కు ఇచ్చారు. కాని 1985లో నేను ఆ హక్కును డిమాండ్ చేసి సాధించగలిగానంటే దానికి దాసరి అండదండలే కారణం. టిటిడి ఇవో నా అభ్యర్థనను తీవ్రంగా ప్రతిఘటించారు. తమ అధికారిక ఫైళ్లు చూడడానికి ఈ శ్రీధర్ ఎవరని వాదించారు.

తిరుపతిలో మామీద దాడిచేయడానికి కుట్ర పన్నారని కమిషన్ అధ్యక్షులు న్యాయమూర్తి పెన్మత్స రామచంద్ర రాజుగారు మా లాయర్ కు మాకు మాత్రమే రహస్యంగా ఉప్పందించారు. తక్షణం విమానంలో హైదరాబాద్ తరలిపోయాం. మొదట్లో సంపాదకులకు ఇతర ముఖ్యులకు మాత్రమే దాసరితో కలిసే అవకాశం ఉండేది. రెండు రంగాల్లోనూ ప్రముఖుడు కావడం వల్ల సమయం దొరికేది కాదు. ఆయన్నుఎప్పుడు కలుద్దామా అని హైదరాబాద్ లో ఒక మామూలు విలేకరిగా నేను అనుకుంటూ ఉండే వాడిని. ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో సాగే అవినీతిని ఎండకడుతూ 9 పరిశోధన వార్తా వ్యాసాలు రాసామో అప్పుడు ఆయనే మమ్మల్ని(నన్నూ సాయబాబాను) పిలిచాడు. నిజానికి అంత సంచలనమైన వార్తా వ్యాసాల విషయం దాసరికి ప్రచురించిన తరువాతనే తెలిసింది. కాని ఎబికె ఆధ్వర్యంలో స్వతంత్రంగా ఆ తొమ్మిదిరోజుల సంచలన రచన సాగిపోయింది. తిరుమల పైన కాటేజిల్లో కొన్నింటిని చెరబట్టి భక్తులకు నివాసం కొరత కృత్రిమంగా సృష్టించారని మేము రాస్తే దేవస్థానం వారిని ఖాళీ చేయించక తప్పలేదు. ఆ విధంగా చెరబట్టిన ఒక సినీ నటి తనను మినహాయించాలని కోరితే, ఉదయం పత్రికవారు వెంటబడుతున్నారని మేమేమీ చేయలేమని, అధికారులు చెప్పారట. అప్పుడు మాకు తెలిసిన సినీ దర్శకరత్నమే అని ఆ నటి తనను వదిలేయాలని దాసరి గారిని కోరారట. లేదమ్మా నేనేమీ చేయలేను అని వినయంగా చెప్పి, ఆ విషయం మాతో ఆనందంగా పంచుకున్నారాయన. తిరుపతి వార్తలు రాసి తలనీలాలు సమర్పించి గుండుతో దాసరిని చూడడానికి వెళ్తే ‘ఓహో మీరేనా రాసింది’ అంటూ నవ్వుతూ చూసి ‘మీరయ్యా అసలు హీరోలు’ అని మమ్మల్ని ప్రోత్సహించిన సారథి ఆయన. కొత్తగా సినీరంగంలో ప్రవేశిస్తున్న నాగార్జున, వెంకటేశ్ లకు సినీ పునాదులు వేసింది దాసరి. మా వార్తా సమావేశాలు అప్పుడప్పడు షూటింగ్ స్థలాల్లో జరిగేవి. అక్కడికి చేరడానికి ముందే ‘శ్రీధర్ వస్తున్నాడు ఒక కుర్చీ వేయండి’ అని ఆదేశించేవారు. షూటింగ్ సమయంలో దర్శకుడికి తప్ప మరెవరికీ కుర్చీ ఉండదట, దర్శకుడు కావాలంటే తప్ప. దర్శకుడు నిర్మాతకో లేక మరో అత్యంత ప్రముఖుడికో మరొ కుర్చీవేయనిస్తాడట. నేను వెళ్లి అక్కడ కూర్చుంటే వీడా అత్యంత ప్రముఖుడు అన్నట్టు నన్ను ఆశ్చర్యంగా చూసేవారు. ఆయన షూటింగ్ ఆపి మాతో మాట్లాడేవారు. ఆ హీరోలకు నన్ను అసలు హీరోగా పరిచయం చేసేవారు. 1994లొ నేను న్యాయశాస్త్ర బోధనారంగంలోకి మళ్లి, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో చేరిన తరువాత, అంటే దాదాపు పదేళ్ల తరువాత ఓసారి ఒక సమావేశంలో హీరో సుమన్ తదితర ప్రముఖులకు నన్ను మళ్లీ అసలు హీరో అని పరిచయం చేయడం నా కుటుంబసభ్యుల మరిచిపోలేరు.

సింగరేణి కూలన్నకు భీమా పోటు అనే పేరుతో సింగరేణి కార్మికులను ఎల్ ఐ సి ఏజెంట్లు, ఆఫీసర్లు కలిసి కుట్రలు చేసి దోచుకున్న అక్రమాలను బయటపెట్టినపుడు ఎల్ ఐ సి వారు తమ వ్యాపార ప్రకటనలు ఆపుతామని బెదిరించి మా వార్తావ్యాసాల ప్రచురణను నిలిపివేయించారు. దాసరికి ఈ విషయం తరువాత తెలిసింది.  నెలరోజుల్లో ఎల్ ఐ  సి ఒక అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ఉదయం పక్షాన నిలదీస్తే అధికారులు కుంభకోణం జరిగిందని ఒప్పుకోకతప్పలేదు. ‘ఉదయం ప్రశ్నలకు బిత్తర పోయిన ఎల్ ఐ సి’  అని వారి లోగుట్టు బయటపెట్టే వార్తను మొదటి పేజీలో వేసి జరిగిన నష్టాన్ని సరి చేసారాయన.  ‘అన్నగారి ఆరుకోట్లలో ఆ నూర్గురు లేరట’ అనే శీర్షికన ఒక నూరుగురు ప్రజలు ఉన్నా లేరనే కుట్రనుబయటపెట్టిన పరిశోధనకు ప్రథాన పతాక స్థాయి ఇచ్చారు.

నాకే కాదు రాష్ట్రం మొత్తం మీద విలేకరుల సైన్యానికి, సంపాదక వర్గానికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం స్వేచ్ఛ, పరిశోధించి ప్రచురించే వెసులుబాటు మరవలేనివి. కొన్ని నెలలు జీతాలు లేకపోయినా కార్మికులు ఆపని పత్రిక ఉదయం. దాసరికి ఆర్థిక కష్టాలున్నాయని ప్రతికార్మికుడు సానుభూతి చెందడం అపురూపమైన సంఘటన.

దాసరి నారాయణరావు చిత్రానికి పూలదండ చుట్టి, కింద దీపాలు అమర్చిన ఒక ఫోటో వాట్సప్ మాధ్యమంలో హటాత్తుగా కనిపించింది నిన్న. ఆయన ఇక లేరని అర్థమైంది. వివరాలు తెలుసుకోవాలనిపించనంత విషాదంలోకి మనసు వెళ్లిపోయింది. కులసంకుల సమాజంలో, కళామాధ్యమవ్యాపారవ్యూహా ధురంధరులైన వర్గంచేతిలోకి దాదాపు పూర్తిగా వెళ్ళిపోయిన సినీ పరిశ్రమ (పరిశ్రమో కాదో తెలియదు)లో తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొంటూ కూడా ఒక చోటు సంపాదించుకోగలిగిన డైనమిక్ డైనమేట్ దాసరి. సుప్రసిధ్ధ తండ్రుల సుపుత్రుడు కాడాయన. చెప్పులు లేకుండా నడిచి, సైకిల్ మీద రిక్షాల్లో తిరిగిన సామాన్యుడు, పేదవాడు, కాని కొత్తదేదో చెప్పాలన్న ఉత్సాహం ఉరిమే ఊహలు ఆయన సంపద. కొందరికాయన ఊహలు, భావాలూ ప్రయోగాలూ నచ్చవు. కుటుంబాల గుప్పిట్టో ఉన్న సినీ గుత్త వ్యాపార వాతావరణంలో కులమతాలకు అతీతంగా కొత్త సినీ కుటుంబాన్నిసృష్టించిన శక్తిత్వం దాసరిది. డబ్బురాకపోక సినిమారంగంలో జూదం వంటిదని వేరే చెప్పవనసరం లేదు. ఆ నేపథ్యంనుంచి దాసరి పత్రికారంగంలో ఉదయించారు. ఆంధ్రపత్రికలు, ప్రభల ప్రభలు తగ్గుతున్నరోజుల్లో వెలిగిపోతున్న ఈనాడు కు పోటీగా ఆనాడు ఉదయించిన ఉదయానికి వెనుక సూర్యుడు దాసరి. దాన్ని ఏడు గుర్రాలతో నడిపిన వాడు ఎబికె అయితే అందులో కీలకమైన సంపాదక మణులు కె రామచంద్రమూర్తి, పతంజలి, పొత్తూరి వెంకటేశ్వరరావు, గజ్జల మల్లారెడ్డి: పరిశోధనలు చేసి గుట్టు బయట పెట్టే విలేకరుల సైనిక బృందంలో నన్నూ ఒకడిగా దాసరి గుర్తించారు. విలేకరికి సంపాదకుడికి ఉదయంలో లభించిన స్వేచ్ఛ ఎన్నడూఏ పత్రికలోనూ ఎవరికీ ఉండకపోవచ్చు. 1984లో చేరి 1994లో అస్తమించేదాకా ఆ ఉదయ కిరణాలలో ఒకడినై వెలిగే అవకాశం కలిగింది. నిజానికి దాసరి అమ్మేసిన రోజునే ఉదయం అస్తమయం మొదలైంది. తేజస్సు తగ్గిపోయి ఆ తరువాత ఆ(గి)రిపోయింది. మళ్లీ వెలిగించాలని దాసరి తపించారు. ఆరోగ్యం సహకరించలేదని వేదనపడ్డారు.  ఆ దీపానికి  నూనె వత్తీ అన్ని అయిన అసలు దీపం నిన్న ఆరిపోయింది. గద్యం పద్యం ద్వారా విజ్ఞానాన్ని పంచే పత్రిక అజ్ఞానం మత్తులో ఉంచే మద్యం వ్యాపారుల చేతికి మారినప్పుడే బాధ కలిగింది. వారు మంచివారే అయినా పత్రికా రంగంలో సమస్యలు తీవ్రత వల్ల అనుభవం తగినంత లేకపోవడం వల్ల, అనుభవజ్ఞుల సహకారం అందక ఉదయం ఆగిపోవడం తెలుగు పత్రికారంగంలో ఒక విషాదఘట్టానిక ఆరంభం. ఆవిషాదానికి కొనసాగింపు దాసరి నిష్క్రమణ. ఆర్థిక ఒడుదొడుకులు లేకుండి ఉంటే స్వేచ్ఛాభిప్రాయప్రకటనా సౌలభ్యం ఉదయం రూపంలో బతికి ఉండేది.

-మాడభూషి శ్రీధర్

Have something to add? Share it in the comments

Your email address will not be published. • Anonymous says:

  Legend of media and cinema

 • Dr N B Sudhakar Reddy says:

  Very inspiring story

 • Sayekumar Anisetty says:

  Excellent analysis and inspiring
  Evitallee nirudu kurisina hima vanishingly???