విచారణ పత్తిపాటిపైనా? ప్రతిపక్షనేతపైనా? అగ్రి అక్రమాలు అందరూ చెప్పేవే కదా!

అగ్రి గోల్డ్‌ బాధితులను ఆదుకునే సమస్యకన్నా మంత్రివర్గ సహచరుడైన పత్తిపాటి పుల్లారావును కాపాడ్డంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కువగా దృష్టి పెట్టారా? పత్తిపాటి మాత్రమే గాక ఆయన కాపాడవలసిన మరింత ముఖ్యులెవరైనా వున్నారా? అసలు ఆరోపణలు విచారణలు అంటూ మొదలైతే తీగలాగినట్టవుతుందని జంకుతున్నారా?

ఈ రెండు రోజుల శాసనసభ తీరుతెన్నులు చూస్తుంటే అదే అనిపిస్తుంది. సభ ముగిసిన తర్వాత బయిట ప్రతిపక్ష నేత జగన్‌, మంత్రి పత్తిపాటి, టిడిపి యువరాజు లోకేశ్‌ మాట్లాడినవన్నీ గమనిస్తే సమస్య కన్నా సవాళ్లు ప్రతిసవాళ్లే ముందుకొచ్చాయి. భూములు కొన్న మాట నిజమేనని, అమ్మిన దినకరన్‌ అగ్రిగోల్డ్‌లో డైరెక్టరేనని పత్తిపాటి అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే ఈ సమస్య మొదలైందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెబుతున్నారు. హాయ్ లాండ్‌ భూములు వేలం వేయాలని మొదట కోరింది చంద్రబాబేనని ఆయనే చెబుతున్నారు. ఇవన్నీ నిజమైతే తన భార్య ఆ వివాదాస్పద సంస్థ డైరెక్టర్‌ దగ్గర భూములు కొంటుంటే వద్దని వారించవలసిన అవసరం లేదా? అలాటివి మంచిది కాదని చెప్పవలసిన బాధ్యత పత్తిపాటికీ, ఇప్పటికైనా మందలించవలసిన ధర్మం చంద్రబాబుకు లేవా? వివిధ రకాలుగా మళ్లించబడిన భూమి వేల కోట్లు చేస్తుందనీ, 14 లక్షల మంది బాధితులకు కేవలం 1152 కోట్లు చెల్లిస్తే బతికిపోతారని ప్రతిపక్షనేత చేస్తున్న వాదనను ఎందుకు అంగీకరించడం లేదు? అన్ని ప్రతిపక్షాలు అంతకు మించి బాధితులు చేస్తున్న ఆందోళనకు ఏలినవారు ఎందుకు స్పందించరు?

ఆరోపణలు వస్తే తీవ్రంగా తీసుకోవలసంది ముఖ్యమంత్రి. తప్పు జరగలేదని నిరూపించుకోవలసింది సంబంధిత మంత్రి. అది వదలిపెట్టి ప్రతిపక్ష నేతనూ మంత్రినీ ఒకే గాట కట్టి సవాలు చేయడం అర్ధరహితం. ఈ లోగా పత్తిపాటి ఒకవైపు నుంచి లోకేశ్‌ మరోవైపు నుంచి ఖండనలు కురిపిస్తారు. కాని వాస్తవం ఏమంటే బయిట టిడిపి బిజెపి నేతలే మా వంటి వాళ్ల దగ్గర అగ్రిగోల్డ్‌ భూముల విషయంలో అనేక అక్రమాలు జరిగాయని చెప్పడం నాకు స్వయంగా తెలుసు. దాంట్లో పత్తిపాటి పాత్ర ఏమిటి లేదంటే తప్పు చేసింది ఎవరు తేల్చవచ్చు. దానికి బదులు ఇలా చంద్రబాబు నాయుడు ఒకో కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి తన అధికారాన్ని అనుభవాన్ని ఉపయోగిస్తూ వెళితే ఒకనాటికి అది ఆయనకూ పార్టీకీ కూడా నష్టదాయకంగా పరిణమిస్తుంది. అప్పుడు కాపాడుకునే వీలు కూడా వుండదు. ఆరోపణలు నిగ్గు తేల్చడం, అగ్రి బాధితులను ఆదుకోవడం ముందు జరిగితే ఆ తర్వాత ఇతర సంగతులు తప్పక తేల్చుకోవచ్చు. లేదంటే ఎవరినో కాపాడేందుకే ఆయన తాపత్రయపడుతున్నట్టు భావించవలసి వస్తుంది.

తెలకపల్లి రవి

Have something to add? Share it in the comments

Your email address will not be published.