మీడియా ముచ్చట్లు: ‘షోకులకు’ బలౌతున్న ఉద్యోగులు

ExpressTV Row Channels compete in eviding salaries to staff

ExpressTV Row Channels compete in eviding salaries to staff

డబ్బులున్న ప్రతి ఒక్కడికి ఈ మధ్య ఫ్యాషనైపోయిన అంశం ఏంటో తెలుసా?? ఒకప్పుడు డబ్బులు సంపాదించుకొని కార్లు, బంగళాలు, మందీ మార్బలాన్ని వెంటేసుకొని తిరగడం వంటి షోకులే ఉండేవి. అయితే గత కొన్నేళ్ళుగా డబ్బునోళ్ళ ఆలోచనల్లో వచ్చిన మార్పులు అనేక కుటుంబాలను రోడ్డుకీడుస్తున్నాయి. ఆ కొత్త షోకు పేరే మీడియా సంస్థను ప్రారంభించడం.

ఒకప్పుడు మీడియా సంస్థను ప్రారంభించాలనుకొనే యజమానికి కూడా కూసింత జర్నలిజంపట్ల ఇష్టం, నైతిక విలువలు ఉండడంతోపాటు వార్తల విషయాల్లో ఎక్కడా ఎడిటోరియల్ విషయాల్లో తలదూర్చడం వంటి పనులు చేసేవారు కాదు. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా మీడియా పబ్లిషింగ్ సంస్థల ఏర్పాటులోనూ వచ్చిన మార్పులతో సాఫ్ట్‌వేర్ సంస్థల యజమానులు, రియల్టర్లు, చిట్ ఫండ్ కంపెనీల ఓనర్లు, హాస్పిటల్ యజమానులు ఇలా అనేకమంది మీడియా రంగంలో కొత్త న్యూస్ ఛానళ్ళను ప్రారంభించారు. అప్పటికే ఉన్న అక్ర‌మ‌వ్యాపారాల‌ను కాపాడుకోవ‌డం, మీడియా ముసుగులో దోచుకోవాల‌నే క‌క్కుర్తితో క‌నీసం ప్లానింగ్ లేకుండా చాన‌ళ్లు పెట్టేయ‌డం, అందిన‌కాడికి దండుకుని, దోచుకుని ఉద్యోగుల‌ను న‌ట్టేట ముంచేయ‌డం ఈ మ‌ధ్య ఫ్యాష‌నైపోయింది.

అక్కడివరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మొదట్లో ఉద్యోగులను ఇష్టమొచ్చిన జీతాలకు తీసుకోవడం, అవసరానికి మించి తీసుకోవడం వంటి పనులు చేయడం వల్ల కొన్నేళ్ళ తర్వాత ఆ ఉద్యోగులే వారికి భారంగా తయారై ఐదారు నెలలపాటు జీతాలు ఇవ్వకుండా సతాయించడం, ఆ తర్వాత పీఎఫ్ వంటి సదుపాియాల్లోనూ కోత పెట్టడం వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడడం కామనైపోయింది. ఒక మీడియా సంస్థలో చెలరేగిన తుఫాను సద్దుమణిగిందనుకొనే సమయంలో ఇంకో సంస్థలో ఉద్యోగులను సతాయించడం మొదలైపోతోంది.

మొన్న 6టీవీ, నిన్న సీవీఆర్, ఈరోజు ఎక్స్‌ప్రెస్ టీవీ ఇలా రోజుకో మీడియా సంస్థ ఉద్యోగులను రోడ్డుకీడుస్తున్నాయి. ఛానల్ ప్రారంభించేటప్పుడు సమాజంలో మార్పుకోసం అంటూ తోటకూర కబుర్లు చెప్పే యజమానులు కొన్ని నెలల తరువాత రెవిన్యూ జెనరేట్ అవ్వకపోతుండడంతో జీతాలు ఆపేసి ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మీడియా సంస్థలను ప్రారంభించి డబ్బులు కుప్పలుతెప్పలుగా సంపాదించుకోవచ్చని, అవసరమైతే వాళ్ళ వ్యాపారాలకు అడ్డొస్తున్న కొంతమందిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజొచ్చనే ఆలోచనలతో ఉన్న ఓనర్లకు మార్కెట్‌లో పరిస్థితి దానికి భిన్నంగా ఉండడంతో ఫైనాన్షియల్‌గా దెబ్బతింటున్నారు. ఆ ప్రభావం కాస్తా ఉద్యోగులపై పడుతోంది. హైద్రాబాద్‌లో న్యూస్‌ఛానల్‌లో ఉద్యోగం అనేసరికి ఉన్న ఊరులో చేస్తున్న పనిని వదిలేసుకొని తట్టాబుట్టా సర్దుకొని వచ్చిన ఎంతోమంది అభ్యాగులు ఈ ఉద్యోగాలను నమ్ముకొని పెళ్ళిళ్ళు చేసుకొని స్థిరపడాలనుకొనే సమయంలో ఇలాంటి అవాంతరాల వల్ల పెళ్ళాం పిల్లలతో రోడ్డునపడుతున్నారు.

యువత కోసం భవిత కోసం అంటూ పుట్టుకొచ్చిన ఎక్స్‌ప్రెస్ టీవీ వ్యవహారంలోనూ ఇప్పుడు అదే జరిగుతోంది. ఉద్యోగుల‌కు ఐదునెల‌లుగా జీతాలు ఇవ్వ‌ని ఎక్స్ ప్రెస్ టీవీ త‌మ ఆఫీసుకు తాళం వేసుకుని దుకాణాన్ని బంద్ చేసింది. జీతాలకోసం ఎనిమిది రోజులుగా ఎక్స్ ప్రెస్ టీవీ ఉద్యోగులు ఆఫీసు బ‌య‌టే బైఠాయించి శాంతియుతంగా చేస్తున్న స‌మ్మె కారణంగా తాళం వేసుకుంది యాజమాన్యం. నిరసరన చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావంగా ఎక్స్‌ప్రెస్ టీవీలో ప‌నిచేసిన మాజీ ఉద్యోగులు సైతం స‌మ్మెలో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే జ‌ర్న‌లిస్టు సంఘం టీయూడ‌బ్ల్యూజే ప్ర‌తినిధులు ఎక్స్ ప్రెస్ టీవీ యాజ‌మాన్యంతో మాట్లాడినా వారిలో చ‌ల‌నం రాలేదు. సంస్థ య‌జ‌మాని అమెరికాలో ఉన్నాడంటూ చెప్పి తప్పించుకు తిరుగుతున్నారు.

అయితే పరిస్థితి చేజారిపోతుండడంతో అటు జర్నలిస్టు సంఘాలతోపాటు రాజకీయ నాయకులు చొరవ కల్పించుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఎనిమిది నెలలుగా జీతాలు లేక ఇప్ప‌టికే అప్పుల పాలై.. నిత్యావ‌స‌రాలు కొనేందుకు డ‌బ్బులేక అల‌మ‌టిస్తున్న జ‌ర్న‌లిస్టుల గోడును తెలంగాణ స‌ర్కారు అర్థం చేసుకుని ఎక్స్ ప్రెస్ టీవీ యాజ‌మాన్యం మెడ‌లు వంచి, ఉద్యోగుల‌కు రావాల్సిన బ‌కాయిలు ఇప్పించాల‌ని కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జ‌య‌రాం ప‌త్తాలేకుండా పోయారు. జ‌య‌రాం అనుచ‌రుడు రాజుతో యూనియ‌న్ లీడ‌ర్ చ‌ర్చ‌లు జ‌రిపినా ఎటువంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. జ‌య‌రాంకు చెందిన మ‌రో కంపెనీ హేమ‌ర‌స్ కూడా న‌ష్టాల్లో వుంద‌ని స‌మాచారం.

మొత్తానికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నన్ని న్యూస్ ఛానళ్ళఉ, ఇన్ని మీడియా సంస్థలు దేశంలో ఏ భాషలోనూ లేవనేది గర్వంగా కాదు బాధతో చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు అంతా బాగుంది రాబోయే రోజులుకూడా ఇలానే బాగుంటాయనుకొనే పరిస్థితి ఏమాత్రంలేదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.