జీఎస్టీతో రైతన్నలపై మరింత భారం

farmers-to-be-burdened-by-gst-on-fertilizers-from-july-1st

farmers-to-be-burdened-by-gst-on-fertilizers-from-july-1st

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు తయారవుతోంది దేశంలో రైతన్న పరిస్థితి. ఇప్పటికే అనేక ఇబ్బందులతో వ్యవసాయాన్ని పక్కనబెట్టే పరిస్థితికి చేరుకుంటున్న సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు రైతన్నకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే ఎవరైనా ఆదుకుంటారా అని అర్రులు చాచి ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో జీఎస్టీ పుణ్యమా అని వ్యవసాయం రైతన్నకు మరింత భారంగా మారనుంది. అప్పులు కట్టుకోలేక, రుణమాఫీలు సరిగ్గా అమలు అవుతాయోలేక తెలియక ఇబ్బందులు పడుతుంటే , కొనుక్కోవాల్సిన ఎరువులు కూడా రైతన్నలకు భారంగా మారనున్నాయి.

మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీతో రైతుల నెత్తిన మరింత భారం పడనుంది. దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం కోసం తీసుకువస్తున్న ‘జీఎస్టీ’తో రైతులపై మాత్రం భారం పడనుంది. ఎరువులపై ప్రస్తుతం 4 నుంచి 8 శాతం మధ్య పన్నులు ఉండగా.. జీఎస్టీలో ఎరువులపై 12 శాతం పన్ను విధించేలా జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. దీంతో ఎరువులు, సూక్ష్మ పోషకాల విక్రయ ధరలు అనివార్యంగా పెరగనున్నాయి. ఇప్పటివరకు ఎరువులపై 5 శాతంగా ఉన్న పన్నురేటును జీఎస్టీలో 12 శాతానికి పెంచేశారు.

మరోవైపు ప్రస్తుతం పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌‌వంటి రాష్ట్రాల్లో ఎరువులు, సూక్ష్మ పోషకాలపై ఎటువంటి పన్నులూ విధించట్లేదు. అయితే తెలంగాణవంటి పలు రాష్ట్రాల్లో మాత్రం నామమాత్రపు పన్నులు ఉన్నాయి. దీంతో కొత్తగా మోడీ ప్రభుత్వం నిర్ణయించిన జీఎస్టీతో ఆయా రాష్ట్రాల్లో ఎరువుల ధరలు ఎక్కువగా పెరిగే అవకాశముంది. వీటికితోడు రోడ్డురవాణాపై 5 శాతం జీఎస్టీ విధించడం వల్ల కూడా ఎరువుల చిల్లర ధరలపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఎరువుల రవాణాపై ఎటువంటి సర్వీసుట్యాక్స్‌ లేకపోవడం మనం గమనించాల్సిన విషయం.

అంతేగాక పెరిగిన ధరలను ప్రభుత్వం భరిస్తుందా లేక రైతులపైనే భారం వేస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ మొత్తాన్నీ ప్రభుత్వమే భరిస్తే మాత్రం ఖజానాపై వందల కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. అయితే యూరియా ధరలను ప్రభుత్వమే నియంత్రిస్తోంది. ప్రస్తుతం టన్ను యూరియా ధర 5,630 రూపాయలుగా ఉంది. ఇది మినహా మిగతా ఎరువులపై ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం లేదు. దీంతో ఎరువుల కంపెనీలే ఉత్పత్తి వ్యయం ఆధారంగా ధరలు నిర్ణయించుకుంటాయి. ఈ నేపథ్యంలో బస్తా యూరియా ధర రూ. 30 నుంచి రూ. 36కు పెరగనుంది. ఇక కాంప్లెక్స్ ఎరువుల ధర రూ. 60 నుంచి రూ.80 వరకు పెరుగుతాయని అంచనా.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.