ప్రముఖ నిర్మాత శేఖర్ బాబు ఇక లేరు

హైదరాబాద్: అందరినీ రంజింప చేసే సినిమాలే కాదు .. .. ఆలోచింపచేసే చిత్రాలు కూడా తీసేవారు కూడా కొందరున్నారు. అలాంటి ఎన్నో సినిమాల్ని మనకందించి, తను మరో లోకానికి వెళ్లిపోయారు ప్రముఖ నిర్మాత కె.సి. శేఖర్ బాబు. టాలీవుడ్ లో   రెండు తరాలపాటు ఎన్నో మంచి సినిమాల్ని తీసిన అభిరుచి కల నిర్మాత  శేఖర్ బాబు.  సుదీర్ఘకాలం సినీపరిశ్రమలో ఉండి మంచి మనిషి, మంచి నిర్మాత అనిపించుకున్నారు శేఖర్ బాబు. ఆయన మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం తెలిపారు.

ప్రముఖ నిర్మాత కే.సి. శేఖర్ బాబు శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో  హైదరాబాద్  లోని జర్నలిస్ట్ కాలనీలో తన నివాసంలో  కన్ను మూశారు.  ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. రెండేళ్ల కిందట శేఖర్‌బాబు గుండె ఆపరేషన్ జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు. 1946 మే 1న పుట్టిన కే.సీ. శేఖర్‌బాబు వైవిధ్యమైన ఎన్నో చిత్రాలు నిర్మించారు.

మెగాస్టార్ చిరంజీవితో  ముఠామేస్త్రీ సినిమా తీసిన శేఖర్ బాబు అభిరుచికల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఒకవైపు స్టార్ హీరోలతో భారీ సినిమాలతో పాటు మరో వైపు కుటుంబకథా చిత్రాలు, కామెడీ మూవీస్ కూడా తీశారు.  మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్, సుబ్బరాజు గారి కుటుంబం వంటివి నిర్మించారు. శేఖర్ బాబు  నిర్మాతల మండలి, ఫిల్మ్‌ఛాంబర్‌ లలో   పనిచేశారు.  శేఖర్‌‌బాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.