నిధుల యాత్రలా! కలల మాత్రలా?

అభివృద్ధిలో మనం దేశానికే ఆదర్శం. మరి కొన్నేళ్ళయితే ప్రపంచానికే ఆదర్శం. మన అమరావతి సింగపూర్‌లా ఉంటుంది. సింగపూర్‌ కాకపోతే ఇస్తంబుల్‌లా కనిపిస్తుంది. అదీ కాదంటే షాంఘైలా మెరిసిపోతుంది. రాష్ట్రం నిండా బుల్లెట్‌ రైళ్ళు, కేబుల్‌ కార్లు, ప్రతి జిల్లా లోనూ ఓ విమానాశ్రయం, ఇక మనకు లోటేముంది! ఎంత అద్భుతమైన ప్రకటనలు! ఆ ప్రకటనలు వింటేనే కడుపు నిండిపోతుంది, కళ్ళు చెదిరిపోతాయి. మనం ప్రపంచంలో ఎక్కడున్నామో కూడా తెలియని ఏ పాలపుంతలోకో వెళ్ళిపోతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్ళినపుడల్లా, లేక ఏ విదేశీయుడో మనరాష్ట్రానికి వచ్చినప్పుడల్లా మనల్ని అద్భుతమైన రంగుల ప్రపంచంలోకి తీసుకు వెళ్తుంటారు. ఆ రంగుల కల నుంచి వాస్తవంలోకి వచ్చేసరికి మళ్ళీ బ్లాక్‌ అండ్ వైట్‌ చిత్రమే కనిపిస్తుంటుంది. ఎన్నాళ్ళిలా! ఇంకా కలల్లోనే తేలియాడుతూ కాలక్షేపం చేస్తే ఎలా?.

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు తానే తొలి సి.ఈ.ఓ.నని చంద్రబాబు ప్రచారం చేసుకొన్నారు. అలా చెప్పుకొంటూ విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రానికి వేలు, లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ కథ అయిపోయింది. 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రం కాగా 13 జిల్లాలకే ఇప్పుడు పరిమితమైంది. కానీ ఆయన చేసే ప్రకటనలకు మాత్రం ఎలాంటి పరిమితి కనిపించడం లేదు. అవి ఇంకా కోటలు దాటుతూనే ఉన్నాయి. రాష్ట్రం కుదించుకు పోయినా ఆయన ప్రకటనలు మాత్రం అవధులు దాటుతూనే ఉన్నాయి.

రాష్ట్ర విభజన ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో పక్కన పెడదాం. జరిగి మూడు సంవత్సరాలైంది. ఈ మూడేళ్ళలో మనం సాధించిన వాస్తవ అభివృద్ధి ఎంత అన్నది పెద్ద ప్రశ్నార్ధకం. ప్రకటనల్లో కనిపించే అంకెలు వేరు, వాస్తవాలను ప్రతిబింబించే లెక్కలు వేరు. ఈ విషయం ఏలిన వారికి తెలిసిందే అయినా, ప్రభుత్వ మనుగడ కోసం, తమ మనుగడ కోసం ప్రజలను రంగుల ప్రపంచంలోకి తీసుకువెళ్ళి అవాస్తవాలతో మభ్యపెడుతుంటారు.

విదేశీ పర్యటనలకు వెళ్ళినపుడల్లా అక్కడ ఎందరెందరో స్థానిక, ప్రవాస పారిశ్రామిక వేత్తలు, బహుళ జాతి కంపెనీ సి.ఈ.ఓ.లతో చర్చలు జరపడం, అక్కడి ప్రముఖ కంపెనీలన్నీ మన రాష్ట్రానికి వచ్చేస్తున్నట్లు ఆయా దేశాల నుంచి ప్రకటనలు చేయడం కూడా ముఖ్యమంత్రికి ఒక అలవాటుగా మారిపోయిందనే అనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళవసిందే, అక్కడి పారిశ్రామిక వేత్తలను, బహుళ జాతి కంపెనీలను ఆకర్షించవలసిందే దానిని ఎవరూ కాదనలేరు ఎందుకంటే అభివృద్ధి అనేది ఎన్ని రకాలుగా జరగాలో అన్ని మార్గాలను అన్వేషించవలసిందే. అందుకు ఒకసారి కాదు, ఎన్ని డజన్ల సార్లయినా విదేశాలకు వెళ్ళిరావచ్చు. కానీ వెళ్ళిన ప్రతిసారి పెట్టిన ఖర్చుకు తగిన ఫలితం కనిపిస్తున్నదా అన్నది ఆలోచించవలసి ఉంది. విదేశీ యాత్రలు చంద్రబాబు వెంట వెళ్ళే బృందానికి విహార యాత్రలుగా మిగిలిపోతే లాభంకంటే రాష్ట్రానికి అంతకు మించిన నష్టం ఏముంటుంది?

తాజాగా జరిపిన అమెరికా యాత్ర సహా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో గత మూడేళ్ళలో 12 సార్లు విదేశీ పర్యటనలు చేసి వచ్చారు. ఆయన వెంట అతి ముఖ్యులైన పెద్ద బృందమే ఆయా దేశాలన్నీ చుట్టి వస్తోంది. ఇంత వరకు చైనా, జపాన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల పేర్లు మాత్రమే విన్న మంత్రివర్యులు ఉన్నతాధికారులు చాలామంది ముఖ్యమంత్రి వెంట ఆయా దేశాలన్ని పర్యటించి ప్రభుత్వ ఖర్చుతో విహరించి వచ్చారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి ఆయన వెంట ఉండే భారీ బృందంలో ఎవరెవరు ఉంటున్నారో అందరికి తెలిసినదే. మరి వారంతా ఆయా దేశాన్నీ తిరిగివచ్చి ఏం సాధించి తెచ్చారు. ప్రజల డబ్బును కోట్లలో వెచ్చించి తిరిగి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలను సాధించగలిగారు! ఈ మూడేళ్ళలో ఎన్ని బహుళ జాతి కంపెనీలు వచ్చి రాష్ట్రంలోని ఎన్ని జిల్లాల్లో తమ బ్రాంచిలు తెరిచాయి! ఎన్ని కంపెనీలలో ఎంతమంది రాష్ట్ర యువతకు ఎన్ని వేల ఉద్యోగాలు లభించాయి. ఉత్పాదకత ఎంతశాతం పెరిగింది. అభివృద్ధి రేటు వాస్తవంగా ఏ మేరకు ఎదిగింది! పేదరికం ఎంతశాతం దిగింది. ముఖ్యమంత్రి జరిపిన విదేశీ పర్యటనలన్ని నిజంగా సక్సెస్‌ అయి ఉంటే ఈ ప్రశ్నలన్నిటికి తగిన జవాబులు చెప్పవలసి ఉంది.

గత మూడు సంవత్సరాలలో స్విట్జర్లాండ్‌, దావోస్‌లో మూడు పర్యాయాలు పర్యటించగా, మిగిలిన 10 దేశాలోను ఒక్కొక్కసారి పర్యటించి వచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి  ఈ నెలలో ఓ వారం రోజులు తన బృందంతో కలిసి అమెరికా కూడా వెళ్ళి వచ్చారు. మూడేళ్ళలో 12 సార్లు విదేశీ పర్యటనకు వెళ్ళివచ్చిన ఘనత కూడా దేశంలో చంద్రబాబుదే! ఏ ఇతర ముఖ్యమంత్రి ఇంత తరచుగా విదేశీ పర్యటను వెళ్ళి వచ్చిన దాఖలాలు లేవు, ఈ విషయంలో ప్రధాని మోడీ తర్వాత చంద్రబాబుదే రికార్డు. ప్రధాని పరిధి వేరు. ఆయన బాధ్యత వహించవసిన అంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే కొన్ని డజన్ల రెట్లు అధికం. కానీ ముఖ్యమంత్రి పరిధి ఒక రాష్ట్రానికే పరిమితం. అయినా దేశ ప్రధాని స్థాయిలో ఆయన విదేశీ పర్యటను జరపడమే విచిత్రం!

వెళ్ళిన ప్రతి పర్యటనకు ఖర్చు కోట్లలోనే. పర్యటన ఎంత విలాసవంతంగా ఉంటే రాష్ట్రం అంత అభివృద్ధి చెందిందనుకోవడం ఒక రివాజుగా మారిపోయింది. ఢిల్లీకి వెళ్ళినా, విదేశీ పర్యటనకైనా ఇతర సి.ఎం.లు సాధారణంగా రెగ్యులర్‌ విమానాలనే ఉపయోగిస్తుంటారు. కానీ చంద్రబాబు, ఆయన బృందం మాత్రం ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసుకొంటూ ఉంటారు. సాధారణంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి మాత్రమే ఉపయోగించే ప్రత్యేక విమానాలను చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో వినియోగించడం చూస్తే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందనే కదా. అనిపిస్తుంది అటువంటప్పుడు మా సాయం దేనికి అని ఆయా దేశాల్లోని కంపెనీ మనుషులు అనుకోవడంలో ఆశ్చర్యమేముంటుంది.

ఎంతో ప్రజాధనం`అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించవలసిన ప్రజల సంపదనంతటిని విహారాల కోసం దుబారా చేయడమంటే ఏమిటో గత మూడేళ్ళుగా ముఖ్యమంత్రి జరిపిన విదేశీ పర్యటనల నుంచే తెలుసుకోవలసి ఉంటుంది.

ఇందుకు ఒక్క ఉదాహరణ చాలు. ఈ సంవత్సరం జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా మూడోసారి వెళ్ళి వచ్చారు. గతంలో ఆయన ప్రతిపక్ష నేత హోదాలో కూడా వెళ్ళిన విషయం చాలా మందికి తెలిసినదే. అయితే జనవరిలో జరిగిన సదస్సుకు గాను వాస్తవానికి ఆయనకు ఎలాంటి అధికారిక ఆహ్వానం అందలేదని, కొన్ని కోట్లు ప్రభుత్వ డబ్బు వెచ్చించి తన ప్రైవేట్‌ పర్యటనను అధికారికంగా చేసి వచ్చారనీ అప్పట్లో అనేక ఆరోపణలు వినిపించాయి. ఆరోపణలు వచ్చినపుడు వాస్తవాలేమిటో చెప్పడం ప్రభుత్వ విధికాదా. తెలుసుకోవలసిన అవసరం ప్రజలకు లేదా.

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 నవంబర్‌లో తొలి విదేశీ పర్యటన సింగపూర్‌కు వెళ్ళి వచ్చారు. ఆ పర్యటన సందర్భంగా ఆయన చేసిన ప్రకటన ప్రకారం రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ ప్రభుత్వం ఉచితంగా రూపొందించవలసి ఉంటుంది. కానీ ఏం జరిగింది. సింగపూర్‌ ప్రభుత్వం సుర్బానా అనే కంపెనీకి మాస్టర్‌ ప్లాన్‌ రూపక్పన బాధ్యత అప్పగించడంతో రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు చెల్లించవలసి వచ్చింది. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వేరు, వాస్తవంగా జరిగింది వేరు.

ఆ తర్వాత చంద్రబాబు బృందం జపాన్‌లో పర్యటించి వచ్చింది. ఆ సందర్భముగా అక్కడి ప్రైవేట్‌ కంపెనీలతో 6 కీలక ఒప్పందాలు చేసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఏది అమలులోకి వచ్చిందో, ఏది రాలేదో ఇప్పటి దాకా ఏమీ తెలియదు.

ఆ రెండు అయిన తర్వాత మూడో విదేశీ పర్యటనగా చంద్రబాబు బృందం 2015 మార్చిలో లండన్‌ వెళ్ళి వచ్చింది. రాష్ట్రంలో వివిధ స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి అక్కడి 22 కంపెనీలు మందుకు వచ్చినట్లుగా చంద్రబాబు చెప్పారు. అంతేగాక లండన్‌ పెట్టుబడులు రాబట్టడానికి వీలుగా అక్కడ అమరావతి కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించారు. అయితే స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి ఏ కంపెనీ ముందుకు వచ్చిందో, ఎన్ని కోట్ల పెట్టుబడులకు సిద్దమైందో వాటిలో ఏవి కార్యరూపం దాల్చాయో అదంతా ఇప్పటికి ఓ బ్రహ్మరహస్యంలా మిగిలిపోయింది.

లండన్‌ అయిన తర్వాత చంద్రబాబు బృందం 2015 సెప్టెంబర్‌లో మళ్లీ సింగపూర్‌లో పర్యటించి వచ్చింది. కొత్త రాజధాని నిర్మాణం కోసం రైతు నుంచి తీసుకొన్న భూములను సింగపూర్‌ కంపెనీలకు స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో అప్పగించడం కోసం జరిపిన పర్యటన అది. ఆ స్విస్‌ ఛాలెంజ్‌ విధానం తర్వాత ఎంతగా వివాదాస్పదమైందో అందరికి తెలిసినదే.

ఆ తర్వాత 2016 జనవరిలో మళ్ళి యధవిధిగా దావోస్‌, అది అయిన తర్వాత జూన్‌లో చైనా, జూలైలో రష్యా పర్యటనలు చేశారు. చైనా పర్యటనలో రూ.53 వేల కోట్ల పెట్టుబడుకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయిగాని వాటిలో ఒక్కటైనా కార్యరూపందాల్చినట్లు ఒక్క వార్తా రాకపోవడం గమనించవలసిన అంశం. రష్యా పర్యటన సందర్భంగా కజకిస్థాన్‌లో రెండు ఒప్పందాలను కుదుర్చుకొన్నారు. అయితే వాటి ఆచరణ కూడా అక్కడే నిలిచిపోయిందని సమాచారం.

ఇలా ఇప్పటిదాకా జరిపిన విదేశీ పర్యటనల సందర్భంగా ప్రత్యేక విమానాల ఖర్చు, ఇతర విలాసాల ఖర్చు అన్నీ కలిపి దాదాపు 150 కోట్లదాకా అయినట్లు అధికారుల అంచనా. అయితే కనీసం పెట్టిన ఖర్చుకైనా పెట్టుబడులు వచ్చాయాన్నదే ధర్మ సందేహం.

డ్వాక్రాకు వాల్‌మార్ట్‌ హంగు, కొబ్బరి నీళ్ళకు పెప్పికో రుచి, విశాఖలో మైక్రో సాఫ్ట్‌ కేంద్రం, సోలార్‌ ప్రాజెక్టు, విద్యుత్‌ గ్రేడ్‌, నౌకాశ్రయాల, శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు, అత్యాధునిక సౌకర్యాలతో భవన నిర్మాణాలు ఇలా ఎన్నెన్నో రంగుల కలలు ప్రజలకు కలిగించడమే ధేయంగా చంద్రబాబు విదేశీ పర్యటనలు కనిపిస్తున్నాయి గాని ` ఆయన చెప్పిన లక్ష కోట్ల రూపాయల పెట్టుబడుల్లో ఓ పదిశాతమైనా వచ్చినట్లు కనిపించడం లేదని అధికార వర్గాలే గుసగుసలాడుతున్నాయి. రాష్ట్రంలో 5 వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు చైనా, జపాన్‌ సంస్థలు ఆసక్తి ప్రదర్శించినట్లుగా అప్పట్లో ప్రకటించారుగాని అందుకు సంబంధించిన శంకుస్థాపన అయినా ఇప్పటి దాకా జరగలేదు. ఏ.పి.ని మీ రెండో ఇల్లు అనుకోండి అని చైనీయుల చెవుల్లో చంద్రబాబు హోరెత్తినా వారు వినిపించుకొన్నట్లే కనిపించదు. బీజింగ్‌ మాదిరి ఎపిలో రైల్వే స్టేషన్లు నిర్మిస్తామన్నారు. షాంఘై తరహాలో షాపింగ్‌ మాల్స్‌ అన్నారు. ఇంకా ఎన్నిన్నో చెప్పారు. ఏ విదేశానికి వెళ్తే ఆ తరహాగా రాష్ట్రాన్ని మార్చేస్తామన్నారు. అక్కడి పెట్టుబడున్నీ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళకుండా ఒక్క ఏపిలోనే ప్రవహించబోతున్నాయని హామీలిచ్చారు. జపాన్‌లోని ఫ్యూజీ ఎక్ట్రికల్స్‌, జైకా, మిత్యుబిషి, సుమిటోమీ వంటి దిగ్గజ సంస్థలన్నీ ఏపికి వచ్చేస్తున్నాయనీ, అందువల్ల మనరాష్ట్రం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి వెళ్తుందనీ అరచేతి నుంచి మోచేతి దాకా లాగి చూపించారు. కానీ వాస్తవమేమిటి. చంద్రబాబు చెప్పిన ఆ సంస్థలో ఇప్పటి దాకా ఒక్కటైయినా మన రాష్ట్రంలో కాలు మోపిందా? కనీసం కాలు పెట్టాలనే ఆలోచనతోనైనా ఉందా? ముఖ్యమంత్రే జవాబివ్వాలి.

మూడేళ్ళలో పన్నెండు విదేశీ యాత్రలు చేయడమే గాక విశాఖలో 2016, 2017 జనవరిలో భాగస్వామ్య సదస్సులు కూడా నిర్వహించారు. దానికోసం మళ్ళీ కొన్ని కోట్లు ఖర్చు చేశారు. అయితే వాటివల్ల లభించిన ప్రయోజనం కూడా అంతంత మాత్రమేనని లెక్కులు చెబుతున్నాయి. 2016 జనవరిలో జరిగిన మొదటి భాగస్వామ్య సదస్సు ద్వారా 361 ఒప్పందాలు జరిగిన మాట వాస్తవమే అయినా, వాటివల్ల ప్రభుత్వం చెప్పినట్లుగా నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు రానేలేదు. 10 లక్ష ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అవీరాలేదు. ఇక 2017లో జరిగిన రెండో భాగస్వామ్య సదస్సులో 665 ఒప్పందాలు కుదిరాయనీ, 22 లక్షల ఉద్యోగాలు లభిస్తాయనీ చెప్పారు. మొదటి సదస్సు ద్వారా చెప్పినవే జరగనప్పుడు రెండో సదస్సు ద్వారా ఎన్ని జరుగుతాయో ఎవరు చెప్పగలరు?

చంద్రబాబు బృందమేగాక, అమరావతి డిజైన్లకోసమంటూ ప్రత్యేక అధికార బృందాలు కూడా తరచుగా విదేశీ పర్యటలను జరపడం ఈ మూడేళ్ళలో మామూలైంది. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందులో కొట్టుమిట్టాడుతుండగా ముఖ్యమంత్రే గాక ఆయన అనుగ్రహం పొందిన అధికార బృందాలు కూడా తరచుగా విదేశీ పర్యటలను జరపడం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో సీనియర్‌ అధికారులు ఇప్పటిదాకా దాదాపు 30 దేశాలు పర్యటించి వచ్చినట్లు అంచనా.

ఉన్న వనరులను సమర్ధంగా ఉపయోగించుకొని, రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పరచడానికి ఎన్ని ప్రణాళికలైనా రూపొందిచవచ్చు. కానీ వస్తాయో, రావో తెలియని పెట్టుబడుల కోసం విదేశీ యాత్రలంటూ తరచుగా విహార యాత్రలు చేసిరావడమే తీవ్ర వివాదాస్పదమవుతోంది.

తాజాగా జరిపిన అమెరికా పర్యటనలో కూడా అనేకానేక ఒప్పందాలు ముఖ్యమంత్రి బృందం చేసుకొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఫిన్‌టెక్‌, డేటా సెంటర్లు, ప్రాసెసింగ్‌ రంగాల్లో విస్తరించడానికి ఏపిలో అడుగు పెట్టాలని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్ సంస్థను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇంకా సిస్కో, తదితర సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజి సంస్థలతో కూడా చంద్రబాబు చర్చలు జరిపినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆయా సంస్థలతో చేసుకొన్న ఒప్పందాలలో ఎన్ని కార్యరూపం దాల్చుతాయన్నది ఎప్పటికీ సందేహమే. ఈలోగా ప్రజా ధనం మాత్రం మంచినీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం చివరలో అప్పటి దాకా జరిపిన విదేశీ పర్యటనలు, వాటివల్ల రాష్ట్రానికి లభించిన ప్రయోజనంపై చంద్రబాబు ప్రభుత్వం ఒక శ్వేత పత్రం విడుదల చేస్తే వాస్తవమేమిటో ప్రజలకు అర్ధమవుతుంది.

అడుసుమిల్లి జయప్రకాష్

Have something to add? Share it in the comments

Your email address will not be published.