భావ ప్రకటన స్వేచ్ఛని బ్రతకనివ్వరా??

Frustrated ruling parties trying to suppress Social Media in India

Frustrated ruling parties trying to suppress Social Media in India

సోషల్‌ మీడియాపై కొందరు నేతలకు, ప్రభుత్వ వర్గాలకు ఎందుకంత అక్కసు. స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నట్లే స్వేచ్ఛగా భావించే హక్కు కూడా ప్రజలకు ఉంది. అది అనాదిగానూ ఉంది, రాజ్యాంగమూ ఇచ్చింది. కానీ ప్రజలకు గల ఆ ప్రాథమిక హక్కుకు కత్తెర వేసేవారు ఇటీవల ఎక్కువైపోతున్నారు. అలా కత్తెర వేయడమేమిని ప్రశ్నించే వారిని కాలికింద నలిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభువులకో నీతి, ప్రజలకో నీతి ఎలా ఉంటుంది.

సంప్రదాయంగా వస్తున్న ప్రింట్ మీడియాలో గాని, తర్వాత అభివృద్ధి చెందిన ఎలక్ట్రానిక్‌ మీడియాలో గాని, ఇప్పుడు అత్యంత వేగంగా విస్తరిస్తున్న సోషల్‌ మీడియాలో గాని.. దేనిలోనైనా సమాచారాన్ని ప్రజలకు వీలయినంత త్వరగా చేరవేయడమే వాటి లక్ష్యంగా ఉంటోంది. అయితే మారుతున్న పెట్టుబడిదారీ విధానాలు, ప్రపంచీకరణ ఫలితంగా సోషల్‌ నెట్‌వర్క్‌ ఇటీవల కాలంలో అనూహ్యంగా విస్తరించడంలో మాధ్యమాల సంఖ్య పెరుగుతోంది. వాటి ప్రభావం అధికమవుతోంది. మీడియా స్వరూప స్వభావాలు కూడా కాలానుగుణంగా కొత్త ‘రంగు, రుచి’ని ఆపాదించుకొంటున్నాయి.

వైజ్ఞానిక అభివృద్ధి పెరుగుతున్నప్పుడు దాని ద్వారా లభించే సౌకర్యాలు కూడా విస్తరిస్తాయి. దానిలో భాగంగానే సోషల్‌ మీడియా ఇప్పుడు అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. నిర్ణీత సమయానికి రేడియోలో వచ్చే వార్తల దాకా ఇప్పుడు ఎవరూ వేచి ఉండక్కరలేదు. మరుసటిరోజు ఉదయం పలకరించే దినపత్రిక కోసం 24 గంటలు ఎదురు చూడనక్కరలేదు. టెలివిజన్‌ ఛానళ్లలో గంట తర్వాత వచ్చే న్యూస్‌ బులెటిన్‌ కోసం, ఓ పది నిమిషాల తర్వాత స్క్రోలింగ్‌లో కనిపించే బ్రేకింగ్‌ న్యూస్‌ కోసం కూడా ఇప్పుడు వేచి ఉండనక్కరలేదు. కొద్ది సెకన్లలోనే ఫ్లాష్ న్యూష్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బహుశా అందుకేనేమో. అందరిలోనూ అంత గుబులు. అనుచిత వ్యవహారాలు నడిపే నాయకులందరికి అంత దిగులు!

రాజకీయ నాయకులో, లేక సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారో.. తాము అనుచితంగా వ్యవహరిస్తే లేని తప్పు అది మీడియాలో ప్రజలకు చేరినపుడు మాత్రం తప్పెలా అవుతుంది. అలా చేర్చే వారిని శత్రువులుగా భావించడం ఒప్పెలా అవుతుంది. మీడియాపై ప్రజలకు చాలా నమ్మకం ఉంటుంది. తమ చుట్టూ, తాము నివసించే సమాజం చుట్టూ ఎప్పుడు ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలనే తహతహ వారిలో ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఇన్ని రకాల మాధ్యమాలు ప్రజల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. వాటిని ఆహ్వానించడానికి బదులుగా ఆ మీడియాను, వాటి నిర్వాహకులను కబళించడానికి ప్రయత్నిస్తే అది ప్రజాస్వామ్యమెలా అవుతుంది.

మనం నియంతల కాలంలో లేము. కానీ ఆ నియంతల వారుసులెక్కువతుండడంతో ప్రజల స్వేచ్ఛాగళాలకు, వారి కలాలకు సంకెళ్లు పడుతున్నాయి. ఇది ఏ రూపంలో కనిపించినా దానిని నిరసించవలసిందే. కానీ ఆ నిరసనను కూడా వ్యక్తం చేయనీయకుండా, కనీసం తమ భావాలను పరులతో పంచుకోవడాన్ని సైతం అంగీకరించకుండా నాయకులు వ్యవహరించడమే సిగ్గుచేటు.

ప్రజల ప్రతినిధులుగా చట్టసభలలోకి అడుగు పెడుతున్నవారు కనీస సభ్యతను కూడా మరచిపోయి, ‘త్వంశుంఠ అంటే త్వంశుంఠ’ అని నిందించుకోవడమేగాక ఒకరిపై ఒకరు భౌతిక దాడికి దిగడానికి కూడా సిద్దమవుతున్నారు. చట్టసభల దిగజారుడుతనానికి ఎన్ని ఉదహరణలైనా చెప్పుకోవచ్చు.  గతంలో తమిళ అసెంబ్లీలో చూసిన దుశ్శాసన పర్వాన్ని ఎవరు మరిచిపోగలరు. అప్పటి ప్రతిపక్ష నాయకురాలు జయలలితను చీరలాగి అవమానించిన డిఎంకె నేతల తీరును మీడియా ద్వారా తెలుసుకొన్న వారెవరైనా మరువగలరా? ప్రజాసమస్యలపై చర్చించడాన్ని వదిలేసి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఎంత రచ్చరచ్చ చేయడంలేదు. ఇందుకు ఏ రాష్ట్ర చట్టసభా మినహాయింపు కాదు.

ఎపి నుండి యుపి దాకా, ఒడిశా, బీహార్‌, గుజరాత్‌ ఇలా దాదాపు అన్ని చట్టసభలు, వాటి ‘గౌరవనీయ సభ్యులు’ ఒకే దారిలో వెడుతున్నాయి. అది చట్టసభలు, ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవలసిన దారి. గవర్నర్‌ ప్రసంగిస్తుండగా తమ చేతుల్లోని పుస్తకాలు చించివేసి వాటిని ఆ ‘పెద్ద మనిషి’పై విసిరిన ఘటనలు గతంలో పలుమార్లు తెలుగు చట్టసభల్లో కూడా చూశాం. ఒడిశా అసెంబ్లీలో, బీహార్‌ అసెంబ్లీలో మైకులు విరిచి, వాటిని విసిరేసుకున్న ఘటనలు, సభ్యులు బాహాబాహీకి దిగిన ఘటనలు పలుమార్లు చూశాం.

అంతెందుకు! నాలుగు రోజుల క్రితం మే 31వ తేదీన ఢిల్లీ అసెంబ్లీలో ఒక సభ్యునిపై మిగిలిన సభ్యులు చేసిన దాడిని వారి సభ్యతకు నిదర్శనంగా భావించగలమా? ఆప్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి కపిల్‌ మిశ్రాపై కొందరు సభ్యులు భౌతికంగా దాడి జరిపి తీవ్రంగా గాయపరిచారు. ఓ ఎమ్మేల్యే ఆయన గొంతు నులిమేంత పనిచేశారు. సిఎం కేజ్రీవాల్‌, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌లపై అవినీతి ఆరోపణలు చేయడంతో అధికార ఎమ్మెల్యేలు ఆ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇలా ‘గౌరవ సభ్యులే ’ చట్టసభల గౌరవాన్ని తుంగలో తొక్కుతున్నపుడు, గంగలో కలుపుతున్నపుడు – ప్రజలు ఆ ఘటనలపై స్పందించడం, ప్రశ్నించడం మాత్రం అమర్యాద ఎలా అవుతుంది?

ప్రజలు అన్నివేళలా ప్రశ్నించే పరిస్థితిలో ఉండకపోవచ్చు. అందుకే ఆ బాధ్యతను మీడియా తలకెత్తుకుంటుంది. కానీ ఆ మీడియా కూడా అంటే ఇంతకాలం ప్రజలకు ప్రధానంగా సమాచార వారధిగా ఉంటున్న ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలు కూడా కొన్ని సందర్భాలలో పెడతోవపడుతుండడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి సోషల్‌ మీడియా పరుగులు పెడుతోంది. నేర చరిత్ర కలిగిన వారు, బడా వ్యాపారులు చట్టసభల్లోకి ప్రవేశించడం, మీడియా కూడా వారి చేతుల్లోనే ఉండడంతో ఒక వర్గానికే కొమ్ముకాసే ధోరణిని ఆ మీడియా అనుసరిస్తుండడంతో నిష్పక్షపాతంగా వాస్తవాలను ప్రతిబింబించే  మీడియా ఇప్పుడు అవసరమవుతోంది. అది ప్రజలకు సోషల్‌ మీడియా రూపంలో కనిపిస్తోంది.

అందుకే నాయకగణం ఇప్పుడు ఆ సోషల్‌ మీడియా నోరు నొక్కేయడానికి అంతగా ప్రత్నిస్తోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలు నిర్వహించాలంటే అది కోటానుకోట్లున్న బడా బాబులకే చెల్లుతుంది. ఆ కోట్లు వారికెలా వస్తున్నాయో చాలా మందికి తెలిసినదే. అటువంటి వారు నడిపే మీడియాలో వాస్తవాలు ప్రతిబింబించే అవకాశం కరువవడం వల్లనే సాధారణ ప్రజలు సైతం నడుపుకునే సోషల్‌ మీడియా అవసరం ఇప్పుడు అంతగా ఏర్పడుతోంది. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, లింక్‌డ్‌ఇన్‌, ట్విట్టర్‌ వంటి అనేకానేక సోషల్‌ మీడియా సాధనాలు ప్రజలకు అంతగా చేరువవుతున్నాయి. కానీ నాయకగణమే దానిని సహించలేక ఆంక్షల కత్తులను విసురుతోంది. ఎమర్జెన్సీ పరిస్థితి లేకపోయినా ఆ కాలంనాటి అవలక్షణాలు మాత్రం మన నేతల మెదళ్ళలోకి ప్రవేశిస్తున్నాయనిపిస్తోంది.

ఆ మధ్య పఠాన్‌కోట్‌పై ఉగ్రదాడిని ప్రసారం చేసినందుకు ఎన్డీటీవీపైనే నిషేధం విధించారు. ఓ బిజెపి నేత ఇంటిలో గృహ హింసకు గురవుతున్న ఓ బాలుని దయనీయ గాథను ప్రసారం చేసినందుకు ‘న్యూస్‌ టైమ్స్‌ ఆఫ్‌ అస్సాం’పై వేటుపడింది. అభ్యంతరకర సమాచారాన్ని ప్రసారం చేసిందనే ఆరోపణతో ‘వరల్డ్‌ కేర్‌ టీవీ’ ఛానెల్‌ను ఆ మధ్య వారంరోజుల పాటు నిషేధించారు. అంతే కాదు ఇటీవల నెలరోజుల పాటు జమ్ము-కాశ్మీర్‌లో సోషల్‌ మీడియాపై కూడా నిషేధం విధించారు. మన రాష్ట్రంలో కొందరు వాట్సప్‌ అడ్మిన్‌లను అరెస్టుచేసి వారిని నానా కష్టాలకు గురిచేశారు. ఇదంతా ఏమి? ప్రజాస్వామ్యమేనా? ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అయిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందా, లేదా?

సోషల్‌ మీడియాలో స్వేచ్ఛగా వాస్తవాలు రాసే అవకాశం ఉన్నా బెదిరింపులు, దాడులు వారి నోళ్లు నొక్కుతున్నాయి. ‘పొలిటికల్‌ పంచ్‌’ అడ్మిన్‌ రవికిరణ్‌ కావచ్చు, రేపు మరొకరు కావచ్చు. సోషల్‌ మీడియా నిర్వాహకులను అలా అరెస్టు చేస్తూ వెళ్తే ప్రజలందరిని నిర్బంధంలోకి తీసుకొంటున్నట్లే కదా. ఇదేమి చీకి పాలన. కలాలు, గళాల గొంతు నొక్కివేసే అరాచక సంస్కృతి నుంచి బయటపడడం ఎలా?

ఆ మధ్య బాల్‌థాకరే మరణానంతరం ఫేస్‌ బుక్‌లో పోస్టయిన ఓ కామెంటును ‘లైక్‌’ చేసినందుకే రేణు శ్రీనివాసన్‌ అనే యువతిని అరెస్టు చేశారు. అలాగే థాకరే మరణానంతరం బంద్‌ పిలుపు నివ్వడంపై  ఆన్‌లైన్‌లో ప్రశ్నించిందని మరో యువతి షహీన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతాలు మీడియాలో తీవ్ర సంచలనం కలిగించిన ఉదంతం అందరికి తెలిసినదే. మమతా బెనర్జీపై వ్యంగ్య కార్టూన్లు ఆన్‌లైన్‌లో ప్రచారం చేశారనే అభియోగంతో అరెస్టయిన జాదవ్‌పూర్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ అభిషేక్‌ మహా పాత్ర గురించి మనం చూశాం. ‘తలలు నరకండి, కాళ్లు విరవండి’ అంటున్న ఉన్మాదాన్ని కూడా చూస్తున్నాం. ఇవన్నీ మీడియా గొంతు నొక్కడానికే.

మరికొంచెం వెనక్కి వెళ్తే… గతంలో అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పత్రికల్లో అనేకానేక వ్యంగ్య కార్టూన్లు వచ్చిన విషయం అందరికి తెలిసినదే. ఆనాటి నేతలపై ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక నిత్యం వ్యంగ్య కార్టూన్లు ప్రచురించేది. ఇంగ్లీషు దినపత్రికల్లో ఇవి మరింత ఎక్కువగా కనిపించేవి కూడా. కానీ అప్పట్లో ఆ పతిక్రలపై ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో అదే తరహాలో వస్తుంటే – వాటిని ఎలా అణచివేద్దామా అని చూస్తున్నారు. ఇది ఎంతైనా విచారకరమైన అంశం.

అంటే అధికార నేతలు, ఇతర రాజకీయ నాయకుల్లో ‘అసహనం’ అంతగా పెరిగిపోతున్నదన్న మాట. తమ తప్పులు ఎవరో బయటపెడుతున్నారనేసరికి వారికి భరించలేని పరిస్థితి అంతగా ఏర్పడుతున్నదన్న మాట.

ఈ ‘అసహనం’ యుపిఎ హయాంలో మరింతగా బయటపడి 2000 సంవత్సరంలో ‘సమాచార సాంకేతిక విజ్ఞాన చట్టం’ (ఐటియాక్ట్‌)లో 66-ఎ సెక్షన్‌ను చేర్చేదాకా వెళ్లింది. ఆన్‌లైన్‌లో ఏ విధానాన్ని వినియోగించుకొని అయినా స్థూలంగా సమాజాన్ని ప్రభావితం చేయసేలా, లేక ఒక వ్యక్తిని అవమాన పరిచేలా సందేశాల, ఫోటోలు వంటివి ప్రచారం చేస్తే ఆ సెక్షన్‌ కింద నేరమవుతుంది. అలా అరెస్టు చేస్తే దాదాపు మూడేళ్లు జైలుశిక్ష పడే ప్రమాదం కూడా ఉంది. కానీ పాలకులు దాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాప్రతినిధుల తప్పులను ఎత్తి చూపి నిజాలు బయటపెట్టిన వారిని బలిచేస్తూ వచ్చారు. దీనిని సవాలు చేస్తూ దాఖలైన ‘పిల్‌’ పై ఇటీవల సుప్రీం కోర్టు విచారణ జరిపి ఆ సెక్షన్‌లో ఉన్న అంశాలు రాజ్యాంగంలోని భావప్రకటనా స్వేచ్ఛకు ఉద్దేశించిన ఆర్టికల్‌ 19(1ఎ)కు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆ సెక్షన్‌నే రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఇది సుప్రీంకోర్టు చెంపదెబ్బ. తన ఇష్టానుసారం ఐటి యాక్ట్ లో సెక్షన్లు చేర్చి ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించివేయడానికి ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తే ఫలితం ఎలా ఉంటుందో సుప్రీంకోర్టు ఆ తీర్పు ద్వారా ఒకసారి రుచి చూపించింది.

ఇతరుల మనోభావాలను గాయపరిచే విధంగా ఎవరైనా నిజంగా ప్రయత్నిస్తే దానికి అవసరమైన చర్యలున్నాయి. కానీ ఆ వంకతో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించాలనుకోవడమే ప్రజాస్వామ్య విరుద్ధం. ఆ సెక్షన్‌ 66-ఎను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని మోడీ ప్రభుత్వం కూడా ఒక దశలో ప్రయత్నించింది. కానీ సుప్రీంకోర్టు కేంద్రం వాదనను తిరస్కరిస్తూ ఆ సెక్షన్‌ను తొలగించడమే న్యాయమని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ఆ సెక్షన్‌ను రద్దు చేసిన తర్వాతనైనా ప్రభుత్వ నేతల ఆలోచనాధోరణి మారకపోవడమే విచారకరం.

సోషల్‌ మీడియా ద్వారా ఎదురవుతున్న కొన్ని అవాంఛనీయ అంశాలను తిరస్కరించవలసిందే. దానిని ఎవరూ కాదనరు. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో ఇటీవల జరిగిన ఓ ఉదంతం చాలా తీవ్రమైన ప్రతిస్పందనను చవిచూసింది. ఓ యువకుడు వాట్సప్‌లో ఓ వర్గాన్ని కించపరిచేలా వాయిస్‌ మెసేజ్‌ను పోస్టు చేయడంతో అది రెండువర్గాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణలకు దారితీసి పోలీసులు లాఠీచార్జి జరిపేదాకా వెళ్లింది. అల్లరి మూకలు రెచ్చిపోయి తీవ్ర విధ్వంసమే సృష్టించారు. సోషల్‌ మీడియా ద్వారా ఇలాంటి ఉద్రిక్తతలు సృష్టించడాన్ని కచ్చితంగా అదుపుచేయవలసిందే. కానీ ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను మొత్తంగా అడ్డుకోవడానికి ప్రయత్నించడమే క్షమార్హం కాదనిపిస్తుంది.

వైజ్ఞానికంగా అభివృద్ధి చెందుతున్నపుడు దాని ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తుంది. మీడియాపై కూడా అదే కనిపిస్తోంది. ఒకవంక మనం సైబర్‌ యుగంలో ఉన్నాం, రాష్ట్రాన్ని సైబర్‌ హబ్‌గా మారుస్తాం అంటూ ప్రకటనలు చేస్తున్న పాలకులు వాస్తవానికి ప్రజలు ఆ అభివృద్ధికి దూరమయ్యేలా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను నిష్పాక్షికంగా తెలిపే వారిపై అణచివేత అస్త్రం ప్రయోగించడమంటే అదే. ఈ వైఖరిలో తొలుత మార్పు రావలసి ఉంది.

ఫోర్త్‌ ఎస్టేట్ గా ఇంతకాలం పేరు తెచ్చుకున్న ప్రింట్ జర్నలిజానికి సమాంతరంగా ఇప్పుడు సోషల్‌ మీడియా ‘ఫిఫ్త్‌ ఎస్టేట్`గా అభివృద్ధి చెందుతోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లోని పెడధోరణులు లేని వాస్తవ చిత్రాన్ని సోషల్‌ మీడియా ప్రజలు ముందుకు తెస్తోంది. దానిని చూసి భయపడే నాయకులు అణచివేత విధానాలు అవలంభిస్తూ వెళ్తే ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఇప్పుడు లేదు కదా! అందరికి అన్నీ తెలుస్తున్నాయి. వాట్సప్‌లో ఏదో రాశాడని అతడిని అరెస్టు చేయడం మొదలు పెట్టి వరుసగా జైళ్లలో వేసుకొంటూ వెళ్తే దానిని ప్రజలు హర్షించరు కదా, వారి చేతులో ఓటు అనే ఆయుధం ఉన్నా విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవడం అవసరం.

ఐటి చట్టంలోని 66-ఎ సెక్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసినపుడే ప్రభుత్వాల వైఖరిలోను, అధికార నాయకుల ధోరణిలోను మార్పు వచ్చి ఉంటే గత రెండు మూడు నెలల్లో నాలుగైదు అరెస్టులు జరిగి ఉండేవి కావు. అందుకే నాయకులు, ప్రభుత్వ ధోరణిలో తొలుత మార్పు రావాలి. మనం ఎటువంటి సభ్య ప్రపంచంలో, నాగరిక ప్రపంచంలో ఉన్నామో ప్రజాప్రతినిధులంతా నిత్యం గుర్తుంచుకోవాలి. నాయకులు సవ్యంగా ఉంటే మీడియాలో మాత్రం ఎందుకు విరుద్ధమైన స్పందనలు వస్తాయి? అంతా ఆలోచించడం అవసరం. గళాలను, కలాలను బతికిస్తేనే సమాజం ఎప్పుడూ ముందుకు వెళ్తుంది.

అడుసుమిల్లి జయప్రకాష్

Have something to add? Share it in the comments

Your email address will not be published.