‘బ్యాలెట్టే’ నా తూట” – గద్దర్

త్యాగాల తెలంగాణ రావాలి..  ఈ పొలిటికల్ మాఫియా పోవాలి.. పవన్ తో పాదం కలుపుతా.. కోదండరామ్ తో పదం కలుపుతా.. ‘మహాజనసమాజంతో’ రాజకీయ మహా ప్రస్థానం చేస్తా.. 2019కి ముందే మరో రాజకీయ శక్తిని నిర్మిస్తా.. అంటున్న .. కదం తొక్కుతున్న ‘కవి సైనికుడు’ గద్దర్ తో ‘ముఖాముఖి’.

ప్రశ్న: ఇంతటి భావుకత, ఆశువుగా పాటను సృష్టించి, పాడే లక్షణాలు ఎక్కడ నుండి వచ్చాయి?

గద్దర్: జీవితం నుండి వచ్చింది .. ప్రకృతి నుండి వచ్చింది. భావం, పాటైంది. ఆ పాట భౌతిక శక్తిగా మారుతోంది.

ప్రశ్న: మీ గొంతు ఎవరిది?

గద్దర్: తల్లి నుండి కంఠం, తండ్రి నుండి పాట వచ్చాయి.

ప్రశ్న: మీ పాటకు ప్రయోజనం ఉందా?

గద్దర్: ప్రజల భాషలో, ప్రజల కోసం చెప్పే కవిత్వంలో ప్రయోజనం ఉంటుంది. ‘అసతోమా స్వర్గమయ..’ అందులో సత్యం ఉంది. జనం భాషకు అంతకు మించిన శక్తి ఉంది.

ప్రశ్న: తెలంగాణ రాష్ట్ర సమితి (T.R.S) 16 సంవత్సరాలు పండగ చేసుకుంది కదా? కె.సి.ఆర్ పాలన ఎలా ఉంది?

గద్దర్: ఇది దొరల పాలన. ఉన్నత వర్గాల పాలన. ఆయన గొర్రెలు ఇస్తాను, బర్రెలు ఇస్తాను అంటున్నాడు. కానీ, రాజ్యం ఇస్తాననడం లేదు

ప్రశ్న: తెలంగాణ కోసం ఉద్యమాలు  చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది కదా? ఇంకా ఉద్యమాలు అవసరమా?

గద్దర్: మేం కోరుకున్న, కోరుతున్న తెలంగాణ రాలేదు. ఇది కేవలం భౌగోళిక తెలంగాణ. మాకు త్యాగాల తెలంగాణ కావాలి, రావాలి.

ప్రశ్న: “త్యాగాల తెలంగాణ” అంటే?

గద్దర్: ఎవరైతే త్యాగాలు చేశారో?  ఎవరికోసమైతే ఉద్యమాలు జరిగాయో? వారు పాలనలో భాగం కావాలి. అసలు వారే పాలించాలి. కింది వర్గాల వారికి ఎటువంటి మేలు జరగడం లేదు.

ప్రశ్న: మిషన్ భగీరథ, కాకతీయ వంటి ప్రాజెక్టులు, వచ్చాయి కదా?

గద్దర్: ఆ నీరు, చుట్టూ ఉన్న భూమి చిన్న వర్గాలకు అందడం లేదు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలన వచ్చే ప్రయోజనం నెరవేరడం లేదు.

ప్రశ్న: రిజర్వేషన్లు..?

గద్దర్: కె.సి.ఆర్ వర్గాల జనాభా చాలా తక్కువ. ఆంధ్రాలోను అంతే. 52% జనాభా జీవనంలో ఏ మార్పు లేదు. రాజ్యాంగం ప్రకారం రావలసిన దాంట్లో 25% కూడా అందడం లేదు. ఇది పొలిటికల్ మాఫియా. ఈ మాఫియా నుండి విముక్తి కావాలి.

ప్రశ్న: కె.సి.ఆర్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కోదండరాం పోరాటం చేస్తున్నారు కదా! కోదండరాం ఒంటరిగా మిగిలారా?

గద్దర్: అవును. తెలంగాణ రాగానే ఆయన అందరికి  జేజేలు కొట్టాడు. కావలసిన డిమాండ్లను గట్టిగా అడగలేకపోయాడు. అందుకే ఒంటరిగా మిగిలాడు.

ప్రశ్న: కె.సి.ఆర్ ను నిలదీసి, అడిగే పరిస్థితి ఆయనకు ఉందా? ఐతే? మీరెందుకు అడగలేకపోయారు?

గద్దర్: కోదండరాంతో పాటు మేము కూడా నిలదీయలేకపోయాము. అప్పుడే తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకోలేదు. అందుకే, నేడు మరో ఉద్యమం అవసరం వచ్చింది.

ప్రశ్న: కోదండరామ్ కి మీరు అండగా నిలుస్తారా?

గద్దర్: తప్పనిసరిగా. భవిష్యత్తులో కోదండరామ్ పెద్ద శక్తి అవుతాడు.

ప్రశ్న: ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే? మావోయిస్ట్ లు బలపడతారని, హింస, అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతాయని అప్పుడు శ్రీ కృష్ణ కమిటీ కూడా హెచ్చరించింది కదా?

గద్దర్: చూస్తున్నారు కదా. ఏం పెరిగాయో. ఇప్పటికీ పల్లెల్లో ప్రజలు అన్నల కోసం ఎదురు చూస్తున్నారు. కష్టమొచ్చినప్పుడు చెప్పుకోవడానికి మావో అన్నలు కూడా లేరని బాధపడుతున్నారు.

ప్రశ్న: మావోయిజమ్ బలహీనమైందా?

గద్దర్: యుద్ధంలో శాంతి అనే దశ ఉంటుంది. WAR & PEACE అంటారు కదా! అదే ఇది. అంతేగానీ, ప్రస్థానం ఆగలేదు. ఒకప్పుడు నలుగురో, ఐదుగురో ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య లక్షలకు చేరింది.

ప్రశ్న: మీకు బుల్లెట్ గాయాలై ఇటీవలే 20 ఏళ్ళు పూరైంది కదా?

గద్దర్ : అవును. అప్పుడు రక్తం మడుగుల్లో కొట్టుకున్నాను. నా ఆత్మబలం, అభిమానుల బలం నన్ను బతికించింది. మాకు తూటాలు కొత్త కాదు. ఒకప్పుడు మా గుండెపై గన్నులు పెట్టినా? లక్షల మందితో సభలు చేశాము.

ప్రశ్న: ఇటీవలే మీరు ఓటరుగా నమోదయ్యారు. ఈ వ్యవస్థపై మీకు నమ్మకం ఏర్పడిందా?

గద్దర్: నేను ఓటుకు వ్యతిరేకం కాదు. మనల్ని దోచుకున్నవాడికి వెయ్యద్దు అనేది నా సిద్ధాంతం.

ప్రశ్న: మీ ప్రయాణం బుల్లెట్ నుండి బ్యాలెట్ కు మారిందా?

గద్దర్: మార్క్స్ నుండి అంబేడ్కర్. అంబేడ్కర్ నుండి మార్క్స్. ఇది శాస్త్రీయ పరిణామం. అంతేకాని నా పంథా ఏమి మారలేదు.

ప్రశ్న: ఇటీవలే మహాజన సమాజం స్థాపించారు కదా? ఇదేనా మీరు ప్రారంభించే పొలిటికల్ పార్టీ?

గద్దర్: ప్రస్తుతం ఇది ఉద్యమాల్లో త్యాగాలు చేసిన వారి కుటుంబాలకు సంబంధించిన సమాజం. దీనికి శ్రీరాములు శ్రీనివాసు అధ్యక్షుడు. నేను గౌరవ అధ్యక్షుడిని, నా కుటుంబం మొత్తం ఇందులో సభ్యులు.

ప్రశ్న: దీని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు ఏంటీ?

గద్దర్: భువనగిరిలో త్వరలో మహాసభ ఏర్పాటు చేస్తాము. రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యమ కుటుంబాల నుండి ప్రజలు వస్తారు. సుమారు పది లక్షల మంది హాజరవుతారు.

 ప్రశ్న: ప్రస్తుతం, తెలంగాణలో మరో పొలిటికల్ పార్టీ ఏర్పాటు అవసరముందా? ఒకవేళ ఏర్పడినా? పరిపాలనలోకి వచ్చే అవకాశముందా? మీరు కలలు కనే రాజ్యం ఏర్పడుతుందా?

గద్దర్: చాలా అవసరం ఉంది. ఆ VACUM ఉంది. భావసారూప్యత కలిగిన వారందరినీ కలుపుకొని నడిపిస్తాం. ముందు ముందు ‘మహాజన సమాజం’ బలమైన రాజకీయ శక్తిగా మారుతుంది. ఛత్తీస్ గడ్, జార్ఖండు, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాలన్నీ తిరిగి చూశాను. తెలంగాణ కూడా అదే విధంగా రూపాంతరం చెందుతుంది.

 ప్రశ్న: ‘పల్లె పల్లెకు పాట- పార్లమెంటుకు బాట’ అంటున్నారు కదా? మీకు M.P కావాలని ఉందా?

గద్దర్: పార్టీ అంటే ఓట్లు- ఓట్లు అంటే బీరు, బిరియానీ, కోట్లు అంటారు. ఇలానే అందరిని చెడగొడుతున్నారు. నేను M.P అవడం కాదు. యువ పౌరులని పాలకులని చేయాలి. చట్ట సభలకు పంపాలనేది నా లక్ష్యం. 18 నుండి 40 ఏళ్ల లోపు యువత దేశంలో సుమారు కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు. వీరు చైతన్యమవ్వాలి. అదే నా సంకల్పం.

ప్రశ్న: పవన్ కల్యాణ్ తో కలిసి ఎన్నికలలో ప్రచారం చేస్తారా? ఆయనతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తారా?

గద్దర్: పవన్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నా అభిమాని. నాకు మిత్రుడు. మా ఇద్దరి భావాలు కలుస్తాయి. పాలకులను ప్రశ్నించే వాళ్లంటే నాకు ఇష్టం. వారితో నేను ఎప్పుడు కలుస్తాను. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవితో కలిశాను.

ప్రశ్న: ప్రజారాజ్యం, చిరంజీవి రాజకీయాల్లో విఫలం అయ్యారు కదా? పవన్ కల్యాణ్‌ విజయం సాధిస్తారా?

గద్దర్: రాజకీయాలలో గెలుపు ఓటములు సర్వసాధారణం. పవన్ భావాలు, ఆలోచనలు నాకు ఇష్టం.

 ప్రశ్న: మీ పాటకు ఊపు తగ్గిందా?

గద్దర్: నాతో పాటు రా. నీకే తెలుస్తుంది. నా పాట సైరన్, కోడికూత, బైబిల్, ఖురాన్, గుడిలో గంట వంటిది. అది ఎప్పుడు ఊపుతోనే ఉంటుంది. నిద్రపోతున్నవారిని లేపుతూనే ఉంటుంది.

ప్రశ్న: పల్లెను, తల్లిని అంటే మీరు తట్టుకోలేరు ఎందుకని?

గద్దర్: అవే నా ప్రాణం, నా జీవితం. ఇటీవలే 60 ఏళ్ళ తర్వాత మా ఊరు వెళ్లాను. మా ఊరు పూర్తిగా మారిపోయింది. గ్లోబల్ విలేజ్ కాదు, అది విచిత్ర విలేజ్ అయ్యింది. ‘మా భూమి’ రియల్ ఎస్టేట్ అయింది. నా కవిత్వం, నా పాటల మూలాలు ఇంకా నా పల్లెలలోనే ఉన్నాయి.

ప్రశ్న:  ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేళ్ళ పండుగ చేసుకుంటుంది కదా? ఉస్మానియాతో మీ అనుబంధం?

గద్దర్: కిలోమీటర్లు కాలినడకన యూనివర్సిటీకి వెళ్ళే వాడిని. మొట్టమొదట ఆ భవనాలు చూడగానే శ్రీశ్రీ గుర్తు కొచ్చాడు. “తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు“ అనే పాట గుర్తుకొచ్చింది. మా బీదల హాస్టల్, మా పల్లె ఇంగ్లీష్ గుర్తుకొస్తాయి. చెప్పులు కూడా లేకుండా, చినిగిన బట్టలతో ఉస్మానియాలో అడుగు పెట్టాను.

 ప్రశ్న: ఈ మధ్య మీరు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. శఠగోప సత్కారాలు పొందుతున్నారు. దేవుడంటే మీకు నమ్మకం వచ్చిందా?

గద్దర్: దేవుడంటే నాకు గౌరవం ఉంది. ఒకప్పుడు నా  పల్లెలో అంటరానితనంతో వెలివేయబడ్డాను. గుళ్ళో పూజారులు దూరంగా ఉండమనేవారు. అది ఒకప్పటి గద్దర్. ఇప్పుడు అక్కడే ఆశీస్సులు, నీరాజనాలు పొందుతున్నాను. మా అయ్య చెప్పినట్టు చదువే నాకు ఈ గౌరవం, గుర్తింపు తెచ్చాయి.

ప్రశ్న: మీకు అన్నమయ్య, రామదాసు వంటి వాగ్గేయకారులు, పోతన్న, శ్రీశ్రీ, చెరబండ రాజు వంటి కవులంటే ఇష్టమా?

గద్దర్: వీరందరంటే నాకు చాలా ఇష్టం. నేను వారికి వారసుడినే. మా నాన్న శివభక్తుడు. ఆయన శివుని పాటలు, కబీరు కీర్తనలు పాడేవాడు. భారత, రామాయణాలు వినిపించేవాడు. మొన్నే పోతన సమాధి దగ్గరికి వెళ్ళాను. ఆ జ్ఞాపకాలు శిథిలావస్థలో ఉన్నాయి. ప్రభుత్వానికి తెలియజేయమని పోతన వారసులు నన్ను కోరారు. అన్నమయ్య, పోతన్న రాజులని నిలదీశారు. వారు తిరగబడ్డ వీర కవులు.

 ప్రశ్న:  మీకు సినిమాలు అంటే ఇష్టమా?

గద్దర్: నాకు ఎంతో ఇష్టం. సినిమా గొప్ప కళారూపం. సర్వకళల సమాహారం. ఐతే! నేను సినిమాలో తక్కువ పాటలు పాడాను. మా భూమి, రంగుల కల, ఒరేయ్ రిక్షా, దండకారణ్యం మొదలైన సినిమాల్లో పాడాను. ఎక్కువ జీవితం ప్రజలలోనే సాగింది.

ప్రశ్న: మీకు ఇష్టమైన గాయకులు, నటులు ఎవరు? ఏ సంగీతం ఎక్కువ ఇష్టం?

గద్దర్: జానపదాలు, హిందుస్తానీ, శాస్త్రీయ సంగీతం ఎక్కువగా వింటాను. పద్యాలు, ఆ రాగాలు చాలా ఇష్టపడతాను. రాగం రోగం తగ్గిస్తుంది.

ప్రశ్న: మీకు ఇష్టమైన హీరోలు?

గద్దర్: సినిమాలలో కాదు. రియల్ లైఫ్ లో హీరోలంటే ఇష్టం. సావిత్రి అద్భుతమైన నటి.

ప్రశ్న: పవన్ కల్యాణ్ రీల్ హీరోనా? రియల్ హీరోనా?

గద్దర్: ఈ మధ్య పవన్ పై డిబేట్ ఎక్కువైపోతోంది (ప్రశ్న దాటవేశారు)

ప్రశ్న: స్వామీజీలు, పీఠాధిపతుల చేతిలో త్రిదండం ఉంటుంది. మీ చేతిలోనూ `దండం` ఉంటుంది?

గద్దర్: వారి గురించి నాకు తెలియదు. నా చేతిలో ఉన్నది బుద్దుని ‘పంచశీల’.

యాదగిరి.. యాదాద్రి అయ్యింది.

ఒకప్పుడున్న చోటులో ఇప్పుడు ఆ దేవుడు లేడు ..  నేటి పాలకులు మార్చేశారు

నాడు.. నిజామ్ ఒక్కడే ఉండేవాడు .. నేడు.. అందరు నాజీలను మించినోళ్ళే ఉన్నారు.

అంబేద్కర్ , ఫూలే, మార్క్స్, బుద్ధుడు…వీరు చూపిన బాటలోనే నడుస్తాను.

పల్లె పల్లెకు పాటై వస్తాను ..  నేటి పాలకులకు తూటాగా మారతాను.

పౌరులను పాలకులను చేస్తాను.

పాటను పార్లమెంట్ కి తీసుకెళతాను..

“అమరుల స్వప్నం నిజం కావాలి, త్యాగాల ఫలాలు అందరికీ అందాలి”

అంటూ … గద్దర్ ముఖాముఖి ముగించారు.

 

మా శర్మ

Have something to add? Share it in the comments

Your email address will not be published.