‘గంటా’లా తయారవ్వడానికి ఎవరి మాట వినకూడదో తెలుసా?

Ganta Srinivas Rao comments on Paper Leak issue and Jagan

Ganta Srinivas Rao comments on Paper Leak issue and Jagan

రాజకీయాల్లో ఒకరిని ఒకరు తిట్టుకోవడం చాలా కామన్.. అయితే ఆ తిట్టుకోవడం అనేది కాస్త పద్ధతిగా ఉంటే తప్ప నాయకుల హోదా పెరగకపోగా తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మానవవనరుల అభివ‌ృద్ధిశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు. నెల్లూరు జిల్లాలో పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీ విషయంలో అసెంబ్లీలో చర్చలో గంటా మాట్లాడుతూ ప్రతిపక్షనేతపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. తల్లిమాట వినకపోతే రాహుల్‌లా తయారు అవుతారని.. తండ్రి మాట వినకపోతే అఖిలేశ్‌లా తయారు అవుతారని.. జనం మాట వినకపోతే జగన్‌మోహన్‌రెడ్డిలా తయారవుతారని ఇటీవల వాట్సాప్‌ల్లో సందేశాలు వస్తున్నాయని ప్రతిపక్ష నేతను ఎద్దేవా చేశారు.

అయితే ఇక్కడ ఓ విషయం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంతమంది ఇలా తయారవ్వడానికి ఎవరెవరి మాటలు వినలేదో చెప్పుకొచ్చిన గంటా తనలా తయారవ్వాలంటే ఎవరి మాట వినకూడాదో చెప్తే బాగుంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏదైనా తనకు ఏమాత్రం సంబంధంలేదనుకొనేటట్లు పదవి మాత్రమే తన లక్ష్యమని వర్కౌట్ చేసే గంటా తన మాట కూడా తను వినకపోవడం వల్లే ఇలా ఎంజాయ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది.

పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వమే దర్యాప్తు చేసి నారాయణ కళాశాల పేరు బయటపెట్టిందని.. ప్రతిపక్షం కాదని గంటా గుర్తు చేశారు. ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు తామే పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. వాటర్‌బాయ్‌ ప్రశ్నపత్రాన్ని ఎందుకు ఫొటో తీశాడో తెలియజేయాలన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ విషయంపై ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి ఘాటుగానే స్పందించారు.

ప్రశ్నపత్రం లీకైందని తెలిసినప్పుడు నారాయణ కళాశాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు నారాయణ కళాశాల యజమాని నారాయణ బంధువు కావడంతో చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. తప్పు జరిగిందని తెలుసుకున్నప్పుడు పరీక్షను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.