సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటున్నాం: గవర్నర్

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ ప్రాంగణంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇరు సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగించారు. సుమారు 50 నిమిషాల పాటు పలు అంశాలపై ప్రసంగించారు.

గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ “అతి స్వల్ప కాలంలో అసెంబ్లీ భవనం నిర్మితమైంది. అమరావతిలో తొలిసారిగా సమావేశాలు నిర్వహిచండం సంతోషంగా ఉంది. దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రపదేశ్ 2020 లోగా ఉండబోతుంది. అంతేగాక 2050 వరకు విదేశీ పెట్టుబడుల్లో కీలక స్థావరంగా రాష్ట్రం తయారవుతుంది. గత రెండున్నరేళ్లో ఎన్నో సానుకూల విజయాలు సాధించాం. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీరందించాం. రికార్డు సమయంలో సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు చేశాం. సంక్షోభాలను ఆంధ్రప్రదేశ్ అవకాశాలుగా మలుచుకుంటోందని` అన్నారు.

`2015-16లో రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 24 శాతం వృద్ధి. తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో వృద్ధి సాధ్యమైంది. పారిశ్రామిక వృద్ధిరేటు 9.58 శాతంగా నమోదైంది. సేవా రంగంలో మరింత వృద్ధి చెంది, ఉపాధి అవకాశాలకు ప్రయత్నాలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్లు నిర్మాణం 2019కల్లా పూర్తవుతుంది. తోటపల్లి, గండికోట ప్రాజెక్టులు నిర్దేశిత కాలంలో పూర్తవుతాయి. వెలుగొండ సహా పలు ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయని` గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు.

`వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా చేసేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నాము. రైతులకు రాయితీపై యంత్రాల సరఫరా చేస్తున్నాం. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక విత్తన చట్టాన్ని తీసుకురానున్నాము.   ఉద్యానవన రంగాన్ని ప్రధాన రంగంగా పరిగణిస్తున్నాం. ఉద్యాన కేంద్రంగా రాయలసీమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. పాడి ద్వారా ప్రతి రైతు కుటుంబం నెలకు 10 వేల రూపాయలు సంపాదించేలా చర్యలు చేపట్టాం. నగరవనం, పల్లెవనం ద్వారా పచ్చదనం పెంపునకు కృషి చేస్తున్నామని` గవర్నర్ తెలిపారు.

`విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 665 కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. దీంతో రూ.10 లక్షల కోట్ల మేర అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రపదేశ్ ప్రథమ స్థానం సాధించింది. విద్యుత్, ఐటీ రంగాల్లో 5 జాతీయ అవార్డులు సాధించాం. పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.  నిరంతరం విద్యుత్ సరఫరాలో దేశంలోనే ఆంధ్రపదేశ్ మొదటి స్థానంలో ఉంది. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను కనిష్ఠ స్థాయికి తీసుకురాగలిగాం. ఆంధ్రపదేశ్, దేశంలోనే విజ్ఞాన రాష్ట్రంగా చేయాలనేది లక్ష్యంగా చేసుకున్నాం. పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, బయోమెట్రిక్ హాజరు అమలు చేశాం. బడి మానేసే పిల్లలను తగ్గించేందుకు వారికి సైకిళ్ల పంపిణీ చేశాం. తిరుపతిలో సైన్సు కాంగ్రెస్ సదస్సును అద్భుతంగా నిర్వహించాం. నిరుద్యోగులకు ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. అన్ని ప్రభుత్వ శాఖల్లో తెలుగు భాష అమలుకు కృషి చేస్తున్నాం.’ అన్నారు.

మానవ అభివృద్ధిలో ఆరోగ్యం కీలకమైంది. ప్రసూతి, శిశు సంరక్షణ మెరుగుపరచడమే ప్రధానం లక్ష్యం. గర్భిణీలు, నవజాతి శిశువులను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ను ప్రవేశపెట్టాం – అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా తీర్చిదిద్దేందుకు వినూత్న భూసేకరణను చేపట్టాం. విజయవాడ, విశాఖలో త్వరలోనే మెట్రో రైల్ వాస్తవిక రూపంలోకి రాబోతుంది. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద పేద వర్గాలకు గృహ వసతి ఏర్పాటు చేస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ, చంద్రన్న సంచార చికిత్స ద్వారా గ్రామస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాం. 974 కి.మీ మేర కోస్తా తీరంలో ఓడరేవు ఆధారిత అభివృద్ధి నమూనాకు ప్రోత్సాహం ఇస్తున్నాం. విశాఖ-చైన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి 372 కి.మీ మేర రహదారుల విస్తరణ చేపడుతున్నాం. ఫైబర్ గ్రిడ్ ద్వారా 149 రూపాయలకే ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సదుపాయాలు కల్పించబోతున్నాం.  ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అనాథ మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. దివ్యాంగులకు రూ. 1500 ఫింఛను ఇస్తున్నాం. రాయితీ ద్వారా ఆహారం అందించేందుకు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు, అసంఘటిత రంగ కార్మికులకు భరోసాకు చంద్రన్న బీమా, 11 లక్షల మందికి పైగా వెనుకబడిత తరగతుల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నాం.

కాపులకు రిజర్వేషన్ల కోసం మంజునాథ కమిషన్ ఏర్పాటు చేశాం. కమిషన్ నివేదిక వచ్చాక ఇతర వర్గాలను భంగం కలగకుండా చర్యలు చేపడతాం. ఈబీసీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు రీఇంబర్స్ మెంట్ అమలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అభ్యున్నతికి ప్రత్యేక బడ్జెట్ పద్దు ఏర్పాటు చేస్తాం. చేనేత కార్మికులకు రుణవిముక్తి కింద 110 కోట్ల రూపాయలు, స్వయం సహాయక బృందాలకు 8400 కోట్ల నిధులు ఏర్పాటు చేస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (నరేగా) నిధుల వినియోగంలో ఆంధ్ర్రప్రదేశ్ ముందుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరకు 9900 కి.మీ మేర సీసీ రహదారుల నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నాం. విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా కేంద్రం కొన్ని చర్యలు ఇప్పటికే చేపట్టిందని” గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభ రేపటికి వాయిదా పడింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.