‘గుంటూరోడు’ మూవీ రివ్యూ

gunturodu-movie-review-by-sakalam

gunturodu-movie-review-by-sakalam

సినిమా : ‘గుంటూరోడు’ 

నటులు: మంచు మనోజ్, ప్రగ్యా జైశ్వాల్, సంపత్ రాజ్, కోట శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్

సంగీతం: డీజే వసంత్
సినామాటోగ్రఫీ: సిద్దార్థ్ రామస్వామి
నిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరి
దర్శకత్వం: ఎస్కే సత్య

గతేడాది చేసిన రెండు ఎక్స్‌పెరిమెంట్ సినిమాలు నేర్పించిన పాఠాలతో మంచు మనోజ్ ఈసారి కొత్తగా, రొటీన్‌కు భిన్నంగా తన రూటు మార్చి పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌ ‘ గుంటూరోడు’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ఎస్కే సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతమేరకు అభిమానుల అంచనాలను అందుకోగలిగింది. ఇప్పటివరకు తాను చేసిన సినిమాలకు భిన్నంగా గుంటూరోడు సినిమా చేసిన మనోజ్ ప్లాన్స్ ఏమేరకు వర్కౌట్ అయ్యాయి.

కథ: 

గుంటూరులో ఉండే కన్నా (మంచు మనోజ్) చిన్నప్పటినుండి తనకు ఎవరైనా అడ్డొచ్చి తప్పు చేస్తున్నట్లు అనిపిస్తే ఎదుర్కొనే మనస్తత్వంతో పెరుగుతాడు. అతనికి తగ్గట్లుగానే అతని తండ్రి (రాజేంద్రప్రసాద్) మాటలను సైతం ఒక్కొక్కసారి పెడచెవిన పెడుతూ తన చేత్తోనే ఎదుటివాళ్ళకు జవాబు చెబుతుంటాడు. అయితే ఓ రోజు తమ ఇంటి దగ్గర ఉండే ఓ అబ్బాయి బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ హోటల్‌కి వెళ్ళిన కన్నా అనుకోకుండా అక్కడ జరిగిన గొడవలో క్రిమినల్ లాయర్ అయిన శేషు ( సంపత్ రాజ్)‌ను కొడతాడు. కన్నా మాదిరిగానే చాలా కోపంతో ఉండే శేషుకి ఈ సంఘటన మింగుడుపడక తనను కొట్టిన వాడిని చంపాలని మనుషుల్ని పెట్టి వెతికిస్తుంటాడు. అదే సమయంలో పెళ్ళిచూపులకు వెళ్ళిన కన్నా అక్కడ పెళ్ళికూతురు ఫ్రెండ్ అమృతను చూసి ప్రేమలో పడిపోయి తనను ఎలాగైనా తన ప్రేమలో దింపాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరికి అమృత కన్నా ప్రేమను ఒప్పుకొనే సమయంలో కన్నాకి ఓ విషయం తెలుస్తుంది. అసలు ఆ విషయం ఏంటి? కన్నా, శేషుల మధ్య గొడవ ఎంతవరకు దారితీసింది?  అమృత ప్రేమను కన్నా చివరికైనా పొందగలిగాడా? అన్నదే కథ.

ఎనాలసిస్: 

ఇప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా సేమ్  ఫార్మాట్‌లో రొటీన్‌గా తీసిన సినిమా గుంటూరోడు. చాలా బలమైన విలన్‌ను సాధారణ మధ్యతరగతికి చెందిన హీరోకి మధ్య జరిగిన గొడవ ఎలా పెద్దదైంది. చివరికి విలన్‌పై హీరో ఎలా పైచేయి సాధిస్తాడు అనే యాంగిల్‌లో ఇప్పటికే తెలుగులో అనేక సినిమాలు వచ్చాయి. అయితే మంచు మనోజ్ గుంటూరోడు టైటిల్‌కు న్యాయం చేసేలా ఏదైనా భిన్నంగా చేసి ఆకట్టుకుంటాడని పెట్టుకున్న అంచనాలన్నింటినీ తలక్రిందులు చేసేశాడు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు మినహాయిస్తే సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు పెద్దగా ఏమీలేవు. కథా పరంగా రొటీన్ కథే అయినప్పటికీ హీరోని ఎలివేట్ చేస్తూనే మధ్యమధ్యలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాల్సిన బాధ్యతలో డైరెక్టర్ సత్య సీరియస్‌నెస్ చూపించలేదు. మనోజ్ ఎనర్జీ లెవల్స్‌కి తగ్గట్లుగానే యాక్షన్య ఎపిసోడ్లు , హీరోయిన్‌తో డ్యూయెట్లు  మధ్య మధ్యలో కామెడీ సీన్లు ఉన్నప్పటికీ అవన్నీ మనోజ్‌లోని కొత్త యాంగిల్‌ని చూపించలేకపోయాయి. సినిమాలో లవ్‌స్టోరీ ఇంటెన్సిటీ ఇంకాస్త ఎక్కువగా ఉంటే బాగుండనిపించింది. ఎందుకంటే హీరో హీరోయిన్లు కలిసినప్పుడు ఎక్కడా లవ్ ట్రాక్ సాగుతోందన్న ఫీల్ ఏమాత్రం ప్రేక్షకుడికి తెప్పించలేకపోయింది. దీనికితోడు సినిమాకి హైలెట్ అవ్వాల్సిన లవ్ ట్రాక్ కాస్త, సిల్లీ రీజన్స్ ‌తో హీరోయిన్ హీరో ప్రేమలో పడిపోవడం చూస్తుంటే చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. దీనికితోడు కామెడీ ట్రాక్స్ కూడా ఏమాత్రం ఎట్రాక్టివ్‌గా లేవు.

విలన్‌గా సంపత్ అరుపులు తప్ప పెద్దగా ప్రేక్షకుడు ఎగ్జైట్ అయ్యే సన్నివేశాలు ఎక్కవగా కనిపించవు. అంతేగాక హీరో విలన్ మధ్య జరిగే సీన్లలో ఎమోషన్స్ ఇంకాస్త బలంగా ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేవి. సినిమాలో మొదటినుండి చివరి వరకు ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేసేలా సీన్లు వచ్చి ఫ్లో బాగుందనుకొనే టైంలో, ఒక్కసారిగా గాలితీసేసి కథను తుస్సుమనిపించాడు. అంతేగాక సినిమా క్లైమాక్స్‌లో సీరియస్‌నెస్ బాగా తగ్గినట్లు అనిపించడంతోపాటు మంత్రి క్యారెక్టర్ చేసిన రావు రమేశ్ ఎమోషనల్ డైలాగ్స్ నవ్వు తెప్పించాయి.

ఈ సినిమాకి కాస్త ప్లస్ అయిన అంశాలు ఇంటర్వెల్ ముందు, ప్రి క్లైమాక్స్‌సీన్లలో వచ్చే యాక్షన్ సీన్లతో హీరోయిజం ఎలివేట్ అయ్యింది. మనోజ్ ఇప్పటివరకు చేసిన మాస్ సినిమాల్లో ఉన్న లుక్ కంటిన్యూ చేసి తనపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయలేదు. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంటు కొంత వర్కవుట్ అయింది. పాటలు పర్వాలేదు. అయితే ఈ సినిమాలో మనోజ్‌కు జోడీగా నటించిన ప్రగ్యా జైశ్వాల్ మరీ సన్నగా ఉండడంతో అంతగా జతకట్టలేకపోయింది. ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్, యాక్టింగ్‌పరంగా మంచి మార్కులు కొట్టేసింది సంపత్ రాజే. ఓ యారొగెంట్ లాయర్‌ క్యారెక్టర్లో ఒదిగిపోయి నటించాడు. సాంకేతిక వర్గం విషయానికొస్తే డీజే వసంత్ పాటలతో ఆకట్టుకున్నాడు. అంతేగాక సిద్ధార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకే బలాన్ని తీసుకొచ్చింది.

ఓవరాల్: ఏమాత్రం కారంలేని గుంటూరోడి కథ

రేటింగ్ – 2.5/5

– శరత్‌చంద్ర

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.