పాలమూరు ప్రాజెక్టులకు నాగం ఒక శిఖండి: హరీశ్‌రావు

harish-rao-counters-bjp-leader-nagam-janardhanreddy-comments

 

harish-rao-counters-bjp-leader-nagam-janardhanreddy-comments

 

ప్రాజెక్టుల విషయంలో నాగం మళ్లీ పాత పాటే పాడుతున్నారని ఘాటుగా విమర్శించారు తెలంగాణా నీటిపారుదల శాఖామంత్రి హరీశ్ రావు. పాలమూరు ప్రాజెక్టుల పాలిట నాగం జనార్ధన్‌రెడ్డి శిఖండిలా వ్యవరిస్తున్నారని హరీష్ వ్యాఖ్యానించారు. ఈపీసీ విధానాన్ని తొలగించి పారదర్శకంగా పని చేస్తుంటే ప్రాజెక్టుల్లో అవినీతి అని అపోహలు సృష్టించే ప్రయత్నం  చేస్తున్నార‌ని దుయ్యబట్టారు.

అంతేగాక ఇప్పుడు తాజాగా గొర్రెల పంపిణీలో అవినీతి జరుగుతోందని విమర్శిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గొర్రెను కూడా కొనుగోలు చేయకుండానే అవినీతి జరిగిందని చెప్పడం విడ్డూరమన్నారు హరీశ్. పాలమూరులో వలసలు వెళ్లిన వారు తిరిగి రావడంతోనే నాగంకు ఆక్రోశం వస్తుందని హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు.

నాగం పాలమూరు ప్రజల ఉసురు తీసుకుంటున్నాడని, మతి కూడా భ్రమించిందని, బీజేపీలో ఆయన తన స్థానమేమిటో తెలుసుకోవాలని సూచించారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఓడిపోయినందుకే ఇలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అసలు  బీజేపీలో నాగం స్థానం ఏంటో ముందు తెలుసుకోవాలని అన్నారు.

అంతేగాక నాగం జనార్థన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలా.. లేక బీజేపీ అభిప్రాయమో చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను డిమాండ్ చేశారు. ఒక వేళ బీజేపీ వైఖరి ఇదే అయితే లక్ష్మణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాగం, పందులు నక్కలు కుక్కల భాష మాట్లాడి బీసీలను అవమానించారని, బీసీ అయిన బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్..నాగం వ్యాఖ్యలపై వెంటనే స్పందించాలని కోరారు.

మరోవైపు తెలంగాణ టీడీపీతో పొత్తుకు సిద్దమన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన  పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తమ నెత్తిన పాలు పోసినట్లేనని వ్యాఖ్యానించారు.తెలంగాణ ద్రోహుల పార్టీతో కాంగ్రెస్ పొత్తు తమకే లాభమన్నారు. అయినా పొత్తులు ఆయా పార్టీల ఇష్టమని అన్నారు హరీశ్‌రావు.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.