సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు బ్రేక్

hyderabad high court stay on singareni heir jobs

hyderabad high court stay on singareni heir jobs

హైదరాబాద్: సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం గతంలో జారీ చేసిన ప్రకటనను న్యాయస్థానం రద్దుచేసింది. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన వారి వారసులకు ఉద్యోగం ఇచ్చేలా యాజ్యమాన్యం గత సంవత్సరం డిసెంబర్ లో మార్గదర్శకాలు వెలువరించింది.

ఈ నేపధ్యంలో గోదావరిఖనికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. వారసత్వ ఉద్యోగాల వల్ల సుమారు 30 వేల ఉద్యోగాలు వారసులకు వెళ్లిపోతాయని, దీంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఉద్యోగి అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం నుంచి వైదొలిగితే తప్ప వారసత్వ ఉద్యోగం ఇవ్వడానికి వీలులేదని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వ తరపున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం అడ్వకేట్‌ జనరల్‌ వాదనతో విభేదించి వారసత్వ ఉద్యోగాల ప్రకటనను కొట్టివేసింది.

కాగా రెండేళ్ల సర్వీసు కాలం మిగిలిన 48–58 ఏళ్ల మధ్య వయసున్న సింగరేణి కార్మికులు అనారోగ్య కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా వారసులకు ఉద్యోగావకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల పథకాన్ని పునరుద్ధరించడం తెలిసిందే. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా గత సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.