కంగారులను కంగారుపెట్టించిన కోహ్లీ సేన

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు 75 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు 274 పరుగులు చేసి ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అయితే జాగ్రత్తగా ఆడి ఆస్ట్రేలియాపై విజయ ఢంకా మోగించింది కోహ్లీసేన. ఆసీస్‌ను రెండోఇన్నింగ్స్ లో 112 పరుగులకే కుప్పకూల్చి ప్రతీకారం తీర్చుకుంది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది. నాలుగో రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌ను కుప్పకూల్చడంలో స్పిన్నర్ అశ్విన్ కీలకపాత్ర పోషించి జట్టును విజయతీరానికి తీసుకెళ్ళాడు. అశ్విన్ ఏకంగా ఆరుగురు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్పె చేయడంతో అతనికి సహచర బౌలర్లు అండగా నిలిచారు. జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా మారిన అశ్విన్‌కు 5 వికెట్లకుపైగా తీసుకోవడం ఇది 25వ సారి. అంతేకాదు భారత గడ్డపై 200 వికెట్‌ను కూడా అతను ఇదే మ్యాచ్‌లో సొంతం చేసుకున్నాడు.

విశేషమేమిటంటే చివరి ఆరు వికెట్లు 11 పరుగుల తేడాతో కుప్పకూలాయి. భారత్ విసిరిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ తడబడింది. ఏ దశలోనూ భారత్ బౌలింగ్ ను నిలువరించలేక చేతులెత్తేసింది. మొదటి టెస్టులో దారుణ పరాభవాన్ని ఎదుర్కొని.. రెండో టెస్టులో మొదట కొంత తడబడి.. ఆ తర్వాత పుంజుకొని అద్భుత విజయాన్ని నమోదుచేసిన కోహ్లిసేనపై ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్(28) దే అత్యధిక స్కోరు కాగా, హ్యాండ్ స్కాంబ్(24), వార్నర్(17), మిచెల్ మార్ష్(13)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు.

అంతకుముందు 213/4 స్కోరుతో మంగళవారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. మరో 61 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది.  భారత్ రెండో ఇన్నింగ్స్ తొలి సెషన్ లోనే ముగిసింది. మొత్తానికి బౌలర్ల ప్రతిభతో ఆస్ట్రేలియా చాప చుట్టేసి సిరీస్‌లో 1 – 1 సమం చేసింది కోహ్లీ సేన.

Have something to add? Share it in the comments

Your email address will not be published.