పాకిస్తాన్‌తో సమరానికి సిద్ధం

india-will-take-on-pakistan-in-champions-trophy-2017-final-on-sunday

చాంఫియన్స్ ట్రోఫీ సాక్షిగా పాకిస్తాన్‌తో మరోసారి సమరానికి సిద్ధమైంది భారత్. ఇప్పటికే లీగ్ దశలో మట్టికరిపించి మంచి ఊపుమీదున్న భారత జట్టు మరోసారి పాకిస్తానీయులతో ఆడుకోవడానికి రెడీ అయ్యింది. చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంఫియన్‌గా బరిలో దిగిన కోహ్లీ టీం ఫైనల్లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించి  పాక్‌తో  ఆదివారం జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది.

india-will-take-on-pakistan-in-champions-trophy-2017-final-on-sunday

లీగ్ మ్యాచ్‌ల్లో కోహ్లీ చేతిలో మట్టి కరిచిన యువ పాకిస్తాన్ జట్టు, ఆ తర్వాత కోలుకొని ఏకంగా గట్టి జట్లను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇండియాతో లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో చెత్తగా ఆడడంతో పాకిస్తాన్ టీంని అందరూ ఓ రేంజ్‌లో విమర్శలు చేయగా ఆ తర్వాత దక్షిణాఫ్రికాను, శ్రీలంకను ఓడించి సెమీస్‌కు చేరింది పాకిస్తాన్ టీం. అయితే సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో ఖచ్చితంగా ఓడిపోతుందని అందరూ అనుకుంటున్న సమయంలో ఇంగ్లడ్ జట్టుకి మూడు చెరువుల నీళ్ళు తాగించినంత పనిచేసి జట్టుని ఓడించి ఫైనల్‌‌లోకి అడుగుపెట్టి  క్రికెట్ పండితులకు పెద్ద షాక్‌ని ఇచ్చింది పాకిస్తాన్ టీం.

రెండో సెమీఫైనల్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్ 264 పరుగులు చేసింది. 265 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ జట్టులో రోహిత్ శర్మ(123 ; 129 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సు నాటౌట్) అజేయ సెంచరీ,  కెప్టెన్ విరాట్ కోహ్లి (96; 78 బంతుల్లో 13 ఫోర్లు నాటౌట్) లు రాణించడంతో  భారత్ 9.5 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం  సాధించింది. ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్(46; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్),   తొలి వికెట్ కు 87 పరుగులు జోడించడంతో భారత్ కు గట్టి పునాది పడింది. ఈ మ్యాచ్ లో ధావన్ తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయినప్పటికీ రోహిత్ శర్మ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి మంచి సహకారం లభించడంతో భారత గెలుపు నల్లేరుపై నడకలా సాగింది.

చాంపియన్స్ ట్రోఫీలో ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో వెయ్యి పరుగుల్ని వేగవంతంగా సాధించిన బ్యాట్స్‌మన్‌ గా భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ గుర్తింపు పొందాడు. ఆ క్రమంలో భారత్‌కే చెందిన సచిన్ టెండూల్కర్ రికార్డును ధావన్ సవరించాడు. అయితే  ఇదే టోర్నీలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్లో ధావన్ మరో రికార్డును నెలకొల్పాడు. ఓవరాల్ చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన భారత్ ఆటగాడిగా ధావన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(655)రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం ధావన్ 680 పరుగులతో ఉన్నాడు. మరొకవైపు ప్రస్తుత టోర్నీలో ధావన్ 317 పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

మొత్తానికి ఆదివారం రోజు చాంఫియన్స్ ట్రోఫీలో జరుగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌పై ఇప్పుడు క్రికెట్ ప్రేమికులందరి దృష్టి ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.