బి.జె.పి కిరణ్మయి నందాకు గాలం వేస్తోందా?

Is Kiranmoy Nanda Being Wooed By BJP

Is Kiranmoy Nanda Being Wooed By BJP

  • పశ్చిమ బెంగాల్ లో అధికారం చేపట్టడానికి వ్యూహరచనలు

  • రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి రంగంలో దిగిన బడా నేతలు

కోలకత్తా: యు.పి. ఎన్నికల్లో ఘన విజయంతో, బి.జె.పి మిగిలిన రాష్ట్రాల్లోనూ అధికారం కైవసం చేసుకోడానికి దూకుడు పెంచుతోంది.ఇప్పటికే, తమిళనాడు రాజకీయాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందన్న విషయం తెలిసిందే!

ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో పట్టుకోసం గట్టి ప్రయత్నాలు చేపట్టింది. అందులో భాగంగా సమాజ్ వాది పార్టీ అగ్ర నేత, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ  సభ్యుడు కిరణ్మయి నందాను బి.జె.పి లోకి తేవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. అమిత్ షా, అరుణ్ జైట్లీ, రాజనాథ్ సింగ్ వంటి అగ్ర నేతలు నందాకు పెద్ద స్థాయిలో తాయిలాలు ఆఫర్  చేస్తున్నారనే వార్తలు జాతీయ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

2014 లోక్ సభ ఎన్నికల్లో మొట్ట మొదటగా బి.జె.పి పశ్చిమ బెంగాల్ లో 2 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంది. గతంతో పోల్చుకుంటే 2014 లో తన ఓటింగ్ శాతాన్ని బాగా పెంచుకుంది. 2011లో 11.66శాతం ఉండగా, 2014 కు అది 16.08 శాతం కు పెరిగింది. నిన్ననే అమిత్ షా, రాజనాథ్ సింగ్, స్మృతి ఇరానితో సహా 40 మంది పెద్ద నేతలు రాష్ట్రం లో మూడు రోజుల పాటు పర్యటించారు. పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయడానికి కార్య కర్తలతో సమావేశం నిర్వహించి, కార్యాచరణ చేపట్టారు.

ఇందులో అమిత్ షా 3 ప్రధాన అంశాలను అస్త్రాలుగా ఎంచుకున్నారు. 1. హిందుత్వ 2.  మోడి అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం (వికాస్ ) 3. మమతా బెనర్జీ పాలనలోని అవినీతిపై ప్రచార యుద్ధం.

2019 లోక్ సభల ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న మున్సిపాలిటీ, పంచాయితీ ఎన్నికలలో విజయం సాధించడానికి పావులు కదుపుతున్నారు.

నిన్నటి యు.పి. ఎన్నికలలో సమాజ్ వాద్ పార్టీ ఘోర పరాజయం కావడంతో  ఆ పార్టీ సీనియర్ నేతల భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. పార్టీలో ములాయం సింగ్, అఖిలేష్‌ తర్వాత అగ్రనాయకుడు కిరణ్మయి నందా, ఇతని సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఆ రాష్ట్రంలో ఆయన బాగా పేరున్న పెద్ద నాయకుడు. దాదాపు 40 ఏళ్ళకు పైగా ప్రజలకు చిరపరిచితుడు. వెస్ట్ బెంగాల్ సోషలిస్ట్ పార్టీ అగ్రనేతగా ఉండేవాడు. ఆ పార్టీ తరపున ‘వామపక్ష ఫ్రంట్ ‘ మంత్రి మండలిలో 1981 నుండి 2011 వరకు 30 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా మంత్రి పదవి నిర్వహించారు. ఆ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ‘మత్స్యశాఖ’ ను సమర్ధవంతంగా నిర్వహించాడు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ‘వెస్ట్ బెంగాల్ సోషలిస్ట్ ‘  పార్టీని సమాజ్ వాది పార్టీలో విలీనం చేశాడు. దానికి బదులుగా ఆ పార్టీ నందాను రాజ్యసభ సభ్యుడిని చేసింది. తాను మొట్టమొదటి సారిగా 1977లో శాసన  సభ్యుడయ్యాడు. తన ఎంపిక అప్పటి ‘ జనతా పార్టీ’ నుండి కావడం విశేషం.

నందాకు పశ్చిమ బెంగాల్ లో మచ్చలేని నాయకుడిగా, గెలుపు గుర్రంగా మంచి పేరు ఉంది. జాతీయ స్థాయిలో పాలక, ప్రతి పక్ష అగ్రనేతలతో గట్టి సంబంధాలూ ఉన్నాయి. మంచి వక్త కూడా. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బి.జె.పి అధిష్ఠానం నందాను తన పార్టీలోకి ఆకర్షించడానికి బలంగా ప్రయత్నాలు చేపట్టిందని సమాచారం. 2018 ఏప్రియల్ లో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ప్రారంభంలో యం.పి.గా ఆఫరిచ్చి, 2021ఐ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నందాను ప్రకటించాలని, అది బ్రహ్మస్త్రంగా పని చేస్తుందని, బి.జె.పి. బలంగా భావిస్తోంది. రాష్ట్రంలో ఉన్న బంగ్లాదేశ్ హిందూ శరణార్ధులను ఆకర్షించాలనీ ప్రయత్నం చేస్తోంది.

ఏది ఎలా ఉన్నా !  సి.పి.ఐని తొక్కేసి, కనీసం ప్రధాన ప్రతిపక్షంగానైనా బెంగాల్లో పాగావేయగలమనే, విశ్వాసం బి.జె.సి. నేతల్లోకనిపిస్తోంది. కిరణ్మయినందా సమాజ్ వాదీలో కొనసాగుతారా? బి.జె.పి. ఆకర్షణలకు, ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు లొంగుతారా?  కాలమే సమాధానం చెప్పాలి.

కాశ్యప్ శర్మ

Have something to add? Share it in the comments

Your email address will not be published.