ఉగాది ఎప్పుడు? కొనసాగుతున్న సందిగ్ధత

Is Ugadi on March 28 or 29 Telugus Confusion Continues

Is Ugadi on March 28 or 29 Telugus Confusion Continues

 

ప్రతీ యేడాది ఏదో ఒక పండుగ విషయంలో మన తెలుగు ప్రజలకు ఇలాంటి గందరగోళం వస్తూనే ఉంటుంది. శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఇలా అన్ని పండుగల విషయంలోనూ ఒక్కొక్కరు ఒక్కో తేదీన పండుగ జరుపుకోవాలని సూచిస్తుంటే ప్రజలు మాత్రం ప్రతీసారి ఏరోజు పండుగ జరుపుకోవాలో తెలుసుకోలేక సందిగ్ధంలో ఉంటుంటారు. ఈ గొప్ప అవకాశాన్ని మన పండితులు ఈ యేడాది ఉగాదికి ఇచ్చేశారు.

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ ఐదు అంశాలను తెలియ చెప్పేదే పంచాంగం. అందుకే మనందరికీ పంచాగం చాలా విశిష్టమైనది. ఇప్పటికే కొత్త యేడాదికి సంబంధించిన పంచాగాలు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈయేడాది కూడా ఒక్కో సిద్ధాంతి ఒక్కోరకమైన కాలగణితాన్ని అనుసరించడంతో శుభముహుర్త సమయాలు, పర్వదినాల తేదీల్లో తేడాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈ ఏడాది ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై పెద్ద గందరగోళమే నెలకొంది. అది సమయం దగ్గరపడే కొద్దీ ఎక్కువౌతోంది.

ఉగాది ఏ తేదీన జరుపుకోవాలి? మార్చి 28న జరుపుకోవాలా లేక 29న జరుపుకోవాలా? కొన్ని పంచాంగాలు, క్యాలెండర్లు మార్చి 28న శ్రీహేవళంబి నామ సంవత్సర ఉగాది అని, మరికొన్ని మార్చి 29 ఉగాది అని ప్రచురించడం, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మార్చి 29న ఉగాది సెలవు ప్రకటించాయి. అయితే కొన్ని పంచాంగాలు, క్యాలండర్లలో మార్చి 28న ఉగాది అని ఉండడం, 28నే ఉగాది జరుపుకోవాలని శ్రీనివాస గార్గేయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి సూచించారు. దీంతో మళ్ళీ ఉగాది గందరగోళం మొదలైంది.

మార్చి 28న ఉదయం 8.27 గంటలకు అమావాస్య తిథి అంతమై హేవళంబి నామ సంవత్సర పాడ్యమి ప్రారంభం అవుతున్నది. అదే రోజు తెల్లవారుజామున 5.45 గంటలకు పాడ్యమి కూడా అయిపోతోంది. రెండు సూర్యోదయాల సమయంలో పాడ్యమి తిథి లేనప్పుడు ముందు రోజునే పాడ్యమిగా భావించాలని ప్రామాణిక గ్రంథం ధర్మసింధులో స్పష్టంగా ఉన్నదని, అందుకే మార్చి 28ని ఉగాదిగా నిర్ణయించినట్లు భారత ప్రభుత్వ పంచాంగ గణన పద్ధతిని అనుసరించే దృక్‌ సిద్ధాంతులు చెబుతున్నారు.

మార్చి 29 ఉదయం 8 గంటల వరకు పాడ్యమి తిథి మిగులు ఉన్నందున ఆ రోజునే ఉగాది జరుపుకోవాలని పూర్వ సిద్ధాంతాన్ని అనుసరించి పంచాంగాన్ని రూపొందించే సిద్ధాంతులు, ఛాయార్క, కరణార్క దృక్‌ సిద్ధాంత పద్ధతిని అనుసరించే పండితులు స్పష్టం చేస్తున్నారు.

శతాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు 1954లో అప్పటి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం క్యాలెండర్‌ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది. కోల్‌కాతాకు చెందిన ఎన్‌.సి.లాహిరి కార్యదర్శిగా ఉన్న ఈ కమిటీ 1955లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయనాంశ స్థిరంగా కాకుండా నిరంతరం మారుతూ ఉంటుందని ఆ కమిటీలో సభ్యులంతా అంగీకరించారు.

దేశం మొత్తానికి తాత్కాలికంగా ఒక అయనాంశను నిర్ణయించి తదనుగుణంగా పంచాంగం గణన చేయాలని తీర్మానించారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పొజిషనల్‌ ఆస్ర్టానమీ సెంటర్‌ ఆధ్వర్యంలో 16 భాషల్లో అధికారికంగా రాష్ట్రీయ పంచాంగాన్ని ప్రచురిస్తున్నారు. దాన్ని ప్రమాణంగా భావించకుండా అయనాంశ విషయంలో ఎవరి దారిలో వారు పంచాంగాలు రూపొందించడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మిగిలింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.