పంజా విసిరిన ఐసిస్… మళ్ళీ వణికిన యూరోప్

isis-strikes-at-american-singer-ariana-grande-concert-in-Manchester-UK

isis-strikes-at-american-singer-ariana-grande-concert-in-Manchester-UK

యూరప్‌పై కరుడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ మళ్ళీ పంజా విసిరింది. ఈసారి ఏకంగా సంగీత కచేరి జరిగే హాల్‌ని టార్గెట్ చేసిన ముష్కరులు పేల్చిన బాంబుతో 19మందిపైగా అమాయకులు మృత్యువాతపడగా, 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఎరీనాలో అమెరికన్‌ పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండే షో ముగియగానే.. సీట్లలో నుంచి లేచిన జనం గుంపులు గుంపులుగా ద్వారాల వద్దకు చేరుకున్నారు.. సరిగ్గా అదే సమయంలో ఒక డోర్ దగ్గర భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో భయపడ్డ జనం.. పరుగులు తీశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ప్రాణభయంతో చిన్నారులు అరుస్తుండటం వీడియోల్లో రికార్డయింది.

ఒకవైపు ప్రపంచ అగ్రదేశాధినేత డోనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అమెరికానుండి బయటికి వచ్చి సౌదీలో పర్యటిస్తున్న సమయంలోనే ఇంగ్లాండ్‌లో ఈ ఘోరానికి ఐసిస్ ఉగ్రవాదులు తెగబడ్డారు. అమెరికన్ సింగర్ అరియానా గ్రాండే నిర్వహిస్తున్న సంగీత కచేరీనే టార్గెట్‌గా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడడం గమనార్హం. ప్రపంచ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు నామరూపాలులేకుండా చేస్తానని డోనాల్డ్ ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞ చేసి మరోవైపు ఉగ్రవాదాన్ని తరిమికొడొతేనే ముస్లిం దేేశాల అభివృద్ధికి దోహదపడుతుందని గల్ఫ్‌లో ట్రంప్ ప్రకటించిన కొద్ది సమయంలోనే , దానికి సవాలు విసురుతూ ఐసిస్‌లో ఉగ్రవాదులు మాంఛెస్టర్‌లో మాణహోమాన్ని సృష్టించారు.

అయితే ఈ దాడికి వ్యూహకర్తలము తామేనని ఐసిస్ ప్రకటించగా దాని సిద్ధాంతాలవైపు ప్రేరేపితులైన ఇంగ్లండ్‌కు చెందినవారే ఈ ఘోరానికి పాల్పడినట్లుగా భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే ఇంగ్లడే కాక ఇతర యూరోపియన్ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఇంతగా భద్రతాచర్యలు కట్టుదిట్టం చేస్తున్నప్పటికీ చాపకింద నీరులా ఐసిస్ ఉన్మాద చర్యలు యూరోప్‌లో ఏదో ఒక చోట విధ్వంసాలతో వెలుగుచూస్తుండడంతో అగ్రదేశవాసులకు వణుకు పుట్టిస్తోంది.

కొన్ని నెలలుగా సైలెంట్‌గా ఉన్న ఐసిస్‌.. అదనుచూసి మళ్ళీ పంజా విసిరింది. సిరియా, ఇరాక్‌లోని ఐసిస్‌ ప్రాబల్య ప్రాంతాలపై యూఎస్‌, రష్యా, సిరియా, ఇరాక్‌ సైన్యాలు ఎడతెరిపిలేకుండా జరుపుతున్న దాడులతో కొద్దిగా వెనక్కి తగ్గిన రాక్షసమూక.. మాంచెస్టర్‌ దాడితో మళ్లీ తన ఉనికిని చాటుకుంది. అమెరికాలో దాడులు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో కొన్నేళ్ల కిందటే యూరప్‌ను టార్గెట్‌ చేసిన ఐసిస్‌ భారీ విధ్వంసాలకు కుట్రపన్నింది. ఫ్రాన్స్‌లోని నీస్‌ నగరంలో ట్రక్కుదాడి, బ్రసెల్స్‌లో పేలుళ్లు తమపనేనని గర్వంగా ప్రకటించుకుంది. కొద్ది రోజుల కిందట ఏకంగా యూకే పార్లమెంట్‌ భవనంపైనే దాడికి తెగబడటం, ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఒకపక్క ఉత్తర కొరియా తన అణు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికాపై కాలు దువ్వుతుండగా మరోపక్క ఐసిస్ ఘాతుకాలు నిర్విఘ్నంగా సాగిపోవడం ప్రపంచదేశాలను కూడా కుదిపేస్తోంది. దీంతో ఈ పరిణామాలన్నీ ఎటునుంచి ఎటువైపుకి దారితీస్తాయోనని, తమ అభివృద్ధికి ఎక్కడ ఆటంకాలను సృష్టిస్తాయోనని ఆసియాకు చెందిన దేశాలు సైతం కలవరపడుతున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.