నింగికేగిన ఇస్రో దీక్ష

isro-launches-its-most-powerful-rocket-gslv-mark-iii-carrying-gsat-19-communication-satellite

isro-launches-its-most-powerful-rocket-gslv-mark-iii-carrying-gsat-19-communication-satellite

ఇస్రో చరిత్రలోనే అత్యంత భారీ రాకెట్ జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 డీ1 ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగి కెగిసింది. నాలుగు టన్నుల ఈ అంతరిక్ష వాహక నౌక ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్నిషార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి నింగికెగిసేలా చర్యలు తీసుకున్నారు. నిన్న సాయంత్రం 3:58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై ఈరోజు సాయంత్రం 05గంటల 28నిమిషాలకు ముగిసింది.

దశాబ్దాల శ్రమ, 18 ఏళ్ళ ప్రయోగాల ఫలితమే మార్క్-3 అంతరిక్ష వాహకనౌక. ఇందుకోసం ఇప్పటివరకు 300కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈసారి 25టన్నుల క్రయోజనిక్ ఇంజిన్‌తో పూర్తిస్థాయి ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. దీని ద్వారా ఐదు టన్నుల బరువున్న ఉపగ్రహాలను సైతం కక్ష్యలో ప్రవేశపెట్టవచ్చు. 43.43 మీటర్ల ఎత్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ1 ప్రయోగం 16:20 నిమిషాల్లో పూర్తికానుంది. మొదటిదశలో రెండు వైపులున్న 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్ల(ఎస్‌–200)ను మండించటంతో రాకెట్‌ ప్రయాణం ప్రారంభమవుతుంది. తర్వాత 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని (ఎల్‌–110) మండించి రాకెట్‌ ప్రయాణ స్పీడ్‌ను పెంచుతారు. 2.20 నిమిషాలకు ఎస్‌–200 రెండు బూస్టర్లు విడిపోయి మొదటిదశను పూర్తి చేస్తాయి. 5.20 నిమిషాలకు రెండో దశ పూర్తవుతుంది.

ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తలు ప్రతీఅంశాన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. 200 పెద్ద ఏనుగుల బరువుతో సమానమైన జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 వాహకనౌక దేశీయంగా తయారైన అత్యంత భారీ రాకెట్.

జీఎస్‌ఎల్‌వీ మార్క్3 డీ1 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 3136 కిలోల బరువున్న జీశాట్-19ను రోదసిలోకి పంపించారు. భారత్ తన సొంతగడ్డ మీదినుంచి తొలిసారి ప్రయోగిస్తున్న అత్యంత భారీ ఉపగ్రహం కూడా ఇదే. మూడు దశల్లో జరిగే ఈ ప్రయోగంలో జీశాట్-19 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెడుతారు. ఈ ఉపగ్రహం రోదసిలో పదేండ్లపాటు సేవలందిస్తుంది. దీని ద్వారా ఉపగ్రహ సామర్థ్యాన్ని ఇస్రో రెట్టింపు చేసుకున్నట్లే. ఇంతకుముందు 2.3 టన్నుల ఉపగ్రహాన్ని ప్రయోగించాలంటే విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. భారత సాంకేతిక వ్యవస్థను మలుపుతిప్పే ఉపగ్రహమే జీశాట్-19. రోదసి నుంచి ఇంటర్నెట్ సేవలందించనున్న తొలి దేశీయ శాటిలైట్ ఇది.

ప్రస్తుతం భారత్‌కు సేవలందిస్తున్న 41 కక్ష్యా ఉపగ్రహాల్లో 13 సమాచార వ్యవస్థకు సంబంధించినవేనని, వాటికి అదనంగా చేరనున్న జీశాట్-19 డిజిటల్ ఇండియా స్ఫూర్తితో రూపొందించారు. దీని ద్వారా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ మనదేశంలోనూ సాకారం కానుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.