పీఠం కోసం తెర వెనుక మంతనాలు

Jana Reddy attempts for TPCC Chief Uttam Kumar Reddy scuttled

తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందు పదేళ్ళపాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సొంత పార్టీ వ్యవహారాలే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు మంత్రి పదవుల్లో ఉండి తెలంగాణా ఏర్పడ్డ తర్వాత మళ్ళీ అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాలకు తోడు వచ్చే ఎన్నికల్లో పట్టు సాధించాలంటే పార్టీలో కీలక పదవిలో ఉంటేనే సాధ్యమనే భావనలో ఎవరికివారు పీసీసీ అధ్యక్ష పదవి కోసం తెర వెనుక మంతనాలు చేస్తున్నారు.

Jana Reddy attempts for TPCC Chief  Uttam Kumar Reddy scuttled

తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015 ఫిబ్రవరిలో పొన్నాల లక్ష్మయ్య నుండి పీసీసీ పీఠం దక్కించుకొని రాష్ట్ర అధ్యక్షుడు అయిన నలమడ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అప్పటినుండి పార్టీని ముందుకు తీసుకెళ్ళేందుకు, అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తేనే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ 2019 ఎన్నికల్లోనూ పీసీసీ పదవిలో ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలన్న ప్లాన్స్‌లో ఉన్నారని గాంధీభవన్‌లో టాక్.

మరోవైపు తెలంగాణ పీసీసీ పదవిని దక్కించుకొనేందుకు సీఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డి పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకొనేందుకుగాను జానా ఎత్తుగడలు వేస్తున్నారు. పార్టీని సమర్థవంతంగా నడిపించే శక్తి, సామర్థ్యాలు తనకు ఉన్న విషయాన్నిఆయన పార్టీ నాయకత్వానికి వివరించారని, అందుకే ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలిసి తన మనసులోని కోరికను తెలియచేశారని జానా క్యాంప్‌ నుండి వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు కూడాలేనందున పార్టీ నాయకత్వ స్థానంలో ఉంటేనే పార్టీకి, తనకు ప్రయోజనమని జానారెడ్డి భావిస్తున్నారు.

See Also: జీఎస్టీ పరిధిలోకి వస్తే పెట్రోలు 40/- రూపాయల్లోపే

పీసీసీ చీఫ్ పదవి కోసం ఇప్పటికే ఆయన చాలాసార్లు ఢిల్లీలో పార్టీ పెద్దలతో భేటీ అయ్యారని సమాచారం. మండలిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేతతో కలిసి ఆయన ఇప్పటికే అహ్మద్ పటేల్ , గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ తదితరులతో సమావేశమయ్యారట. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కూడా జానారెడ్డి కలిసి తన మనసులోని మాటను వెల్లడించారట. అంతేగాక 2019లో జరుగబోయే ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి దక్కాలంటే పీసీసీ చీఫ్ పదవిలో ఉంటేనే ఎక్కువగా ప్రయోజం కలుగుతోందనే అభిప్రాయం కూడా జానా రెడ్డికి ఉన్నట్లు టాక్.

అయితే సిఎల్పీ నాయకుడు జానాకు పీసీసీ పీఠం దక్కకుండా ఉండేందుకు  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పార్టీ పగ్గాలను వదులుకొనేందుకు ఏమాత్రం సిద్దంగా లేరు. జానారెడ్డిలాంటి సీనియర్లు వేస్తున్న ఎత్తులకు ఆయన పైఎత్తులు వేస్తున్నారు. తన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్ళేలా ఉత్తమ్ వ్యూహరచన చేస్తున్నారు. అందులోభాగంగానే 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ క్రయక్రమాలు వ్యూహ రచన చేస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే పనిలో ఉన్నారు ఉత్తమ్. అంతేగాక పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించకుండా ఆచితూచి అడుగులేస్తున్నారు.

See Also: కోర్టుకు హాజరైన తెలంగాణా మంత్రులు

సంగారెడ్డిలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ఉత్తమ్‌ నాయకత్వంలోనే గ్రామాల్లో తిరిగి పార్టీని పటిష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం చెప్పిన తరువాత కూడా జానా ఢిల్లీలో మంతనాలు జరుపుతుండడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.