తీవ్ర గుండెపోటు వ‌ల్లే జ‌య మృతి

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఆమెకు అందించిన చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికలను తమిళనాడు సర్కారు సోమవారం వెల్లడించింది. ఆమెకు సాధ్యమైనంత ఉత్తమ వైద్య చికిత్సను అందించామని చెప్పడానికి ఈ వైద్యనివేదికలే నిదర్శనమని ఈ సందర్భంగా పేర్కొంది.

తీవ్ర గుండెపోటు వ‌ల్లే మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతిచెందిన‌ట్లు ఇవాళ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అపోలోలో చికిత్స‌పొందుతున్న జ‌య‌కు డిసెంబ‌ర్ 4వ తేదీన గుండెపోటు వ‌చ్చింద‌ని, ఆ వెంట‌నే ఆమెకు ఎక్మో ట్రీట్‌మెంట్ అందించామ‌ని, అపోలో-ఎయిమ్స్ వైద్యులు లు జ‌య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించార‌ని, డిసెంబ‌ర్ 5వ తేదీన జ‌య తుది శ్వాస విడిచార‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఎయిమ్స్ వైద్యులు స‌మ‌ర్పించిన మెడిక‌ల్ రిపోర్ట్ ఆధారంగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఈ అంశాల‌ను బ‌య‌ట‌పెట్టింది.

అంతకుముందు జయలలిత వైద్య నివేదికలను ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రి తమిళనాడు సర్కారుకు అందజేసింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతుండగా..  ఎయిమ్స్‌ వైద్యులు ఐదుసార్లు అక్కడికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, చికిత్సపై విశ్లేషణతో కూడిన వైద్య నివేదికను తాజాగా పళనిస్వామి సర్కారుకు ఎయిమ్స్‌ అందజేసింది.

గుండెపోటు వ‌చ్చిన త‌ర్వాత జ‌య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు సీనియ‌ర్ మంత్రులు ప‌న్నీరు సెల్వం, తంబిదురైతో పాటు శ‌శిక‌ళ‌, ప్ర‌భుత్వ అధికారుల‌కు తెలియ‌జేసిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. వీలైనంత వ‌ర‌కు సీఎం జ‌య‌కు ఉత్త‌మ వైద్యం అందిచామ‌ని త‌మిళ‌నాడు వెల్ల‌డించింది. జ‌య మృతిపై వ‌స్తున్న వ‌దంతుల‌ను కొట్టిపారేసేందుకే ఆమెకు అందించిన వైద్యం వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి వ‌స్తుంద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.