బాహుబలి2 ప్రీమియర్ రద్దు

Karan Johar Tweet about Bahubali2 Premier cancellation

 

Karan Johar Tweet about Bahubali2 Premier cancellation

దేశంలో బాహుబలి 2 విడుదల గురించి ఎదురుచూపులు రేపు ఉదయం వరకు కొనసాగుతున్నాయి. ఈ రోజు రాత్రి జరగాల్సిన ‘బాహుబలి 2’ ప్రీమియర్‌ షోను రద్దు చేశారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా మృతితో ఆయన గౌరవార్థం మొత్తం బాహుబలి చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ ట్వీట్‌ చేశారు.

తెరపై వినోద్‌ ఖన్నా కనిపించే తీరు మరొకరికి సాధ్యం కాదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తునట్లు కరణ్‌ పేర్కొన్నారు. స్నేహితుడు వినోద్‌ ఖన్నా మరణవార్త విన్న బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ తన తర్వాతి చిత్రం ‘సర్కార్‌ 3’ ప్రచార కార్యక్రమాలను దూరం పెట్టినట్లు సమాచారం.

రిషి కపూర్‌, అక్షయ్‌ కుమార్‌, ఆశా భోంస్లే తదితరులు వినోద్‌ ఖన్నా మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్‌మీడియా ద్వారా ఆయన మృతికి సంతాపం తెలిపారు.

1968లో వచ్చిన ‘మన్‌ కా మీట్‌’ చిత్రం ద్వారా వినోద్‌ ఖన్నా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన సినీ ప్రస్థానం బాలీవుడ్‌లో అప్రతిహతంగా కొనసాగింది. 2015 వరకు దాదాపు 140 చిత్రాల్లో ఆయన నటించారు. ‘మేరే గావ్‌ మేరా దేశ్‌’, ‘గద్దర్‌’(1973), ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘రాజ్‌పుత్‌’, ‘ఖుర్బానీ’, ‘దయావన్‌’ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచుకున్నారు. చివరిసారిగా దిల్‌వాలే చిత్రంలో కన్పించారు.

వినోద్‌ ఖన్నా 1946 అక్టోబర్‌ 6న పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆ తర్వాత కొంతకాలానికే భారత్‌, పాకిస్థాన్‌లు విడిపోవడంతో ఖన్నా కుటుంబం ముంబయికి వచ్చేసింది. సినిమాల మీద ఆసక్తితో 1968లో సునిల్‌ దత్‌ ‘మన్‌ కా మీట్‌’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆయన సినీ ప్రస్థానం విలన్‌ నుంచి హీరోగా కొనసాగింది.  ‘మన్‌ కా మీట్‌’ చిత్రంలో విలన్‌గా నటించిన వినోద్‌ ఖన్నా.. ఆ తర్వాత ‘పురబ్‌ అవుర్‌ పాశిమ్‌’, ‘ఆన్‌ మిలో సజ్నా’, ‘మస్తానా’, ‘మేరా గావ్‌ మేరా దేశ్‌’, ‘ఎలాన్‌’ లాంటి చిత్రాల్లో విలన్‌గా నటించారు.   ఆ తర్వాత 1971లో విడుదలైన ‘హమ్‌ తుమ్‌ అవుర్‌ వహ్‌’ సినిమాతో హీరోగా మారారు.

అలా.. ‘ఫెరాబీ’, ‘హత్యారా’, ‘ఖుర్బానీ’, ‘గద్దర్‌’ లాంటి సినిమాల్లో హీరోగా మెప్పించారు. 1987 నుంచి 1995 మధ్య నటించిన సినిమాల్లో వినోద్‌ ఖన్నా.. తన తోటి కథానాయకులైన రిషి కపూర్‌, గోవిందా, సంజయ్‌ దత్‌, రజనీకాంత్‌ కంటే ఎక్కువ పారితోషికం అందుకున్నారు. కాగా.. తారస్థాయిలో ఉన్న సయమంలో వినోద్‌ఖన్నా ఒక్కసారిగా సినీరంగానికి దూరమయ్యారు. ఆధ్యాత్మికత కోసం 1982లో సినీ జీవితాన్ని వదిలేశారు. దాదాపు ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి.. 1987లో ఇన్సాఫ్‌ సినిమాతో మళ్లీ సినీరంగ ప్రవేశం చేశారు.

141 చిత్రాల్లో పలు పాత్రల్లో కన్పించిన వినోద్‌ ఖన్నా..ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఫిలింఫేర్‌ అవార్డు, స్టార్‌ డస్ట్‌ అవార్డు, జీ సినిమా లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నటించిన మేరే అప్నే అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.