అయ్యా కావూరి… నీకు చంద్రబాబు ఎప్పుడూ నచ్చడా???

kavuri-sambasiva-rao-fires-on-chandrababu-and-complains-to-amit-shah

kavuri-sambasiva-rao-fires-on-chandrababu-and-complains-to-amit-shah

 

కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరికి చంద్రబాబుపై ఎప్పుడూ మంచి అభిప్రాయం లేదు. కాంగ్రెస్‌లో ఉన్నన్ని రోజులూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడిన కావూరి, రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇవ్వడం వల్లే ఇదంతా జరుగుతోందని ప్రచారం చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో కాంగ్రెస్‌కు ఆంధ్రప్రదేశ్‌లో నిలబడే పరిస్థితిలేకపోవడంతో స్వతహాగా వైఎస్‌జగన్‌కు బాగా దగ్గరైన కావూరి బిజెపిలో చేరేకంటే ముందే వైసీపీలో చేరుతారని ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. అయితే రాజకీయ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తప్పనిపరిస్థితుల్లో భారతీయ జనతాపార్టీ పంచన చేరారు.  ఆ తర్వాత ఎన్‌డిఎలో భాగమైన టిడిపి ఎన్నికల తర్వాత కూడా బిజెపితో మిత్రబంధం కొనసాగించడంతో చేసేదేంలేక బిజెపిలోనే కొనసాగిపోయారు కావూరి.

ఈ మూడేళ్ళలో బిజెపిలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకొనే ప్రయత్నం చేసిన కావూరి అమిత్‌షా పర్యటన సందర్భంగా చంద్రబాబుపై ఈ మూడేళ్ళలో దాచిపెట్టుకున్న కక్షనంతా వెళ్ళగక్కారు. మధ్యమధ్యలో కావూరి, పురంధ్రీశ్వరిలాంటి వాళ్ళు మిత్రబంధాన్ని పక్కనబెట్టి అప్పుడప్పుడు కామెంట్లు చేసినప్పటికీ ఎవరూ దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడు టిడిపి, బిజెపి మధ్య ఉన్న రాజకీయ మిత్రబంధం అంత బలంగా ఉండడమే.

అయితే చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు మోడీ జగన్‌ను పిలిపించుకొని మాట్లాడిన తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు నెమ్మదినెమ్మదిగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే తెలంగాణా పర్యటనలో బిజెపి అధినేత అమిత్‌షా సైతం ఎపిలో టిడిపితో పొత్తు 2019 వరకైతే కొనసాగుతుందని చెప్పడంతో కావూరిలాంటి మహా నాయకులకు పండగ చేసుకోవడానికి కొత్త కారణం దొరికినట్లైంది. అందుకే ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన అమిత్‌షాతో భేటీ అయి తమ బాధను, అక్కసును వెళ్ళగక్కుకున్నారు కమలనాథులు. పనిలో పనిగా పొత్తుల గురించి ఆలోచిస్తున్న అమిత్‌షా దగ్గర చంద్రబాబు గురించి, చంద్రబాబు ప్రభుత్వం గురించి చెవులు నింపే పనిచేశారు.

ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని సీఎం చంద్రబాబుపై కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అటు వైసీపీ కూడా బలపడటంలేదని ,  వైఎస్‌ హయాంలో కంటే చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిందని ఎద్దేవా చేశారు కావూరి. అంతేగాక రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పనితీరు అధ్వాన్నంగా మారిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కేవలం టీడీపీ – బీజేపీ వారికే కాకుండా.. పేదలందరకీ చేరాలని కావూరి కోరారు.

గ్రామస్థాయిలో బీజేపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు లబ్ది పొందుతున్నారని కావూరి అన్నారు. ఏపీలో జన్మభూమి కమిటీల తీరు అధ్వాన్నంగా ఉందన్న కావూరి ఏ విషయంలోనూ బీజేపీని టీడీపీ సర్కార్‌ పట్టించుకోవడం లేదని వాపోయారు. మిత్రపక్షం కాబట్టి టీడీపీ ఉన్న వ్యతిరేకత బీజేపీపై పడుతుందన్నారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చిన కావూరి ఈ అంశాలన్నీ అమిత్‌షాకు వివరించినట్లు తెలిపారు.

 

మొత్తానికి చాలాకాలంగా మనసులో దాచిపెట్టుకున్న అక్కసునంతా అమిత్‌షా, మీడియా ముందు వెళ్ళగక్కారు కావూరి సాంబశివరావు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.