శిఖర సద్రుష్యుడు కుష్వంత్

జీవితాన్ని ఎట్లా ప్రేమించాలో, ఎట్లా జీవించాలో, ఎట్లా అనుభవించాలో, ఎట్లా నియంత్రించాలో, వయస్సుకు తగినట్టు ఎట్లా మలచుకోవాలో ఆచరించి చూపించిన స్థితప్రజ్ఞుడు కుష్వంత్ సింగ్. ఎంత హాయిగా, ఉన్నతంగా, కల్లాకపటం లేకుండా, నిజాయితీగా,  నిర్భీతిగా  బతికాడో అంతే అనాయాసంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. కుష్వంత్ సింగ్ ను పోలిన వ్యక్తి మరొకరు లేరు. అంతటి బహుముఖీనమైన వ్యక్తిత్వం మరొకటి గతంలో కానీ వర్తమానంలో కానీ కనిపించదు. మెదడు కంటే మనసు చెప్పినట్టు నడుచుకున్న మనిషి. చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. అనర్హులకు యోగ్యతాపత్రాలు ఇచ్చారు. అన్యాయాన్ని సమర్థించారు.  తప్పిదాలను గ్రహించిన ప్రతిసారీ ధైర్యంగా ఒప్పుకున్నారు. జయాపజయాలను సమానంగా స్వీకరించారు. పట్టుదల వస్తే ఎంతటికైనా తెగించే మనస్తత్వం ఆయనది. ఎదుటివారు ఎంతటివారైనా సంకోచించకుండా మనసుకు తోచిన మాట చెప్పడం, బుర్రకు తోచిన విమర్శ మొహమాటం లేకుండా చేయడం ఆయన ప్రత్యేకత. కుష్వంత్ తన సుదీర్ఘ జీవితంలో తీసుకున్న నిర్ణయాలలో అసమంజసమైనవీ, అర్థం లేనివీ చాలా ఉన్నాయి. ఆత్యయిక పరిస్థితిని సమర్థించడం, సంజయ్ గాంధీని వెనకేసుకురావడం, ఇందిరాగాంధీ అభీష్టానికి వ్యతిరేకంగా సంజయ్ గాంధీ భార్య మేనకాగాంధీని అభిమానించడం, ఆమెకు జర్నలిజంలో మార్గదర్శనం చేయబూనడం వంటి అనేక పనులు ముందుగా ఆలోచించి, లాభనష్టాలను బేరీజు వేసుకొని, మంచిచెడులను పరిశీలించి చేసినవి కావు. ఏ నిర్ణయం తీసుకున్నా దానిని నిస్సంకోచంగా అమలు చేయడం కుష్వంత్ సింగ్ చిత్తశుద్ధికి నిదర్శనం. పత్రికలపైన సెన్సార్ షిప్ ను విధించినందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని దుయ్యపట్టినప్పుడూ, పంజాబ్ లో తీవ్రవాదానికి ప్రతీకగా నిలిచిన భింద్రేన్ వాలే ను ఎండగట్టినప్పుడూ, స్వర్ణదేవాలయంలో సైనికులు ప్రవేశించడం పట్ల నిరసనగా పద్మభూషణ్ పురస్కారాన్ని వాపసు చేసినప్పుడూ కుష్వంత్ సింగ్ లోని నిబద్ధత కొట్టవచ్చినట్టు కనిపించింది.

కుష్వంత్ సింగ్ ఇంగ్లీషు పత్రికాలోకానికీ, పాఠకలోకానికీ ఒక ఉత్తేజకరమైన జ్ఞాపకంగా నిలిచిపోతాడు. పత్రికా రచయితగా, నవలా రచయితగా, హాస్యరచయితగా ఆయనంటే పడిచచ్చే మూడు తరాల అభిమానుల జీవితాలలో ఆయన విడదీయలేని భాగం. ఇంగ్లీషు వచనాన్ని ఎంత సులభగ్రాహ్యంగా, ఎంత అందంగా, ఎంత రసమయంగా, ఎంత సూటిగా రాయవచ్చునో కుష్వంత్ రచనలు చదివినవారికి అనుభవైకవైద్యం. తాము కుష్వంత్ శిష్యులమంటూ ప్రముఖ సంపాదకుడు ఎంజె అక్బర్ వంటి వ్యక్తులు సగర్వంగా చాటుకుంటారు. ఇంగ్లీషులో తాము చేసిన రచనల ప్రమాణాలను కుష్వంత్ సింగ్ మెచ్చుకుంటూ తన కాలమ్ లో ఒక వాక్యం రాస్తే దాన్ని ఎంతో విలువైన యోగ్యతాపత్రంగా భావించి పదిలపరుచుకునే మణిశంకర్ అయ్యర్ వంటి సమర్థులైన రచయితలు అనేకమంది. పీవీ నరసింహారావు రచించిన ఆత్మకథాత్మకనవల ఇన్ సైడర్ చప్పగా ఉందంటూ చప్పరించినా, ఒక పాఠకుడు పంపిన జోక్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తూ పాఠకులకు సిఫార్సు చేసినా కుష్వంత్ తీర్పును ప్రశ్నించే సాహసం ఎవ్వరూ చేయరు. మ్యాలిస్ టువర్డ్స్ ఒన్ అండ్ ఆల్ అనే శీర్షికతో కాలమ్ ను అత్యద్భుతంగా అనేక సంవత్సరాలు రక్తికట్టించిన పెద్దమనిషి మనసులో ఎవరిపట్లా ద్వేషభావం లేదు. తోటివారిని  ప్రేమించే స్వభావం, మంచిని మెచ్చుకుంటూ చెడును చీదరించుకునే మనస్తత్వం ఆయనది. తన శృంగార జీవితంపై రాసిన రచనలలో వాస్తవం కంటే కల్పితమే అధికం. స్త్రీలతో తన సంబంధాల గురించి చెప్పిన విషయాలలో ఊహాజనితాలే ఎక్కువ. జీవితాన్ని గానుగ ఎద్దులాగా కాకుండా సృజనాత్మకంగా, రసభరితంగా, ఆహ్లాదకరంగా ఎట్లా జీవించవచ్చునో హృదయాలకు హత్తుకునే విధంగా చెప్పడానికి కొన్ని కట్టుకథలు చెప్పినా తప్పులేదనే ధోరణి ఆయనది. తన మీద తానే జోకులు వేసుకోవడం, సర్దార్ జీల జోకులను పనికట్టుకొని వ్యాప్తిలోకి తేవడం, హాస్యానికీ, శృంగారానికీ  పెద్దపీట వేయడం ఒక ఎత్తు అయితే, ట్రయిన్ టు పాకిస్తాన్ వంటి యదార్థ రచనలు చేయడం, సిక్కుల చరిత్ర వంటి అధ్యయన గ్రంధం రచించడం మరో ఎత్తు. ఉర్దూ కవిత్వం పట్ల కుష్వంత్ సింగ్ కు అపారమైన ప్రేమ. సందర్భం వచ్చినప్పుడల్లా గాలిబ్ నో, ఇక్బాల్ నో ఉటంకించడం ద్వారా తన రచనలను సంపన్నం చేశారు. సొంత రచనలు చేయడంతో పాటు పంజాబీ నుంచి ఇంగ్లీషులోకి అనువాదాలు చేశారు. కుష్వంత్ సింగ్ వెలువరించిన పుస్తకాల శీర్షికలు కూడా ఆకర్షణీయంగా, ఆలోచనాత్మకంగా, కొండొకచో తుంటరిగా ఉంటాయి. ‘ద కంపెనీ ఆఫ్ విమెన్’, ‘ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మ్యాలిస్’  వంటి శీర్షికలు ఈ కోవలోనివే.

మరి కొన్ని మాసాలు జీవించి ఉంటే నిండా నూరేళ్ళు పూర్తి చేసేవారు. సరిగ్గా నాలుగు దశాబ్దాల కిందట జర్నలిజం విద్యార్థిగా బొంబాయి వెళ్ళినప్పుడు కుష్వంత్ సింగ్ ను కలుసుకున్నాను. మీ రాష్ట్రంలో అన్ని వార్తలు ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ మమ్మల్ని ప్రశ్నించారు. అప్పుడు జై ఆంధ్రా ఉద్యమం పతాకస్థాయిలో నడుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కుష్వంత్ సింగ్ అంటే ప్రాణం. ఆయన రచనా శైలి చాలా ఇష్టం. లౌకికవాదాన్నీ, జర్నలిజం ప్రమాణాలనూ, ప్రజాస్వామ్య విలువలనూ ఆయన సమర్థించే తీరు అనితర సాధ్యం. పత్రికారంగాన్నీ, సాహిత్యలోకాన్నీ ప్రబలంగా ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి కుష్వంత్ సింగ్ అస్తమయంతో ఒక శకం ముగిసింది.

– కె. రామచంద్ర మూర్తి

Have something to add? Share it in the comments

Your email address will not be published.