కోడెల భావం ఏదైనా భాష తప్పు.. తిరగదోడడం మరింత పొరబాటు

(పాత చిత్రం)

అగ్రిగోల్డ్‌ చర్చలో అసందర్భంగా అది కూడా ముఖ్యమంత్రి హౌదాలో స్పీకర్‌ వ్యాఖ్యల సమస్య తీసుకొచ్చారు గాని కోడెల శివప్రసాదరావు మాటలు అపార్థానికి అవకాశమిచ్చాయన్నది నిజం. కోడెల బాగా మాట్లాడతారు విశ్లేషిస్తారు. మేమిద్దరం చాలా చర్చల్లోనూ బయిట కూడా కలసి మాట్లాడాము కూడా. మహిళా పార్లమెంటు సందర్భంగా స్త్రీలపై దాడుల గురించిన ప్రశ్న వచ్చినపుడు వాహనాలను బయిటకు తీయనంతవరకూ ఫర్వాలేదు గాని తీశాక యాక్సిడెంట్లు జరుగుతాయని అన్నమాట నిజం. దానిపై తర్వాత చాలానే వివరణ ఇచ్చి సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు గాని ఆ పోలికే పొరబాటు. మనుషులను కార్లతో పోల్చడం షెడ్డులో వుంచడాన్ని మహిళలు ఇళ్లలో వుంచడంతో కలపి చెప్పడం సరైంది కాదు.

మాట్లాడేప్పుడు ఎవరైనా పొరబాటు దొర్లవచ్చు. దీనిపై అపార్థాన్ని సవరించి వుంటే సరిపోయేది. దాని బదులు ఎదురుదాడి చేయడం, ఇన్నాళ్ల తర్వాత తిరగదోడడం మరింత పొరబాటు. సాక్షిలో ఎక్కువగా ఇచ్చారేమో నాకు గుర్తు లేదు గాని అన్ని పత్రికలూ ఛానళ్లు దాన్ని ప్రసారం చేశాయి. పైగా మరో రాజకీయ వివాదంతో దాన్ని కలిపి చెప్పడం ద్వారా స్పీకర్‌ స్థానం నిస్పాక్షికతను ప్రభుత్వమే భగపరిచినట్టయింది. ఇప్పటికైనా దీన్ని ఇంతటితో కట్టిపెడితే మంచిది తప్ప సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నట్టు భావ ప్రకటనా స్వేచ్చకు పరిమితుల గురించి చెప్పడం సందేహాలు కలిగిస్తుంది. జగన్‌ భార్య దానికి చైర్మన్‌ గనక అక్కడ వచ్చిన ప్రతి వార్తకూ ప్రతిపక్ష నేతను బాధ్యుడిని చేసి శిక్షిస్తామనడం సాంకేతికంగా కుదరదు. హెరిటేజ్‌ ఫుడ్స్‌లో ఏదైనా పొరబాటు జరిగితే చంద్రబాబును బాధ్యుడిని చేస్తామనడం లాంటిదే అది. చట్టం వేరు రాజకీయం వేరు. మీడియాపై అందులోనూ సోషల్‌ మీడియాపై కూడా దాడికి దిగడం ఇంకా తప్పు.

తెలకపల్లి రవి

Have something to add? Share it in the comments

Your email address will not be published.