కులభూషణ్‌ మరణశిక్షపై స్టే… పాకిస్థాన్‌కు మొట్టికాయలు

Kulbhushan Jadhav Case ICJ Stays Execution Order By Pakistan and tells Don't Hang Kulbhushan Jadhav Before Final Verdict

Kulbhushan Jadhav Case ICJ Stays Execution Order By Pakistan and tells Don't Hang Kulbhushan Jadhav Before Final Verdict

న్యాయం గెలిచింది… ధర్మ పోరాటంలో భారత జెండా రెపరెలాడింది. దాయాది దేశం జిత్తులమారి నక్క వేషాలు ఎన్ని వేసినా వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అంతర్జాతీయ ధర్మాసనం పాకిస్తాన్‌కు మొట్టికాయలు వేసింది. గూఢచర్యం కేసులో పాకిస్థాన్‌ సైనిక న్యాయస్థానం భారత మాజీ నౌకాదళాధికారి జాదవ్‌కు విధించిన మరణశిక్షను రద్దుచేయాలని భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసిన తర్వాత జరిగిన విచారణ, వాదనల అనంతరం అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్‌కు ఊరట లభించింది.  తుది తీర్పు వెల్లడించేవరకు అతడికి విధించిన ఉరిశిక్షను అమలుచేయొద్దని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేగాక జాదవ్‌ను కలుసుకునేందుకు భారత రాయబారికి అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది.

గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ 46ఏళ్ల జాదవ్‌ను పాక్‌ ప్రభుత్వం గతేడాది మార్చి 3న అరెస్టు చేసింది. గూఢచర్యం, కుట్రలకు పాల్పడ్డారనే అభియోగాలను మోపి గత నెలలో కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్‌ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈనెల15న విచారణ చేపట్టారు. పాక్‌ మిలటరీ కోర్టు తీర్పును అంతర్జాతీయ న్యాయస్థానంలోని 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం సమీక్షించింది.

కుల్‌భూషణ్‌ అరెస్టుపై ఎలాంటి ఆధారాలు చూపకుండానే అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి పాక్‌ మరణశిక్ష విధించిందని భారత్‌ తరఫున హాజరైన విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్‌ మిత్తల్‌, న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదించగా, గూఢచారులకు అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవంటూ పాక్‌ ప్రతివాదన చేసింది. అంతేగాక బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ తమ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని పాక్ ఆరోపించింది. అయితే, అతడిని ఇరాన్‌లో కిడ్నాప్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్లి అక్రమంగా కేసులు పెట్టారని భారత్ వాదించింది.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఈరోజు కీలక తీర్పు ఇచ్చింది. జాదవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాదవ్‌ కేసును విచారించే పరిధి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉందని తేల్చింది. జాదవ్‌ను ఉరితీయబోమని పాకిస్థాన్‌ హామీ ఇవ్వాలని ఐసీజే కోరింది. ఈ కేసులో భారత్‌ తరఫున హరీశ్‌ సాల్వే, పాక్‌ తరఫున అస్తర్‌ అలీ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అయిన హరీశ్ సాల్వే.. ఈ కేసులో వాదించేందుకు నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకున్నారు. భారత్, పాక్ రెండు దేశాలూ వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఉండాలని జడ్జి రోనీ అబ్రహాం చెప్పారు.

అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్థాన్‌కు మొట్టికాయలు పడడమేకాకుండా మరణశిక్షపై స్టే విధించడంతో ఈ కేసులో్ భారత్ పాక్షిక విజయం సాధించినట్లైంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్ మీద భారత్ 18 ఏళ్ల తర్వాత మరోసారి పైచేయి సాధించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.