ఇద్దరు చంద్రులకి రైతులంటే ‘చచ్చిపోయేంత ప్రేమ’

Love for farmers is just a publicity for two CMs of Telugu States

Love for farmers is just a publicity for two CMs of Telugu States

పీవీ సింధుకి డిప్యూటీ కలెక్టర్ పదవి ఇచ్చేలా బిల్లుకు సవరణ, సానియా మీర్జా కప్పు గెలిచొస్తే కోటి రూపాయలు నజరానాలు ఇచ్చే ప్రభుత్వాలకు మమ్మల్ని పట్టించుకోండి మహాప్రభో అంటూ రైతన్నలు చేస్తున్న రోదనలు ఏమాత్రం వినిపించవా?? రైతుల బలవన్మరణాలు కనిపించవా?? ఎండకు ఎండి మద్దతు ధర లభించక చనిపోతున్న రైతన్నల ఆత్మఘోష ఈ ప్రభుత్వాలకు శాపనార్థాలుగా మారే రోజులు దగ్గరపడుతున్నాయి.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతులు సంతోషంగా ఉన్నప్పుడే సాధ్యమని ఫాంహౌజ్‌లో ఫ్యాన్సీ పంటలు పండించే తెలంగాణా పెద్దాయనకు, హెరిటేజ్ పేరుతో పాలవ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్న కార్పోరేట్ రైతుకు తెలియదంటే నమ్మలేం కానీ, అధికారం చేతికొచ్చిన తర్వాత వచ్చే దర్పం వీళ్ళని చిన్నోళ్ళ వైపు చూపు తిప్పకుండా ఆపేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహంలేదు. ఎప్పటికప్పుడు ఖద్దరు చొక్కా నలగకుండా ఎసి కారు దిగకుండా అవసరమైతే హెలికాప్టర్లలో పర్యటనలు చేస్తున్న ఇద్దరు చంద్రులు క్రీడాకారిణులపై చూపిస్తున్న ప్రేమ, మమకారం కూసింతైనా రైతన్నల బాగోగులు చూడడానికి వాడింటే అసలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు అవస్థలు పడాల్సిన అవసరం ఏమాత్రం ఉండకపోయేది. ప్రతిపక్షాలకు నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవకాశం కూడా రాకుండా ఉండేది. గిట్టుబాటు ధరలులేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఏదో కొంపలు మునిగిపోయినట్లు అనుకున్నవారిని అందలాలు ఎక్కించే సవరణ బిల్లులకు మాత్రం ఓకే చెప్పించుకుంటున్నారు.

మిర్చి కొనుగోళ్ళు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నుండి మార్కెట్ యార్డుకు సెలవు ఇచ్చారు. మరోవైపు తెలంగాణాలో కూడా దాదాపు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఖమ్మంలో కడుపుమండిన రైతులు మార్కెట్ యార్డు కార్యాలయంపై చేసిన దాడి కేసులో తెలంగాణా ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగింది.

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో పంట అమ్ముకోవడానికి మార్కెట్‌కు వచ్చిన ఓ రైతు వారం రోజులుగా అక్కడే పడుకుంటున్నాడు. తీవ్ర మనస్థాపానికి గురైన అతను ఈరోజు ఉదయం విగతజీవిలా కనిపించాడు. అంతేగాక లేటెస్ట్‌గా ఈరోజు ఉదయం సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్ దగ్గర ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతు ప్రగతి భవన్ వద్దకు చేరుకుని పురుగుల మందు తాగాడు. అప్పుల బాధల వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అనుకుంటున్నారు.

మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతుల ఆక్రందనలు పాలకులు ఎప్పుడు పట్టించుకుంటారో, బలవన్మరణాలు ఎప్పుడు ఆగిపోతాయో దేవుడికే తెలియాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.