నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే

Mahatma Jyotirao Govindrao Phule was a legendary leader

జ్యోతిరావుఫూలే నవయుగ వైతాళికుడు. ఆయన ముఖ్యంగా శూద్ర, అతిశూద్రుకు విద్యను నిరాకరించిన అంశాల మీద పోరాడి వీరిలో విద్యా చైతన్యాన్ని కల్పించాడు. ఫూలే ఉద్యమం లేకుంటే ఈనాడు కొందరి చేతుల్లోనే విద్యా సంస్కృతి, చరిత్ర, ప్రబోధం మిగిలిపోయి ఉండేవి. కానీ విద్యను అందరికీ సార్వత్రికం చేయటానికి ఆయన చేసిన పోరాటంలో కులవాదం లేదు. ఆనాడు బ్రాహ్మణవాదాన్ని ఎదిరించే క్రమంలో బ్రాహ్మణును కూడా ఎదిరించాల్సి వచ్చింది. బ్రాహ్మణుల్లో ఆనాడు పూలేను ఎంతోమంది సమర్ధించారు. ఆయన పోరాటంలో సాహు మహరాజ్‌ సమర్ధించారు. ఆ పోరాటాన్ని మనం అవగాహన చేసుకోగలిగితేనే ఏ ఆధిపత్య వర్గాల కొన్ని వేలసంవత్సరాల విద్యను స్వాయత్తం చేసుకుని ఈనాటి నిరక్ష్యరాశ్యతకు, పేదరికానికి కారణమవుతున్నాయో తెలుసుకోగలుగుతాం.

జ్యోతిరావుఫూలే చిన్నతనం నుంచి బ్రాహ్మణవాదాన్ని బలంగా ఎదుర్కొన్నాడు. జ్యోతిరావును మధ్యలో స్కూలు మాన్పించి తండ్రి వ్యవసాయంలో పెట్టాడు. ఫూలే వ్యవసాయ భూమిలో పనిచేశాడు. మొక్కల్ని నాటాడు. కలుపు తీశాడు, పూలను పూయించాడు, గడ్డి కోశాడు, శ్రమలో ఉండే సౌందర్యాన్ని కూడా అనుభవించాడు. చిన్నతనంలోనే ఆయనకు పెండ్లి చేశాడు. అప్పుడు ఆయనకు 13 సంవత్సరాలు. ఆయన పెండ్లి చేసుకున్న సావిత్రికి పసితనం వదలేదు. అప్పుడు వుండే సామాజిక పరిస్థితుల్లో ఆ పెండ్లి అలా జరిగింది. ఆయన స్కూల్‌ని వదిలిపెట్టినా పుస్తకాలను వదిలిపెట్టలేదు. ఆయన తోటలో పనిచేసిన తరువాత రాత్రిపూట వీధి దీపాల దగ్గర చదువుకున్నాడు. ఈయన చిన్నప్పుడే తన పొరుగువారినందరిని ఆకర్షించాడు. గఫర్‌మున్షి అనే ఉర్దూ టీచర్‌ మళ్ళీ ఆయనను దగ్గరకు తీశాడు. ఆయన ఉర్దూ పర్షియన్‌ టీచర్‌. ఆయన గోవిందరావు తండ్రితో జ్యోతిరావుకు విద్య చెప్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అలా ఎట్టకేలకు జ్యోతిరావుఫూలే మళ్ళీ చదువు ప్రారంభించారు. జ్యోతిరావుఫూలే ఆధునిక సాంస్కృతిక విప్లవానికి ప్రవర్తకుడు కావడానికి కారణం ఆయన చరిత్రను సంస్కృతిపరంగా విశ్లేషించాడు. ఇతర కుల నాయకుల్ని ముఖ్యంగా క్రింది వారిని చంపిన రోజును బ్రాహ్మణులు పండగగా జరుపుకునే వైనాన్ని ఫూలే గుర్తించాడు. ఈ విధమైన విద్యాభ్యాసం ఆయన చేయటానికి కారణం ఆయన చదువు కూడా ఎన్నో ఒడిదుడుకులకు గురికావడం కేవలం శూద్రులు చదువుకోకూడదనే ఒకే ఒక భావంతో తన తండ్రికి అగ్రవర్ణ సహాదారులు ఇచ్చిన సలహాల ఆంతర్యాన్ని ఆయన పసిగట్టారు. బ్రాహ్మణులు మనుస్మృతి ప్రకారం నడుచుకుంటారు. అక్షరం మనకు మిగిలి ఉంటే అందరు మన చేతుల్లో బందీలుగా ఉంటారనేది వారి విశ్వాసం. అందుకనే శూద్రుల, అతిశూద్రుల చదువుని అడ్డుకోవడం కూడా ఒక పనిగా వాళ్ళు పెట్టుకుంటారు. అందుకు ఉద్యమాలు కూడా నడుపుతారు. ఇటువంటి స్వభావాల మధ్య ఆయన విద్యాభ్యాసం ఎలా సాగిందో ధనుంజయ్‌ కీర్‌ చక్కగా వివరించారు.

ఫూలే తండ్రి గోవిందరావు 1841లో జ్యోతిరావును మళ్ళీ పాఠశాలకు పంపించాడు. అప్పుడు జ్యోతిరావుకి 14 సంవత్సరాలు చదువుకోవాలన్నా దృఢసంక్పం, నేర్చుకోవడం పట్ల కుతూహలంతో విద్యపట్ల ఎంతో ఆసక్తి చూపిన జ్యోతిరావు పరీక్షల్లో అత్యధిక మార్కు సంపాదించాడు. ఉపాధ్యాయులూ ఆయనను తరచూ అభినందించేవారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో సదాశివ బల్లాల్‌ గోవింద్‌ అనే బ్రాహ్మణ బాలుడితో చెలిమి చేశాడు జ్యోతిరావు. అతడు 1824వ సంవత్సరంలో పూనాలో జన్మించాడు. గోవింద్‌ ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా, అత్యంత పట్టుదలతో నిర్విరామ కృషితో జీవితంలో పైకొచ్చాడు. అతడు స్కాటిష్‌ మిషన్‌ స్కూల్లోనూ, పూనాలోని బుదవార్‌వాడలోని జ్యోతిరావుతో కలిసి చదువుకున్నాడు. ఇంటి చుట్టుపక్క ఉన్న ముస్లిం పిల్లలతో కూడా జ్యోతిరావు స్నేహంగా మసలేవాడు. దైవం, మతం పేర బ్రహ్మణులు ప్రచారం చేస్తున్న తీరు అర్థం చేసుకోవడానికి ముస్లిం పిల్లల సహచర్యం కొంత ఉపకరించింది.

ఆ రోజుల్లోనే హిందూత్వం పేరుతో అగ్రకులాల కుట్రను అర్థం చేసుకున్నాడు. మతం పేరుతో చెప్పేవన్నీ అబద్దాలని తెలుసుకున్నాడు. కులాల వైరుద్యం అతన్ని బాధపెట్టింది. మనిషి యొక్క హక్కులు, విధులు ఏమిటో స్కాటిష్‌ మిషన్‌ స్కూల్లో జ్యోతి నేర్చుకున్నాడు. జ్యోతిరావు తన విద్యాభ్యాసంలో హిందూ భావజాలం యొక్క సంకుచితత్వాన్ని, కులతత్వం యొక్క పునాదిని అర్థం చేసుకున్నాడు. ఆ దిశ నుంచే మొత్తం సామాజిక వ్యవస్థను చూశాడు. దాన్ని ‘ఏదో ఇలా జరిగిపోతుంది’ అని వదిలివేయకుండా ఈ సమాజాన్ని మార్చడం కోసం ఆయన ఆలోచన ప్రారంభించాడు. ముఖ్యంగా ఆయన మెట్రిక్యులేషన్‌ అయిపోయిన తరువాత థామస్‌ స్పెయిన్‌ రాసిన ‘రైట్స్‌ ఆఫ్‌ మ్యాన్‌’ అనే పుస్తకంతో ప్రభావితం చెందాడు. ఇక అప్పటి నుండి మానవ హక్కు పోరాటంలో జ్యోతిరావ్‌ వెనుతిరిగి చూడలేదు. ఫూలే తన విద్యాభ్యాసానికి అడ్డువచ్చిన బ్రాహ్మణిజాన్ని, దాని కుట్రను లోతుగా చూశాడు.

అప్పటికి మరాఠా ప్రాంతంలో అధికారం పైనుండి క్రింద వరకు బ్రాహ్మణులే నిర్వహిస్తున్నారు. శివాజీ శూద్రకులం నుండి ఛత్రపతిగా మారిన వీరుడు. ఆయనకు చక్రవర్తిత్వాన్ని ఇవ్వడానికి ఆనాటి బ్రాహ్మణవర్గం చాలా సంఘర్షణ పడింది. గంగభట్టు అనే బ్రాహ్మణుడు తాను తూగినంత బంగారం తీసుకొని శివాజీకి క్షత్రియత్వం ఇచ్చాడు. శివాజీ మంత్రివర్గంలో బ్రాహ్మణులే పీష్వాలు. వీరికాలంలో మరాఠా సమాజంలో బ్రాహ్మణత్వం అభివృద్ధి చెందింది. రాజు నుంచి గ్రామాధికారి వరకు బ్రాహ్మణులే అధికారంలో వున్నారు. విద్యలోకి ఇతర కులాలని రాకుండా అడ్డుకున్నారు. ఉద్యోగాల్లోకి మరో కులం రాకుండా అడ్డుకట్ట వేశారు. మహాత్మాఫూలే భవిష్యత్‌ దర్శనం ఉన్న గొప్ప దార్శనికుడు. ముఖ్యంగా జీవితంలో తనకు ఎదురైన గాయాల్ని స్వీకరించి వాటి వెనుక మర్మాన్ని, కుట్రను శోధించాడు. విద్యాలయాల్లో శూద్ర, అతిశూద్రుకు విద్యరాకుండా ఉపాధ్యాయు ఎలా అడ్డుపడుతున్నారో గ్రహించాడు. తమ వర్ణం వారిని బ్రాహ్మణులు ఎలా దగ్గరికి తీసి ఇతరును ఎలా అపహాస్యం చేస్తున్నారో అనే విషయాన్ని ఆయన ఆనాడే గమనించాడు. దానిమీద పోరాటం చేశాడు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ అంటే అది మార్క్సిస్టు ఆలోచనకు పెట్టని కోట. మార్క్స్‌ వాదులు ఉపాధ్యాయులుగా 50 శాతం ఉన్నారు. అయితే వారంతా బ్రాహ్మణులే. అక్కడక్కడా బ్రాహ్మణవాదం నగ్నంగా కనిపిస్తుంది. స్వతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాల గడిచినా, ఆ విశ్వవిద్యాయంలో బ్రాహ్మణ్యం ఎలా ఉందో వివరిస్తూ ఆర్‌.అశీష్‌ అనే స్కార్‌ పరిశోధక వ్యాసాన్ని రాశారు. మార్కులు తక్కువేస్తూ, వైవాలో పిచ్చి ప్రశ్నలు అడుగుతూ విద్యార్థులకు 30, 32 మార్కులు వేస్తూ నిరుత్సాహపరిచే తీరును అశీష్‌ ఉదాహరణతో పట్టికలు వేసి మరీ వివరించారు. బ్రాహ్మణేతరుల పట్ల ఈ నిరుత్సాహం నేటికీ వివిధ రూపాల్లో కొనసాగుతున్నది. ఇంకా ఉన్నత విద్యాలయాల్లో బ్రాహ్మణవాదమే చెలామణి అవుతున్నది. అందుకే మహాత్మాఫూలే, అంబేడ్కర్‌ బోధన చారిత్రక అవసరం ఇంకా ఉంది.

మహాత్మాఫూలే అంబేడ్కర్‌ జీవించిన నాటి సమాజ రూపాలు ఉపరితలంలో మారినా అంతరంగిక రూపం ఇంకా చెక్కు చెదరకుండా అనేక గ్రామాల్లో, నగరాల్లో అలాగే ఉంది. సాక్షాత్తు విద్యాలయాల్లో కులం విలయతాండవం చేస్తున్నది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని కులం చూసి ప్రోత్సహిస్తున్నాడు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఫ్యాకల్టీలో హెడ్‌గా ఎవరు ఉంటే వారి కులం విద్యార్థుకు ఎక్కువ ర్యాంకులు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులకు 50 శాతం కంటే తక్కువ వేసి వారిని తరువాత విద్యకు, ఉద్యోగాలకు అనర్హుగా చేయటం వీరు చేసే పెద్ద కుట్ర. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం వస్తేనే లెక్చరర్‌కు అర్హత ఉంటుంది. అయితే బ్రాహ్మణేతరులకు వీళ్ళు 50 శాతం ఇస్తున్నారు. శూద్ర, అతిశూద్రలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వారు 55 శాతం మార్కులు ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అదేమంటే వీళ్ళకు ప్రతిభ లేదంటున్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో నేటికీ బ్రాహ్మణులదే ఆధిపత్యం నడుస్తుంది.

మహాత్మాఫూలే పౌరాణిక గాథల్లోని క్రూర కర్ముల్ని ఎలా గొప్ప వీరులుగా కొనియాడారో బయటపెట్టాడు. ముఖ్యంగా పరశురాముడు తల్లి తల నరకడం, దేశీయ క్షత్రియుల్ని అణచివేయడం, క్రూరంగా వధించటం వంటి సంఘటనలను బట్టి కొత్త కొత్త మారణాయుధాలతో ఆర్యులు ఈ దేశంలో సాధించిన దురాగతాలు మహాత్మాఫూలే అధ్యయనం చేసి అప్పటికి ఎవరూ ఊహించని పద్ధతుల్లో విశ్లేషణ చేశారు. బ్రాహ్మణాధిక్యత చరిత్రలో బౌద్ధం వచ్చిన తరువాత అహింస పరులుగా ప్రపంచం మారుతున్న సందర్భంలో బౌద్ధానికి ముందుకు ఎంత మారణహోమాన్ని కొనసాగించారో మహాత్మాఫూలే శాస్త్రీయ బద్ధంగా వివరించారు. పరుశురాముణ్ణి క్రూరుడిగా, స్వార్థపరుడిగా, అమానుషమైనవాడిగా, అయోగ్యుడిగా మహాత్మాఫూలే వర్ణించడంలోనే ఆయన నిశిత పరిశీలనా ధోరణి చారిత్రక అవగాహన మనకు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. వేలకొద్ది మనుషుల్ని, రక్షణలేని పిల్లల్ని పరుశురాముడు చంపిన సంఘటను చూసినప్పుడు బ్రాహ్మణ సామ్రాజ్యవాదం ఏ విధంగా కర్కశంగా పయనించిందో ఆయన మన కళ్ళకు చూపిస్తాడు.

హిందూ పీనల్‌కోడ్‌ ఆ రోజున నిర్ణయించబడింది. రాజ్యాన్ని పాలించే రాజు దీన్ని కాదనక అనుసరించేవారు. దీన్ని అనుసరించకపోతే ఆదర్శం అని రాజ్యానికి అరిష్టమని వారు ప్రచారం చేశారు. కొందరికి మంత్రంతోపోయే శిక్ష, కొందరికి ప్రాణాంతకం అవుతుంది. ఈ కుల చట్రాన్ని ఉక్కు చట్టాల ద్వారా శిలాక్షరాల్లో బిగించారు. ఈ లోతైన విషయాన్ని జ్యోతిరావుఫూలే ఆనాడు తెలియచేయడం వల్ల అది అంబేడ్కర్‌కు తన పరిశీనా పరిశోధన పద్ధతిలో ఎంతో ఉపకరించింది. అంబేడ్కర్‌ తన పరిశీలనని ఈ మార్గంలో కొనసాగించాడు. మహాత్మాజ్యోతిరావుఫూలే ఆలోచనను తీసుకుని అంబేడ్కర్‌ మాత్రమే కాకుండా, మార్క్సిస్టు, అంబేడ్కరైట్లు బ్రాహ్మణవాదాన్ని, హిందూ హింసావాదానికి ప్రత్యామ్నాయంగా శూద్ర, అతిశూద్రుగా అగ్రకులాల్లో ఉన్న పేదలను కులుపుకుని విద్యా, సాంస్కృతిక విప్లవాన్ని విజయవంతం చేయాల్సిన చారిత్రక సందర్భం ఇది. ఆ మార్గంలో నడుద్దాం…

డాక్టర్‌ కత్తి పద్మారావు

-డాక్టర్‌ కత్తి పద్మారావు, సామాజిక తత్వవేత్త, వ్యవస్థాపక అధ్యక్షు, నవ్యాంధ్రపార్టీ, సెల్: 9849741695

Have something to add? Share it in the comments

Your email address will not be published.