మిస్టర్ మూవీ రివ్యూ

Mega Prince VarunTej latest movie Mister review by Sakalam

VarunTej Mister Movie review by Sakalam

సినిమా: మిస్టర్

నటులు: వరుణ్‌తేజ్, లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్, నాజర్

సంగీతం: మిక్కీ జె మేయర్

నిర్మాతలు: నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు

దర్శకుడు: శ్రీను వైట్ల

 

తనదైన కామెడీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన దర్శకుడు శ్రీను వైట్ల వరుసగా ఆగడు, బ్రూస్లీ వంటి ఫ్లాప్ సినిమాలతో తన రేంజ్ తగ్గించుకున్నాడు. అయితే మళ్ళీ కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి చేసిన సినిమా మిస్టర్. కంచె సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌తేజ్ లోఫర్ సినిమాతో దెబ్బతిని హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో వచ్చిన ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈరోజు విడుదలైన మిస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా శ్రీనువైట్ల తెరకెక్కించాడా??? లేక ఆగడు, బ్రూస్లీలకు సీక్వెన్స్‌ తీశాడా?? వరుణ్‌తేజ్‌ కెరీర్ గ్రాఫ్ ఈ సినిమాతో ఏమైనా పెరుగుతుందా?? అసలు మిస్టర్ కథేంటి??

కథ:

శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యం ఉన్న స్థానంలో ప్రస్తుతం ఆంధ్రా కర్ణాటక సరిహద్దులోని ఓ గ్రామంలో పిచ్చయ్య నాయుడు(నాజర్) గుండప్ప నాయుడు(తనికెళ్ళ భరణి)కి దాదాపు నలభైఏళ్లుగా పగ ప్రతీకారాలు ఉంటాయి. అయితే పదేళ్ళకొకసారి ఊళ్ళో జరిగే కర్రెసాము పోటీల్లో గెలిచినవారికే ఊళ్ళో అధికారం అనే సంప్రదాయాన్ని పిచ్చయ్య నాయుడు కొనసాగిస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి గొడవలకు దూరంగా పిచ్చయ్య అల్లుడు స్పెయిన్‌లో పెద్ద వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. అతని కొడుకు చై (వరుణ్‌తేజ్) జాలీగా ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి చైకి ఒకరోజు ఎయిర్‌పోర్టులో ఒకరిని పికప్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ మీరా( హెబ్బా పటేల్)ను చూసి లవ్‌లో పడిపోయి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు.

అయితే తను తీసుకొచ్చింది వేరే అమ్మాయినని తెలుసుకున్న తర్వాత చై మీరా అక్కడ ఉన్న నాలుగు రోజుల్లో ఫుల్ ఎంజయ్ చేస్తాడు. మీరా ఇండియాకి తిరిగి వచ్చేముందు తన లవ్ విషయం చైకి చెప్తుంది. అయితే చై మాత్రం మీరాపై తనకున్న ప్రేమను చెప్పకుండా ఉండిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఇండియా నుండి చైకి ఫోన్ చేసిన మీరా తను ప్రేమించిన సిద్ధార్థ్‌తో పెళ్ళి జరగకుండా ఆగిపోయిందని చెప్పి తనకు సహాయం చేయమని అడుగుతుంది. తను ప్రేమించిన అమ్మాయి బాధపడుతుంటే చూడలేని చై వెంటనే ఇండియాకి వస్తాడు. అయితే ఇండియాలో ఉండే తనకు ఏమాత్రం ఇష్టంలేని తాత పిచ్చయ్యనాయుడిని కలిసి రమ్మని తండ్రి చెప్పడంతో ఇష్టంలేకున్నా ఓకె అని చెప్తాడు.

ఇండియాకి వచ్చిన తర్వాత నేరుగా సిద్ధార్థను కలుసుకున్న చై అసలు విషయాన్ని తెలుసుకొని మీరాను సిద్ధార్థ్‌ను కలపడానికి సిద్ధమౌతాడు. ఈ సమయంలో అనుకోని పరిస్థితుల్లో బస్సులో ప్రయాణిస్తున్న చైకి చంద్రముఖి ( లావణ్యా త్రిపాఠి) పరిచయమై అతనితోపాటే వెళ్తుంది. ఇలా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతున్న సమయంలో మీరా కోసం ఆమె అన్న మనుషులను పంపిస్తాడు. మరోవైపు చంద్రముఖిని వెతుక్కుంటూ వచ్చిన జనాలు చై ని కొట్టి చంద్రముఖిని తీసుకెళ్తారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో చై ఏం చేస్తాడు?? తనను ప్రేమిస్తున్న చంద్రముఖిని పెళ్ళిచేసుకుంటాడా లేక తను ప్రేమించే మీరాను పెళ్ళిచేసుకుంటాడా అన్నదే సస్పెన్స్. అంతేగాక తన తాత పిచ్చయ్యనాయుడిని చై కలుస్తాడా?? అన్నదే కథ.

 

ఎనాలసిస్:

సాధారణంగా ఓ స్థాయికి వచ్చిన తర్వాత సక్సెస్‌ల స్థానంలో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్‌లు వచ్చేసరికి మామూలుగానే చాలా కసిమీద ఉంటారు జనాలు. ఆ తర్వాత తను చేసే పని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ అడుగులేస్తారు. అయితే ఒక్కొక్కసారి అలా అతి జాగ్రత్తతో వేసే అడుగులు తడబడి అప్పటివరకు ఉన్న పేరుని కూడా క్రిందపడేసే పరిస్థితి ఎదురౌతుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితిలో ఉన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. కెరీర్ ప్రారంభం నుండి కామెడీతో అందరినీ నవ్వించిన శ్రీనుకి స్టార్ హీరోలతో ఆగడు, బ్రూస్ లీ లాంటి రెండు భారీ డిజాస్టర్లు రావడంతో తన తర్వాత ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని బొక్కబోర్లాపడ్డారని అర్థమౌతోంది మిస్టర్ సినిమా చూస్తే.

అసలు ఈ మిస్టర్ ప్రాజెక్టును సన్నాఫ్ సత్యమూర్తి సినిమా సమయంలో అల్లు అర్జున్‌ దగ్గరికి వెళ్తే కథ విని నో చెప్పాడు. అయితే ఆ తర్వాత లోఫర్ నేర్పిన గుణపాఠంతో మంచి ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్న వరుణ్‌తేజ్ చేతికి వచ్చింది. అయితే ఈ సినిమా వరుణ్‌తేజ్ రేంజ్‌ను ఏమాత్రం పెంచలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు వరుణ్ చేసిన మూడు సినిమాలకంటే ఈ సినిమా  చాలా భిన్నంగా ఉంటుందని ఊదరకొట్టిన వైట్ల బ్యాచ్ నిజంగానే అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసే విధంగా చాలా బోరింగ్‌గా తెరకెక్కించాడు.

ఫస్టాఫ్ ఓమాదిరిగా బాగుందనే ఫీలింగ్ వచ్చినప్పటికీ సెకండాఫ్‌తో జనాల్లో సహనాన్ని పరీక్షించాడు. పగలు, ప్రతీకారాలు, ప్తోరేమ కోసం చేసే ఛేజింగ్ సీన్లు, హీరో ఎంతమంది రౌడీలు వచ్చిన కొట్టి హీరోయిన్లను రక్షించుకోవడంవంటి కాన్సెప్ట్ తో పుట్టగొడుగుల్లాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. ఫస్టాఫ్‌లో సినిమా ఫారిన్ లొకేషన్స్‌లో తీయడం వల్ల చాలా రిచ్‌గా చూపించినప్పటికీ , ట్రైలర్‌లు చూసి ఏదో కొత్తగా ట్రై చేసి ఉంటాడని ఫీలయ్యే ప్రేక్షకులకు సెకండాఫ్ తో దారుణంగా దెబ్బేశాడు శ్రీను వైట్ల.

అసలు మిస్టర్ సినిమా నుండి నా ట్రెండ్ ఫుల్‌గా మార్చేశాను, ఎవరిపైనా బకరా కామెడీలు చేయను, స్ఫూఫ్‌లు ఏమాత్రంలేవని చెప్పుకొచ్చిన శ్రీనువైట్ల మాటపై నిలబడేరకంకాదని నిరూపించాడు. కథకు ఏమాత్రం సంబంధంలేని ఊపిరి సీక్వెన్స్, శ్రీమంతుడు బకరా కామెడీ వంటివి చేయడంకాకుండా శ్రీక‌ృష్ణదేవరాయల కాలంనాటి సాంప్రదాయాన్ని పాటించే కుటుంబంగా లావణ్యా త్రిపాఠి ఫ్యామిలీని చూపించి హీరోని బలిఇచ్చే సీక్వెన్స్ మరీ రోత తెప్పించాయి.

దీనికోసం అసలు సెట్ ఎందుకు వేశారో… ఈ సీక్వెన్స్ సినిమాకి ప్లస్ అవుతుందని ఎలా అనుకున్నారో అర్థంకావట్లేదనేది సగటు ప్రేక్షకుడి ప్రశ్న. ఆ సీక్వెన్స్ మొత్తం సినిమాలో ఉన్న కథను డీవియేట్ చెయ్యడానికి తప్ప కథా బలాన్ని పెంచేవిధంగా ఏమాత్రం లేదనేది శ్రీనువైట్ల కూడా ఒప్పుకోవాల్సిన విషయం. అయితే సినిమాలో కాస్త నవ్వించే సీన్లలో ఫస్టాఫ్‌లో వచ్చే రఘుబాబు కామెడీ, సెకండాఫ్‌లో వచ్చే పృథ్వీ కామెడీలు ఉంటాయి. ఇవి ఓ మాదిరిగా ట్రాక్ తప్పుతున్న సినిమాని కాస్త ఆపాయి.

 

ఇక సినిమాకు నిజంగా ప్లస్ అనుకొనే అంశాల్లో ముందుగా ఉండేవి ఫారిన్ లొకేషన్స్‌, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ. అయితే సెకండాఫ్‌లో సినిమాలో జీవంతీసుకురాకపోవడంతోపాటు హీరో మీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ సరిగ్గా రన్ చేయలేకపోవడం సినిమాకు పెద్ద మైనస్.

నటనపరంగా చూస్తే ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌లో ఉన్న ఆర్టిస్ట్‌కు మార్కులు వేసుకోవచ్చు. ఎందుకంటే సీన్‌కు తగ్గట్లుగా నటించడంతోపాటు ఇంతకుముందు చేసిన సినిమాలకంటే చాలా అందంగా కనిపించాడు. స్టైలింగ్ విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నట్లుగా అనిపించింది. డాన్సులు చూడడానికి ఓకె  అనిపించినప్పటికీ ఫైట్స్‌లో ఎమోషన్స్ క్యారీ అయ్యేలా చాలా జాగ్రత్తపడ్డాడు. హీరోయన్లలో లావణ్య త్రిపాఠి ఇంతకుముందు సినిమాలకంటే గ్లామర్ డోస్ పెంచడంతోపాటు కొన్ని సీన్లలో ఆకట్టుకుంది. అయితే ఫారిన్ లొకేషన్స్‌లో కథ జరుగుతున్నప్పుడు కనిపించిన హెబ్బా చూడడానికి ఆకట్టుకున్నప్పటికీ ఇండియన్ లొకేషన్స్‌లో డీగ్లామర్ క్యారెక్టర్‌లాగా అనిపించింది.

మొత్తానికి శ్రీనువైట్ల కామెడీతో మాస్‌ను ఆకట్టుకోవడం అనే విషయాన్ని పక్కన పెడితే ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా విసుగుపుట్టేంతగా ఓవర్ ఎమోషన్లతో కథను నింపేయటంతో సినిమా బిస్కెట్ అయ్యింది. సినిమా లెంగ్త్ కూడా ఎక్కువగా ఉండడం కూడా సినిమాకి దెబ్బకొట్టింది.

 

ఓవరాల్: శ్రీను వైట్ల ఏం మారలేదు: మిస్టర్ అనుకుంటే డస్టర్ చూపించాడు

 

రేటింగ్: 2 / 5

 

-శరత్‌చంద్ర

 

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.