ఇదేం ‘కొత్తప్రేమ’ కేసీఆర్ సారూ??

Mirchi-Politics-as-mirchi-farmers-suffer-kcr-prefers-to-visit-new-love-vemuri-radhakrishna

Mirchi-Politics-as-mirchi-farmers-suffer-kcr-prefers-to-visit-new-love-vemuri-radhakrishna

వేమూరి రాధాకృష్ణ… రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరూ మరిచిపోలేని పేరు అది. తెలుగు రాష్ట్రాల్లో పేరున్న టాప్ న్యూస్ పేపర్స్‌లో ఆయనకు సంబంధించిన ఆంధ్రజ్యోతి కూడా ఒకటి. అందులోనూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ వార్తతో జనాల్లో తన ఇమేజ్‌ను పెంచుకుంటూ ముందుకెళ్తున్న రాధాకృష్ణ నైజం చాలామంది నాయకులకు నచ్చదు. అందులోనూ తెలంగాణాలో ఉన్న నాయకులు ఎవరికీ ఆంధ్రజ్యోతి కానీ, ఎబిఎన్ న్యూస్ ఛానల్ కానీ, రాధాక‌ృష్ణ పేరు కానీ అస్సలు నచ్చదు.ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వ్యతిరేక వార్తాకథనాలు రాస్తూ వచ్చిన ఆంధ్రజ్యోతి దినపత్రికపై తెలంగాణావాదులు మండిపడుతూనే ఉన్నారు.

అందుకే  ఆ మధ్య తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీని అగౌరవపరిచారనే కారణంతో రాధాక‌ష్ణ ఎబిఎన్ న్యూస్ ఛానల్‌ను , టివి9ను తెలంగాణాలో ప్రసారంకాకుండా దాదాపు సంవత్సరానికి పైగా బ్యాన్ చేశారు. మధ్యలో కొంతమంది జర్నలిస్టు సంఘం నాయకులు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపినప్పుడు టివి9పై నిషేదాన్ని ఎత్తేయాలనుకున్నప్పటికీ ఎబిఎన్‌పైన కూడా నిషేదం ఎత్తేయాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో చాలారోజులు నాన్చి నిషేదాన్ని కొనసాగించారు. ఆ నిషేదం కొనసాగినప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్‌లో తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కథనాలు సైతం వచ్చాయి. అందుకే తెలంగాణాలో అధికారపార్టీకి చెందిన ఏ నాయకుడికి కూడా రాధాక‌ృష్ణ , ఆంధ్రజ్యోతి పత్రికలపై మండిపడుతూనే ఉన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తీవ్రంగా వ్యతిరేకించినవారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గరవుతున్నారు. మొదట్లో కెసిఆర్‌పై యుద్ధం ప్రకటించినట్లు అనిపించిన ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ క్రమంగా కెసిఆర్‌కు దగ్గరయ్యారు. ఆయన పత్రికా కార్యాలయానికి హైదరాబాదులో కెసిఆర్ స్థలం కూడా కేటాయించారు. అంతేగాక గతంలో జరిగిన విషయాలను కెసిఆర్ అన్నీ మరిచిపోయి ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని సందర్శించడం తెలంగాణాలో చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. నాలుగురోజు క్రితం ఆంధ్రజ్యోతి కార్యాలయంలోని అగ్నికి ఆహుతి అయిన  రెండు, మూడు అంతస్థులను కేసీఆర్ పరిశీలించారు. కెసిఆర్ వెంట మంత్రులు హరీష్ రావు, పద్మారావు, తలసాని శ్రీనివాస యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు. అంతేగాక ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై కేసీఆర్ రావడానికి ముందే ఆరా తీశారు. ప్రమాదంపై ఆరా తీయడానికి కేసీఆర్ వేమూరి రాధాకృష్ణకు నిన్న ఫోన్‌ చేశారు. అయితే తన రాష్ట్రంలో జరిగిన సంఘటనకు ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రతిస్పందించడం తప్పేమీ కాదు. ఫోన్‌లో ఆరా తీసిన తర్వాత స్వయంగా వచ్చి సందర్శించాల్సిన అవసరం ఉందా అనే కొత్త సందేమాలకు కేసీఆర్ తెరలేపారు.

గతంలో తెలంగాణా ఉద్యమసమయంలో ఈనాడు పత్రిక తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ మండిపడ్డారు. అలాంటిది రాష్ట్ర ఏర్పాటు తర్వాత రామోజీరావుతో కేసీఆర్ చెట్టాపట్టాలేసుకొని తిరిగి అందరినీ విస్మయానికి గురిచేశారు. అదే ఇప్పుడు తెలంగాణాకు వ్యతిరేకమని ముద్రపడ్డ రాధాకృష్ణను దగ్గరికి తీసుకోవడం వెనుక మతలబు ఏంటో అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆంద్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం అయిన తర్వాత రాధాకృష్ణను పరామర్శించడానికి వచ్చిన నాయకుల్లో ఎంతమంది పేదల గుడిసెలు కాలిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకు బాసటగా నిలబడుతారన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఒక పత్రికా కార్యాలయం తగలబడితే ఏదో రాష్ట్రం మునిగిపోయినట్లు రాధాక‌ృష్ణకు ఓదార్పు యాత్ర చేస్తున్న అధికారపార్టీ పెద్దలు కాస్త సమయాన్నైనా మిర్చి రైతుల మనోవేదనను పట్టించుకోవడానికి ఇస్తే అన్నదాతే మార్కెట్‌యార్డులపై దాడులు చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది. మీడియాను తనకు అనుకూలంగా ఉంచుకోవాలనుకోవడం తప్పు కాదు కానీ మండుతున్న ఎండల్లో మిర్చి ఘాటుకి అల్లాడుతున్న అన్నదాతను కనీసం పట్టించుకోకుండా కేసులు పెట్టించడాన్ని యావత్ తెలంగాణా రాష్ట్రం తప్పుపడ్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.