రైతులకు బేడీలు: బంగారు తెలంగాణా అంటే ఇదేనా??

Mirchi Politics: Police humilated Farmers in Khammam District by Handcuffs

Mirchi Politics: Police humilated Farmers in Khammam District by Handcuffs

  • ఖమ్మం రైతులపై పోలీసుల అమానుషం
  • రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు
  • నిబంధనలు పాటించని పోలీసులు
  • మార్కెట్ యార్డు దాడి ఘటనలో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం

 

పగలనక రాత్రనక కష్టపడి క్రాప్‌ లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగి డబ్బులు దొరక్క చివరికి కట్టుకున్నదాని పుస్తెలతాడుని సైతం తాకట్టుపెట్టి పంట పండించిన రైతన్నలకు కష్టకాలం దాపురించింది. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని తెలంగాణా సర్కార్ బహిరంగ సభల్లో గొంతుచించుకొని మైకుల్లో చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం పరిస్థితి వేరే రకంగా ఉంది.

ఈ యేడాది మిర్చి పంటకు నిజంగానే చీడ పట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే అదేదో పంటను తినే చీడ కాకుండా రైతన్నకు పట్టిన చీడ. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి మద్దతు ధరలేక అల్లల్లాడుతూ పంట అమ్ముకుందామంటే పరిస్థితి బాగాలేక చేతిలో డబ్బుల్లేక ఇంట్లో తినడానికి తిండిలేక పస్తులున్న భార్యాబిడ్డల ఆక్రోదన క్షణ క్షణం గుర్తుకొచ్చి చేసేదేమీలేక తప్పనిపరిస్థితుల్లో తమ నిస్సహాయతను, ఆక్రోశాన్ని మార్కెట్ యార్డు కార్యాలయంపై చూపించిన పాపానికి ఇప్పుడు అన్నం పెట్టిన కర్షకుడిపైనే కేసులు పెట్టి చేతులకు బేడీలు వేసి గొలుసులతో కట్టి రైతులను ఎంత బాగా చూసుకుంటున్నామో చూడండి అని తెలంగాణా ప్రజలకు చూపిస్తోంది మన రైతు సంక్షేమ ప్రభుత్వం.

రైతులు ఎలాంటి పరిస్థితుల్లో దాడి చేసినప్పటికీ దాడి చేయడం సరైన పద్ధతి కాదు కాబట్టే కేసులు పెట్టామని సమర్థించుకున్న ప్రభుత్వం, ఖమ్మంలో ఈ రోజు జరిగిన సంఘటన విషయంలో ఎలాంటి వివరణ ఇస్తుంది. మార్కెట్ యార్డుపై దాడి కేసులో అరెస్టు చేసిన రైతులను విచారణ కోసం కోర్టుకు హాజరుపరచడాన్ని ఎవరూ తప్పుబట్టరు. ఎందుకంటే అది రెగ్యులర్‌గా జరిగే ప్రొసీజర్ కాబట్టి. అయితే పోలీసులు చేసిన ఓవరాక్షన్ తలుచుకుంటుంటేనే కేవలం రైతులకే కాదు ప్రతీ ఒక్కరికి కోపం రావడమే కాదు బంగారు తెలంగాణా అంటే ఇదేనా అనేలా రక్తం మరిగిపోతోంది.

రైతుల సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పే ప్రభుత్వం పోలీసులు ఓవరాక్షన్‌ను ఎలా సమర్థించుకుంటుంది. ఏం సమాధానం ఇస్తుంది. అరెస్టు చేసిన రైతులను కోర్టు తీసుకొచ్చే నెపంతో చేతులకు బేడీలు, గొలుసులు వేసి ఎంత హేయనీయ పరిస్థితుల్లో తీసుకొచ్చారు. సాధారణంగా కోర్టులకు ఎవరైనా దోషులను తీసుకొచ్చేటప్పుడు పోలీస్ పహారాలో తీసుకురావడం ఆనవాయితీ.

ఎవరైనా పారిపోతారనే భయం ఎక్కువ ఉండి వాళ్ళు మరీ సంఘ విద్రోహక శక్తులైతేనే బేడీలు వేసి తీసుకొస్తుంటారు. అయితే ఈమధ్య పెద్ద పెద్ద కేసుల్లో దోషులుగా ఉన్న ఉగ్రవాదులను సైతం కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు కూడా చేతులకు బేడీలు గొలుసులు వేసిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో ఖమ్మం మిర్చి రైతులు పోలీసుల కళ్ళకు ఏరకంగా కనిపిస్తున్నారు.

అయితే మార్కెట్ యార్డుపై దాడి ఘటనలో పోలీసుల ఓవరాక్షన్‌పై సర్వత్రా నిరసనలు వ్యక్తమౌతున్నాయి. వాళ్ళేమైనా దోపిడీ దొంగాలా లేక ఎంతోమంది ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులా… ప్రభుత్వ పెద్దలు, పోలీసు బాసుల దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ఖమ్మం పోలీసులు మరీ ఇంతలా దిగజారాలా అని జనాలు తిట్టుకుంటున్నారు.

అంతేగాక బంగారు తెలంగాణా సాదిద్ధామనే సంకల్పంతో ముందుకెళ్తున్న తెలంగాణా ప్రభుత్వం వ్యవహార శైలి ఈమధ్య చర్చనీయాంశంగా మారుతోంది. ప్రజలకు అన్నంపెట్టే రైతన్నలను పట్టించుకుంటున్నామని చెప్పుకొస్తున్న ప్రభుత్వం తమ ఆక్రోశాన్ని బయటపెట్టిన రైతులతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యను పరిష్కరించడం మానేసి దోపిడి దొంగలతో వ్యవహరించినట్లు వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన బంగారు తెలంగాణా అంటే ఇదేనా అనేలా పరిస్థితి తయారైంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.