పాలు కూరగాయలు అమ్ముకుంటున్న తమపై దుష్ప్రచారం చేస్తున్నారు: లోకేష్

పద్దతి ప్రకారం రాజకీయాలు చేస్తూ పాలు కూరగాయలు అమ్ముకొని జీవిస్తున్న తమపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఎంఎల్సీ పదవికి నామినేషన వేసిన సందర్భంగా ప్రకటించిన ఆస్తులపై, మీడియాలో జరిగిన ప్రచారంపై గురువారం లోకేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ హెరిటేజ్ కంపెనీ షేర్ల విలువ పెరగాడానికి 25 ఏళ్లు పడితే జగన్ కంపెనీ షేర్లు ఉత్పత్తి ప్రారంభం కాకుండానే కేవలం 12 నెలల్లోనే పెరిగాయన్నారు.

లోకేష్ మాట్లాడుతూ ‘ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా హెరిటేజ్ షేర్ల ధర పెరుగుతూ వచ్చింది. షేర్ల ధర అనేది మార్కెట్ ప్రకారం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఈ హెచ్చు తగ్గులు ఉండడం వల్లే ఎప్పుడూ మార్కట్ ధరను ప్రకటించలేదు. ఏ ధరకైతే మేము కొన్నామో ఆ ధరనే ప్రకటించాము. తనకు 23 లక్షల షేర్లు ఉన్నట్లు` ప్రకటించారు.

‘మా బాధ ఏమిటంటే ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానం చేయాలనే ఆలోచనతోనే శాసనసభలో అడుపెడదామనుకున్నాను. కావాలనే నాపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. మేము హెరిటేజ్ షేర్ ధర 10 రూపాయలకు కొన్నాము. అది ఇప్పుడు 2200 రూపాయలు 2013లో వచ్చిన బోనస్ తో కలుపుకొని పెరిగింది. 10 రూపాయలకు కొన్న హెరిటేజ్ షేర్ 2200 రూపాయలు రావడానికి సుమారు 25 సంవత్సరాలు పట్టింది. కానీ జగన్ మోహన్ రెడ్డి కంపెనీలో 12 నెలలో, ఉత్పత్తి ప్రారంభం కాకుండానే 10 రూపాయల షేరును 1400 రూపాయలకు అమ్ముకున్నారని` లోకేష్ ఎద్దేవా చేశారు.

’20 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడుపైన దాదాపు 40 కేసులు వేశారు. కానీ ఒక్క కేసు నిరూపించలేకపోయారు. అంటే మీరు అసమర్ధులా, లేదా చంద్రబాబు నాయుడు ఏ తప్పుచేయలేదని దానిపైనా కూడా వివరణ ఇవ్వాల్సి ఉందని` లోకేష్ డిమాండ్ చేశారు. ఒక పద్ధతి ప్రకారమే మేము వ్యాపారం చేస్తున్నాం. గత 6 సంవత్సరాల నుండి మేము ఆస్తులను ప్రకటిస్తున్నాం. శాసనసభకు కూడా మూడు సంవత్సరాలు పాటు ఆస్తుల జాబితా ఇచ్చిన ఏకైక కుటుంబం మాదని లోకేష్ పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షనేత జగన్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారే మాత్రమే తన ఆస్తుల జాబితాను ప్రకటించారన్నారు. నీతి, నియమాలతో ఉన్న మా కుటుంబాన్ని విమర్శించాడానికి ఎవరి హక్కు లేదని ఆయన పేర్కొన్నారు.  ఇప్పటికైన జగన్ తన ఆస్తులు ప్రతి సంవత్సరం ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.