నంద్యాల అభ్యర్ధిపై లోకేష్ సమాలోచన

నంద్యాల: ఆదివారం ఉదయం మృతి చెందిన నంద్యాల ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డికి అంత్యక్రియలు జరగకుండానే రాబోయే ఉపఎన్నికల్లో టిక్కెట్‌ను ఎవరికి కేటాయించాలన్న అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ నేతలతో మంతనాలు జరిపారని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఈ వార్త ఒక్కసారిగా గుప్పుమంది.

భూమా నాగిరెడ్డి ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం అందరికి తెల్సిందే. ఆదివారం ఆళ్లగడ్డకు చేరుకున్న లోకేష్ భూమా భౌతిక కాయానికి నివాళులు అర్పించి, ఆయన కుమార్తెలు ఎంఎల్ఏ అఖిల ప్రియ, మౌనికా రెడ్డి, కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలను ఓదార్చారు. అనంతరం జిల్లా నేతలను వెంటబెట్టుకుని నంద్యాలకు వెళ్లిన లోకేష్, భూమా నాగిరెడ్డి స్థానంలో నంద్యాల టిక్కెట్ ను ఎవరికి ఇచ్చి పోటీ చేయిద్దామంటూ ఆరా తీసినట్టు తెలుస్తోంది.

భూమా మృతితో ఆరు నెలల లోపుగా నంద్యాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈలోపు గానే లోకేష్, సోమవారం నంద్యాలలోని ఓ హోటల్‌లో కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో సమావేశమైనట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ఎమ్మెల్యేలతో పాటు జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు హాజరైనట్టు వినికిడి.

మరోవైపు నంద్యాల స్థానాన్ని భూమా మరో కుమార్తె నాగమౌనికా రెడ్డికి కానీ లేదా ఆయన అన్న కుమారుడు బ్రహ్మానంద రెడ్డికి గానీ కేటాయించాలని కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారట. మరికొందరు మాత్రం నంద్యాల ఎమ్మెల్యే స్థానాన్ని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి కేటాయించి, భూమా కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తే సరిపోతుందని సలహా ఇచ్చారట.

సోమవారం మధ్యాహ్నం భూమా నాగిరెడ్డి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇతర టీడీపీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.