నిర్భయ కేసు: దోషులకు ఉరిశిక్ష ఖరారు

nirbhaya-rapists-to-hang-as-supreme-court-upholds-death-sentence-and-crime-of-a-different-world-says-supreme-court-judges

nirbhaya-rapists-to-hang-as-supreme-court-upholds-death-sentence-and-crime-of-a-different-world-says-supreme-court-judges

ఎన్ని కోర్టు గడపలు తొక్కినా నిర్భయ అత్యాచారంకేసులో దోషులకు ఉరిశిక్షే ఖరారైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో 2013లోనే ప్రత్యేక కోర్టు ఈ నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పగా, ఆ తీర్పును హైకోర్టు కూడా 2014లోనే ఖరారు చేసింది. అయితే, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్.. ఈ నలుగురు నిందితులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడంతో తుది తీర్పు వెలువడేందుకు ఇన్నాళ్ల సమయం పట్టింది.

మొత్తానికి సుప్రీంకోర్టు శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది. నిర్భయ మరణ వాం‍గ్ములాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఘటనను నేరపూరిత కుట్రగా ధ్రువీకరించింది. సీసీ టీవీ పుటేజ్‌ను సరైన సాక్ష్యంగా సుప్రీంకోర్టు పరిగణించింది. దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ, హైకోర్టు తీర్పును న్యాయస్థానం సమర్థిస్తూ దోషులుగా ఖరారు చేసి ఉరిశిక్ష విధించింది.

దేశ రాజధాని ఢిల్లీలో పాశవికంగా అత్యాచారం చేసిన దోషులు ఎట్టకేలకు ఉరికంబం ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ బస్సులో ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. దీనిపై కూడా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగడంతో ఆ కేసు ఎఫెక్ట్‌కి బాలనేరస్తుల చట్టాన్ని సైతం సవరించారు.

మొత్తానికి నిర్భయ విషయంలో జరిగిన పాశవిక ఘటన మరెవరికి జరగకుండా ఉండేలా దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలుచేస్తే బాగుండేదని అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వ్యక్తమౌతున్నాయి. నిర్భయ కేసు అరుదైనదని, ఈ ఘటన సునామీలాంటి షాక్‌‌‌కు గురి చేసిందని, ఇది అత్యంత క్రూరమైన నేరమంటూ, దోషులకు ఉరిశిక్షే సరి అని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఒకే తీర్పును చదువుతుండగా కోర్టు హాల్‌ చప్పట్లతో మారుమోగింది.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తీర్పు వెలువడిన తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడారు. ఎట్టకేలకు మాకు న్యాయం జరిగిందని మే 10న మా బిడ్డ జ్యోతి పుట్టిన రోజు. ఆమె బతికిఉంటే 29వ ఏట అడుగుపెట్టి ఉండేదని నాలుగున్నరేళ్ళుగా న్యాయం కోసం నరకయాతన పడుతున్న ఆశాదేవి అన్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.