గుజరాతీ సాహిత్యవేత్తకు ఎన్.టి.ఆర్. జాతీయ పురస్కారం

ప్రముఖ భారతీయ సాహిత్యవేత్త, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత, గుజరాతీ, హిందీ భాషాకోవిదుడు రఘువీర్ చౌదరి ఈ సంవత్సరం ఎన్.టి.ఆర్. జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 28న ఎన్.టి.ఆర్. జయంతి రోజున హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ పురస్కారం ప్రదానం చేస్తామని ట్రస్ట్ వ్యవస్థాపకురాలు నందమూరి లక్ష్మీపార్వతి  తెలిపారు.  పురస్కారం క్రిందజ్ఞాపిక, శాలువతో పాటు లక్ష రూపాయల నగదు కూడా అందజేస్తామని ఆమె అన్నారు.

2006న ‘ఎన్.టి.ఆర్ విజ్ఞాన్ ట్రస్ట్’ ను నెలకొల్పారు. 2007 నుంచి ప్రతి ఏటా లబ్ద ప్రతిష్టులైన సాహితీవేత్తలకు ఈ సాహిత్య పురస్కారాన్ని ఈ ట్రస్ట్ అందజేస్తోంది. ఈ పురస్కారం పొందిన వారిలో  భైరప్ప, సచ్చిదానందన్, ఆవంత్స సోమసుందర్, సి. నారాయణరెడ్డి, మహాశ్వేతాదేవి, అశోక్ మిత్రన్, కాళీపట్నం రామారావు మొదలైన దిగ్గజాలు ఉన్నారు. కన్నడం, మలయాళం, తెలుగు, తమిళం, బెంగాలీ, ఒరియా, మరాఠీ, ఉర్దూ భాషా సాహిత్యవేత్తలు ఇప్పటివరకు ఈ గౌరవాన్ని పొందారు.

ఈ సంవత్సరం మొదటిసారిగా గుజరాతీ సాహిత్యవేత్త రఘువీర్ చౌదరి ఎన్.టి.ఆర్. జాతీయ పురస్కారం పొందనున్నారు. చౌదరి హిందీ, గుజరాతీ భాషల్లో  నవలలు, కథలు, వ్యాసాలు, కవితలు పుంఖానుపుంఖాలుగా రాశారు. గుజరాతీ విశ్వ విద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేశారు. కవిగా, రచయితగా, సాహిత్య  విమర్శకులుగా పేరెన్నికగన్నారు. 1977లో సాహిత్య అకాడెమీ, 2015లో జ్ఞానపీఠ్ పురస్కారాలు పొందారు. ప్రముఖ పత్రికల్లో ‘కాలమిస్ట్’ గా పనిచేశారు. రఘువీర్ చౌదరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా కూడా కొంతకాలం ఉన్నారు.

లక్ష్మీపార్వతి వ్యవస్థాపకురాలిగా, కె.వి. రమణాచారి వైస్ చైర్మన్ గా ఉన్న ఈ ట్రస్ట్ లో మృణాళిని, ఓల్గా, ఆచార్య మాణిక్యాంబలు అవార్డ్ ఎంపిక కమిటీ సభ్యులుగా ఉన్నారు.

-మా శర్మ

Have something to add? Share it in the comments

Your email address will not be published.