జగన్‌కు ప్రభుత్వోద్యోగి ఓపెన్ లెటర్

open-letter-to-ys-jagan-mohan-reddy-by-a-revenue-officer

open-letter-to-ys-jagan-mohan-reddy-by-a-revenue-officer

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదనతో జగన్ గారికి రాసిన బహిరంగలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ లెటర్ ఫేస్ బుక్, వాట్సప్ లలో వైరల్ అవటంతో జగన్ పార్టీ శ్రేణులకు ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మరోపక్క వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగసంఘాలు వైసీపీ నాయకుల ప్రవర్తనను మీడియాలో ఏకేస్తున్నారు. అసలా బహిరంగలేఖలో ఏముందో చూడండి…

శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
గౌరవ ప్రతిపక్షనాయకులు, ఆంధ్రప్రదేశ్

అయ్యా,
గత 3 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయదాడులు, వత్తిళ్లు పెరిగిపోయాయి. సహజంగా ఎక్కడైనా అధికారపార్టీ నుంచి అలాంటివి ఉంటాయి. చిత్రంగా ఇక్కడ ప్రతిపక్షం నుంచి ఇలాంటివి మేం ఫేస్ చేస్తున్నాము.

2017 జనవరి 25న విశాఖలో మీరు పోలీసు అధికారులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘సీఎంతో పెట్టుకుంటున్నావు. నీ సంగతి చూస్తాను. శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను. ఎవ్వరినీ వదలను. ప్రతి వాళ్లను గుర్తు పెట్టుకుంటాను’ అని ఆగ్రహంతో ఊగిపోతూ వేలు చూపిస్తూ భయపెట్టారు.

2017మార్చి3న దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం విషయంలో ప్రతిభావంతుడైన ఐఏఎస్ అధికారి, క్రిష్ణా జిల్లా కలెక్టర్ ఎ.బాబును తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పోలీసులు, వైద్యులు నుంచి కలెక్టర్‌ వరకూ అందరినీ సెంట్రల్‌ జైలుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతామని మీ కార్యకర్తలు, మీడియా సమక్షంలోనే బెదిరించారు.

గతేడాది ఇదే జూన్ మాసంలో కడప జిల్లా మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఎస్. రఘురామిరెడ్డి ‘‘వ్యవసాయ శాఖలో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఏ ఒక్క అధికారి కూడా నీతి నిజాయతీ ఎరుగరు. మీ కథ తేలుస్తా. చెప్పులతో కొట్టిస్తా. ఊళ్లోకి రానివ్వకుండా చేస్తా’’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ తర్వాత తనను సాగనంపేందుకు కారు దాకా వెళ్లిన ఓ అధికారిపై ఆయన ఏకంగా బూతు పురాణం వినిపించారు. ఇంక మీ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు ఆయనని ఎమ్మెల్యేగా ఎలా ఎన్నుకున్నారో అర్థం కాదు. ఆ మనిషికి ఎక్కడా సభ్యత, సంస్కారం అనే పదాలు గురించి తెలిసినట్టు లేదు.

2015 సెప్టెంబర్ 8న రాజమండ్రి ప్రెస్ మీట్లో చెవిరెడ్డి భాస్కరరెడ్డి వాచాలత్వం చూడండి.
‘అధికారపార్టీ అండతో న్యాయాన్ని విస్మరించి ప్రవర్తించే అధికారులపై పగపట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాం. అధికారులు పద్ధతి తప్పితే ఈ రోజు బాగానే ఉంటుంది కానీ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు. ఉద్యోగవిరమణ చేసిన తర్వాత కూడా పశ్చాత్తాప పడేలా చర్యలు ఉంటాయన్నారు.

2017 జూన్ 8న చిత్తూరు జిల్లాలో ఇదే చెవిరెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు ఇవి..
అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఉద్యోగి, అధికారినీ విడిచిపెట్టే సమస్యే లేదు. ప్రతి ఒక్కరిపైనా ప్రతీకారం తీర్చుకుంటాం. అధికారులను బట్టలూడదీసి కొట్టే పరిస్థితి వస్తుంది. అధికారులను ఎంతటి వారినైనా వదలిపెట్టం. అధికారులు, ఉద్యోగులను అండమాన్ పంపిస్తాం. వైసీపీతో ఎందుకు పెట్టుకున్నామా అని కుమిలిపోయేలా చేస్తాం. రిటైరైనా ఎవ్వడిని వదలం. వెంటాడుతాం జాగ్రత్త’ అని చూపుడు వేలు పైకెత్తి బహిరంగంగా బెదిరించారు.

ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, రోజా సహా పలువురు మీపార్టీ వారు పోలీసు, రెవిన్యూ, పంచాయతీరాజ్ సహా ప్రభుత్వ ఉద్యోగులపై చాలా సందర్భాల్లో ఇలాంటి బెదిరింపులకు దిగారు. లోగడ టీడీపీ నాయకులు చింతమనేని, కేశినేనినాని ఇలాంటి హెచ్చరికలే చేస్తే సాక్ష్యాత్ చీఫ్ మినిస్టర్ రంగంలోకి దిగారు. ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వారిని మందలించారు. క్షమాపణ చెప్పించారు. పైగా ప్రతి రివ్యూలో సీఎం తరచుగా తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగుల పట్ల కఠినంగా ఉన్నానని, అలా చేసినందుకు పశ్చాతపపడుతున్నాని ఎంతో గొప్ప సంస్కారాన్ని కనపరుస్తున్నారు.
కానీ మీరేం చేశారు? రేపు మీరు అధికారంలోకి వచ్చినా పనిచేయించుకోవాల్సింది ఈ ఉద్యోగులతోనే. ఏ ప్రభుత్వం ఉన్నా ఉద్యోగులు నిమిత్తమాత్రులు అనే అవగాహన కొరవడి మీరు మాపై ఉగ్రులవటం, మీ పరివారాన్ని ఉసిగొల్పడం మీకు మీడియాలో ప్రచారం తేవచ్చు. ఒకే తానులో ముక్కలు అన్నట్టు మీ పార్టీకి ప్రథమ పౌరుడైన మీనుంచి కింది వరకు అందరిదీ సేమ్ మ్యానుఫాక్చరింగ్. పొత పోసినట్టు పైనుంచి కింది వరకు అందరిదీ అదే పోకడ.

చీటికిమాటికీ సహనం కోల్పోయిన బాడీలాంగ్వేజ్ తో అది ప్రెస్ మీట్ అయినా, ప్రొటెస్ట్ అయినా, అసెంబ్లీ అయినా, ప్లీనరీ అయినా ప్రతిచోటా సీఎంతో సహా ప్రతి ఒక్కరిని బూతులు తిడతారు. మీరు ఎవరిని ఏం తిట్టుకుంటే మాకెందుకు? ప్రభుత్వాలు ఏవున్నా మా ధర్మం ఉద్యోగధర్మం. దానిని మేం నిర్వర్తిస్తాం. మమ్మల్ని చిన్నచూపు చూస్తే సహించం. ప్రజలకు ప్రభుత్వానికి మేం వారధులం. మమ్మల్ని కూల్చాలని చూస్తే మీరు ప్రజలను చేరుకోలేరు.

మీ నుంచి పరివర్తనను ఆశిస్తూ..
అంబటి సుబ్బారాయుడు
రెవిన్యూ ఉద్యోగి, తూ.గో జిల్లా

Have something to add? Share it in the comments

Your email address will not be published.