విశాఖ సాగరతీరంలో యువకెరటం ముంగిట ‘పవనిజం’ పరవళ్ళు

Pawanism

(వివేక్)

విశాఖపట్టణం, మార్చి 27: పవన్ కల్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ఆవిర్భవం సందర్భంగా  విశాఖపట్టణంలో తొలి బహిరంగ సభ బ్రహ్మాండంగా జరిగింది. కుర్రకారు వేల సంఖ్యలో వచ్చారు. కేరింతలు కొట్టారు. పవన్ కల్యాణ్ పవర డైలాగ్ లకు జేజేలు కొట్టారు. పరవశించిపోయారు.  హైదరాబాద్ మహానగరంలో జనసేన పార్టీ స్థాపించిన రోజు నవాటెల్ హోటల్ లో జరిపిన సభలో చేసిన ప్రసంగ పాఠాన్నే కొత్త పోపు పెట్టి విశాఖ సముద్రతీరంలో తాజాగా, సవిస్తరంగా వడ్డించారు. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికీ, రాహుల్ గాంధీని విమర్శించడానికీ, కేసీఆర్ కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలను వ్యంగ్యాత్మకంగా ఖండించడానికీ పవన్ కల్యాణ్ ప్రాధాన్యం ఇచ్చారు. తాతలు, తండ్రుల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. చాలా పవర్ ఫుల్ డైలాగ్ రైటర్ రాసిన డైలాగ్ లకు పవన్ కల్యాణ్ హావభావాలు జోడించి ప్రతిభావంతమైన డెలివరీతో రక్తికట్టించారు.

తాను ఎన్నికలలో పోటీ చేయడానికీ, నాలుగు సీట్లు సంపాదించడానికీ పార్టీ పెట్టలేదనీ, రాజకీయాలను ప్రక్షాళన చేయడానికే పార్టీ పెట్టాననీ స్పష్టం చేశారు. దేశసమగ్రతను పరిరక్షించేందుకే రాజకీయ పార్టీని నెలకొల్పానంటూ ఉద్ఘాటించారు. నిజాయితీ కలిగిన నాయకులు దొరికే వరకూ ఎన్నికలలో పోటీ చేయనంటూ ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా పని చేసే నాయకులు కావాలంటూ పిలుపునిచ్చారు.

జనసేన సిద్ధాంత గ్రంధం ‘ఇజం’

మాటకు మాట, దెబ్బకు దెబ్బ

జనసేన ‘ఇజం’ అనే పుస్తకాన్ని జాతికి అంకితం చేస్తున్నట్టు బహిరంగసభలో ప్రకటించారు. అవినీతినీ, అక్రమాలనూ ఎదిరించి పోరాడటానికి బలమైన సిద్ధాంతం కావాలనీ, అటువంటి సిద్ధాంతం తన పుస్తకం ‘ఇజం’లో ఉన్నదనీ ఆయన చెప్పారు. మొదటి ప్రసంగంలో ఉన్న పంచ్ విశాఖ ప్రసంగంలో కూడా కొట్టవచ్చినట్టు కనిపించింది. ఎవరో తయారు చేసిన ప్రసంగాన్ని పవన్ కల్యాణ్ చదువుతున్నాడనే విషయం స్పష్టంగా అర్థం అవుతున్నప్పటికీ యువజనులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అయినట్టు కనిపించారు.  ఒక చెంప కొడితే మరో చెంప చూపించమంటూ గాంధీ గారు చెప్పారు. ఒక చెంప కొడితే రెండు చెంపలూ పగలకొట్టాలన్నది జనసేన సిద్ధాంతం అంటూ పవన్ కల్యాణ్ గర్జించారు. కాంగ్రెస్ ను కనికరం లేకుండా మట్టికరిపించండి అంటూ పిలుపునిచ్చారు. పదికోట్ల మంది తెలుగువారు మాటకు మాట, దెబ్బకు దెబ్బ జనసేన సిద్ధాంతం అంటూ ప్రకటించారు.

కొన్ని సందర్భాలలో పవర్ స్టార్ పాత డైలాగ్ లే మళ్ళీ వినిపించారు. విభజనకు వ్యతిరేకం కాదు కానీ విభజన చేసిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నానంటూ పునరుద్ఘాటించారు. తన అన్నగారు మెగా స్టార్ చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు తమ్ముడు పవన్ ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్న ప్రజల మనస్సులలో కొట్టుమిట్టాడుతున్నదని తనకు తెలుసునని చెప్పారు. తెలంగాణ సమస్యతో, ఇతర సమస్యలతో రాష్ట్రం సతమతం అవుతున్నప్పుడు కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడాన్ని తాను విమర్శించలేదనీ, ఎదైనా మంచే జరుగుతుందనే నమ్మకంతో మౌనంగా ఉన్నాననీ చెప్పుకొచ్చారు.

వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమా?

కాంగ్రెస్ నేతలపై ధ్వజం

పవన్ కల్యాణ్ తప్పు చేసినా తల తీసివేసే చట్టం రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. బలమైన చట్టాలకోసం జనసేన పోరాడుతుందని చెప్పారు.  దేశక్షేమాన్ని కాంక్షించే నాయకులే దేశాన్ని పరిపాలించాలని కోరారు. పదవులు ఆశించి రాజకీయాలలోకి రాలేదనీ, కడుపు మండి రాజకీయాలలోకి వచ్చాననీ చెప్పారు. సిద్ధాంతాలు మార్చుకునే కాంగ్రెస్ సిద్ధాంతాలు మనకు వద్దు అంటూ ఉద్ఘాటించారు. దేశ సమగ్రతను కాంగ్రెస్ దెబ్బతీస్తున్నదంటూ ధ్వజమెత్తారు. ఇదంతా చెబుతూనే అన్నయ్యను తప్పుపట్టడం లేదంటూ ముక్తాయించారు. అన్నయ్యపైన తనకు ఎన్నడూ గౌరవం తగ్గదంటూ చెప్పారు.  జనసేన పార్టీ స్థాపన వెనుక ఎంతో వేదన ఉందన్నారు. లక్ష్యంవైపు దూసుకెళ్ళడమే తన సిద్ధాంతం అంటూ ప్రకటించారు. కొందరు రాజకీయవేత్తలు రాజకీయాల ముసుగులో వ్యాపారాలూ, కాంట్రాక్టులూ చేసుకుంటూ సిద్ధాంతాలు లేకుండా వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా పని చేశారు కాబట్టే రాష్ట్ర విభజనను నివారించలేకపోయారు. ఎంతసేపూ మీకు వ్యాపారాలే ముఖ్యమా, కాంట్రాక్టులే ముఖ్యమా అంటూ ఎండగట్టారు.

 

ఆవేదనతో, ఆగ్రహంతో పార్టీ పెట్టాను

 

ఒకప్పుడు ఆర్కే బీచ్ లో జాగింగ్ చేసేవాడిననీ, నటనలో ఓనమాలు నేర్పింది వైజాగేననీ పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆఖరి నిమిషంలో పార్టీ పెట్టాను. ఎందుకు? రాష్ట్రాన్ని విభజించడం ఒక్కటే కారణం కాదు. పెరుగుతున్న అవినీతి, అన్యాయం, అక్రమాలు, దగా, దోపిడీ తనను పార్టీ పెట్టడానికి ప్రోద్బలం చేశాయి. ఆవేశంతో, ఆగ్రహంతో, ఆవేదనతో పార్టీ పెట్టాను. తెలంగాణ ఇస్తామన్నారు. చూస్తామన్నారు. ఇచ్చేశామన్నారు. తెలుగుప్రజలను కొట్టుకోండని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీని వేశారు. సమాలోచనలు చేశామన్నారు. ఎందుకు చేశారు? మీకు రాజకీయ పరిజ్ఞానం లేదా? ఇంత అహంకారం ఎందుకు?  రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కూడా సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కానీ ఆంధ్ర ప్రాంతానికి వచ్చి గుండెకు గాయమైన సీమాంధ్ర ప్రజలకు వివరిస్తారని ఆశించాను. నిజంగా ప్రజలను పాలించే తల్లి సోనియా అయితే ఇట్లా చేసేవారు కాదు.

కాంగ్రెస్ పెద్దలు తెలుగువారిని బానిసలుగా చూస్తున్నారంటూ విమర్శించారు.

ఎవరిమీద నమ్మకం ఉంటే వారికి ఓట్లేయండి

ఫలానావారికి ‌ఓటేయమని పవన్ కల్యాణ్ ఎప్పుడూ అడగడు

ఎవరు కొత్త రాష్ట్రాన్ని బాగా నిర్మిస్తారని మీకు నమ్మకం కలిగితే వారికి ‌ఓట్లు వేయండని చెప్పారు. ఫలానావారికి ఓటు వేయాలంటూ అడగనని అన్నారు. పవన్ కల్యాణ్ ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నాడని కానీ ఒకరితో లాలూచీ పడ్డాడని కానీ మాట తన ప్రాణం పోయినా రానీయనని హామీ ఇచ్చారు. ఎవరు ప్రధాని అయినప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలకులు నీతినియమాలు తప్పినరోజున జనసేన విరుచుకుపడుతుంది. అంతవరకూ ఏమీ మాట్లాడను. జనసేన సిద్ధాంతాలకోసం ప్రాణం ఉన్నంత వరకూ పోరాడతాను. తెలుగుజాతిని కలిపి  ఉంచాలంటూ చివరి మాటగా చెప్పి జైహింద్ నినాదంతో ప్రసంగాన్ని ముగించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.