‘కాటమరాయుడు’ మూవీ రివ్యూ

Pawan Kalyan Katamarayudu Movie Review by Sakalam

Pawan Kalyan Katamarayudu Movie Review by Sakalam

సినిమా: కాటమరాయుడు
నటులు: పవన్‌ కల్యాణ్‌, శ్రుతిహాసన్‌, నాజర్‌, అలీ, రావు రమేష్‌
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మూరెళ్ల
నిర్మాత: శరత్‌ మరార్‌
దర్శకత్వం: డాలీ

 

పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఆయన మొదటి సినిమా నుండి ఇప్పటివరకు యూత్‌లో కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. బాక్సాఫీస్ రికార్డులకు కొత్త పంథా తీసుకొచ్చిన హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. తొలిప్రేమ నుండి సర్దార్ గబ్బర్ సింగ్ వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎత్తుపల్లాలను చూశాయి. ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తే మరో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

ఇలా పీకె చేసిన సినిమాల్లో అభిమానుల అంచనాలు ఎక్కువగా ఉండడంతో మార్కెట్‌లో రికార్డు స్థాయిలో బిజినెస్ కూడా అయిపోతోంది. అందుకే సర్దార్ గబ్బర్‌సింగ్ ఇచ్చిన చేదు అనుభవం నుండి బయటికి రావడానికి తమిళంలో హిట్ అయిన వీరం కథను మూలాంశంగా తీసుకొని గోపాల గోపాల సినిమాతో తన కెరీర్‌కి బూస్ట్ ఇచ్చిన డాలీకి అవకాశం ఇచ్చి కాటమరాయుడి అవతారం ఎత్తారు పీకె. అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా కదిరీ నరసింహుడా పాటతో అందరికీ దగ్గరైన కాటమరాయుడు పదాన్ని తన సినిమాకి టైటిల్‌గా మార్చుకొని సినిమా ప్రారంభం నుండే హైప్ క్రియేట్ చేసి రోజుకో రకమైన పబ్లిసిటీతో అభిమానులకు దగ్గరైన కాటమరాయుడు ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చేశాడు. అభిమానులు, ట్రేడ్ వర్గాలు పెంచుకున్న అంచనాలను పవన్ కళ్యాణ్ ఏమేరకు సంత‌‌ృప్తిపరచగలిగాడు? అసలు పవన్‌కు అంతగా నచ్చిన కాటమరాయుడులో కథ ఏంటి?

కథ:

రాయలసీమలోని తాళ్ళపాక ఊళ్ళో ఉండే కాటమరాయుడు(పవన్‌ కల్యాణ్‌)కి నలుగురు తమ్ముళ్లు (శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు). వాళ్లంటే రాయుడికి ప్రాణం. చిన్నప్పుడు అనాథలుగా ఉన్న ఆ నలుగురిని తన దగ్గరకి చేర్చి పెంచి పెద్ద చేసిన రాయుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంటాడు. ఆ ఊరికి పెద్దమనిషిగా కష్టాలు తీర్చమని వచ్చే పేదవాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకు అండగా తానున్నానంటూ ముందుకొచ్చి అండగా నిలబడుతాడు. అలా అందరికీ సహాయం చేసే కాటమరాయుడు తన ఇంటిపై ఆడనీడ కూడా పడకూడాదనే మనస్తత్వంతో ఉంటాడు.

అయితే అన్నకు తెలియకుండా ముగ్గురు తమ్ముళ్ళు, రాయుడి లాయర్ ఫ్రెండ్ లింగ (అలీ)లు అమ్మాయిలతో ప్రేమలో పడి గుట్టుచప్పుడుకాకుండా వ్యవహారం నడిపిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో తమ అన్నయ్య కాటమ జీవితంలోకి ఒక అమ్మాయిని తీసుకొస్తే మార్పు వస్తుందనుకున్న తమ్ముళ్ళు, ఎంతో సున్నితమైన క్లాసికల్ డ్యాన్సర్ అవంతిక ( శ‌ృతిహాసన్)కు రాయుడి గురించి కొన్ని అబద్ధాలు చెప్పి ప్రేమలో పడేలా చేస్తారు. అలా కాటమరాయుడి జీవితంలోకి అవంతిక ప్రవేశించిన తర్వాత వాళ్ళందరి జీవితాల్లో ఎలాంటి మార్పులు జరిగాయి? అవంతిక వల్ల కాటమరాయుడు ఎలా మారాడు? అవంతిక ప్రేమను కాటమరాయుడు ఎలా పొందగలిగాడు? ఆ ప్రేమ కోసం ఎలాంటి కష్టాలు పడ్డాడన్నదే కథ.

ఎనాలసిస్:

ఓ భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో అదికూడా ఓ మంచి ఫాలోయింగ్ ఉన్న పెద్ద స్టార్‌తో తెరకెక్కించాలంటే కత్తిమీద సాము లాంటిదే. ఎందుకంటే అక్కడ హిట్ అయినందుకు కథా పరంగా పెద్దగా మార్పులు చేసుకోవడానికి ఏమాత్రం వీలుండదు. అంతేగాక ఇక్కడి స్టార్ హీరో ఇమేజ్‌కు ఏమాత్రం తక్కువకాకుండా అవసపరమైతే హీరోయిజాన్ని ఇంకా కాస్త ఎక్కువ హైలెట్ చేసే విధంగా తెరకెక్కించాల్సి ఉంటుంది. ఆ విషయంలో దర్శకుడు డాలీ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. తమిళంలో సూప్‌హిట్ అయిన వీరమ్‌ సినిమాని పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని ద‌ృష్టిలో ఉంచుకొని మార్పులు చేసుకున్నాడు.

మూలకథలో వీరమ్‌ కథని చూచాయిగా ఫాలో అయినప్పటికీ సినిమాలో ఎక్కడా కొత్త టర్న్‌లు, కొత్త క్యారెక్టరైజేషన్‌లను టచ్ చేయకుండానే అభిమానులు పవన్ కళ్యాణ్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో ఆ రేంజ్‌కు ఏమాత్రం తీసిపోకుండా పవన్‌కల్యాణ్‌ క్యారెక్టరైజేషన్‌పైనే పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి సక్సెస్ అయ్యాడు.
సినిమా మొదలైనప్పటినుండి పవన్ ఎంట్రీ విషయంలో తీసుకున్న శ్రద్ధ పవన్ శృతిహాసన్ మధ్య జరిగే లవ్ సీన్లలోనూ కొనసాగించాడు దర్శకుడు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంతకుముందు సినిమాలకంటే చాలా స్టైలిష్‌గా కనిపించాడు. మీసం మెలేయడం కానీ, పంచె పైకెత్తడంలో కానీ ఓ స్టైల్ మెయింటైన్ చేస్తూ సినిమాను తన భుజస్కందాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్ళాడు పవన్‌కళ్యాణ్. సినిమా ఫస్టాఫ్ మొత్తం అన్నదమ్ములమధ్య ఉండే అనుబంధం, అన్నను ప్రేమలో పడేయడానికి తమ్ముళ్ళు చేసే ప్రయత్నాలు, మధ్యమధ్యలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఒకదాని తర్వాత ఒకటి సాగిపోతోంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌కూడా సినిమాను ట్రాక్‌లో పెట్టడానికి సరిపోయింది.

అయితే ఇంటర్వెల్ తర్వాత అప్పటివరకు సీరియస్‌గా కనిపించిన పవన్‌కళ్యాణ్‌ ఒక్కసారిగా జోవియల్‌గా మారిపోయి హీరోయిన్ వెంటపడే సన్నివేశాలు సినిమాలో కాస్త కామెడీ యాంగిల్‌ను బయటపెట్టింది. ఆ తర్వాత ఫస్టాఫ్ మాదిరిగా కాకుండా కాస్త స్లోగా రన్ అవుతుంది. దీంతో సినిమా ట్రాక్ తప్పుతుందనుకొనే సమయంలో రైల్వే ట్రాక్ దగ్గర జరిగే ఫైట్‌తో సినిమాలో ట్విస్ట్ వచ్చి మళ్ళీ ట్రాక్ ఎక్కింది. అప్పటినుండి చివరివరకు అదే ఎమోషన్స్ క్యారీ చేయడంలో పవన్ కళ్యాణ్, దర్శకుడు డాలీ సక్సెస్ అయ్యారు.

ఈ సినిమా మొత్తం కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులను ద‌ృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కథలో అవసరంలేకపోయినా కేవలం అభిమానులకోసం ఖుషి సినిమాలో మాదిరిగా మందుపాట పెట్టడం సినిమా సీరియస్‌నెస్‌ను తగ్గించింది. అయితే తన అభిమానులను ఏమాత్రం నిరాశపరచకుండా ఉండేలా పవన్ కళ్యాణ్ చివరివరకు క‌ృషి చేసి సక్సెస్ అయ్యాడు.

కాకపోతే పాటల్లో డ్యాన్స్‌ల విషయంలో పవన్‌ మరింత దృష్టి పెడితే బాగుండేదనిపించింది. దీనికితోడు పక్కా కమర్షియల్ సినిమా మాదిరిగా అవసరంలేకపోయినా ఫారిన్ లొకేషన్ పాటలు పెట్టడం వల్ల సినిమా కథలో సీరియస్‌నెస్ తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో శృతిహాసన్ పవన్‌కళ్యాణ్‌కు పోటీగా కాస్తైనా స్టైలిష్‌గా ఉంటుందనుకొని అంచనాలు వేసుకున్నవాళ్ళకు మాత్రం పెద్ద ఎదురుదెబ్బే. ఎందుకంటే ఈ సినిమాలో శ‌ృతిహాసన్ తన పరిధిమేరకు చక్కగా నటించినప్పటికీ లుక్స్ పరంగా ఇంకాస్త స్టైలిష్‌గా తయారుచేస్తే ఇద్దరి జంట ఇంకాస్త బాగుండేది. అంతేగాక పాటల్లో కాస్ట్యూమ్స్ ఏమాత్రం ఎట్రాక్ట్ చేయలేదు. కాటమరాయుడిపై ప్రతీకారం తీర్చుకొనే పాత్రలో రావురమేష్‌ అలరించారు. సీమ మాండలికంలో సాగే సంభాషణలు ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాని మరో రేంజ్‌కి తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యింది మాత్రం సినిమాటోగ్రఫీ వల్లే. ప్రతీ సీన్‌లో కలర్‌ కాంబినేషన్స్‌, పల్లెటూరిని ప్రసాద్‌ మూరెళ్ల తన కెమెరాతో సినిమాను అందంగా తెరకెక్కించాడు.

 

ఓవరాల్: నమ్మకాన్ని గెలిపిస్తూ అభిమానుల మీసం మెలేసిన ‘కాటమరాయుడు’

 

రేటింగ్: 3.5 / 5

-శరత్‌చంద్ర

Have something to add? Share it in the comments

Your email address will not be published.