వణికిస్తున్న ప్లాస్టిక్ బియ్యం

Plastic rice terrifying people causing health problems in some areas

Plastic rice terrifying people causing health problems in some areas

అన్నం పరబ్రహ్మ స్వరూపం … తినే ముందు ఎంతో జాగ్రత్తగా క్రింద పడకుండా తినే పరిస్థితి పోయి తినే ముందు ఒక ముద్ద చేసి క్రింద కొట్టి ఆ ముద్ద ఎగిరిందా లేదా అని చెక్ చేసుకొనే పరిస్థితి వచ్చేస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో ప్లాస్టిక్ బియ్యం హవా పెరిగిపోతుండడంతో ఈ మధ్య ప్లాస్టిక్ రైస్‌ గురించి జనం గగ్గోలు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి భయపడుతూ తాము తినే బియ్యాన్ని పదే పదే పరీక్షించుకుంటున్నారు.  అంతేగాక వండే బియ్యం నిజం బియ్యమేనా కాదా అనే సందేహాలతో అసలు అన్నం తినడమే మానేసే పరిస్థితికి చేరుకుంటున్నారు.

 ప్లాస్టిక్ రైస్.. ఎక్కువగా చైనాలో ఇలాంటి ఫేక్ రైస్ తయారుచేసి వివిధ దేశాల‌ను టార్గెట్ చేసుకుంటున్నాయి. అందులోభాగంగా ఇండియా, సింగ‌పూర్, ఇండోనేషియా, శ్రీలంకలాంటి దేశాలు ఈ ప్లాస్టిక్ రైస్ బారిన ప‌డుతున్నాయి. ఈ దేశాల్లో ఎక్కువగా అన్నం తినేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో సాధార‌ణంగా బియ్యాన్ని చూసి అది ప్లాస్టిక్ బియ్య‌మా.. లేదా నిజ‌మైన బియ్య‌మా అని తెలుసుకోవ‌డం చాలా క‌ష్టంగా తయారవుతోంది.
ఇప్పుడు దేశంలో మార్కెట్‌ను ముంచెత్తిన ప్లాస్టిక్ రైస్ గురించే జనాల బాధంతా. మొదట్లో ప్లాస్టిక్ రైస్ చైనా నుంచి దిగుమతి అయ్యింది. అయితే ఇప్పుడు లోకల్ గానే తయారు చేస్తున్నారు. అన్నం వండిన తర్వాత గానీ ప్లాస్టిక్ రైస్‌ను గుర్తించలేం అయితే కొన్ని విషయాలు గమనిస్తే ఈజీగా ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించొచ్చని చెబుతున్నారు.
మరోవైపు ప్లాస్టిక్ రైస్ తింటే చాలా ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఎక్కువగా ప్లాస్టిక్ రైస్ తింటే హార్మోన్ల తేడా ఎక్కువగా అవుతుందని చెబుతున్నారు. అంతేగాక నిరంతరంగా అదే రైస్ తింటే కాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్లాస్టిక్‌ను కెమిక‌ల్స్‌తో త‌యారుచేస్తారు. ఇండియాలో నిజ‌మైన బియ్యంలో ప్లాస్టిక్ రైస్ ను క‌లిపి అమ్ముతున్న డీల‌ర్స్ సంఖ్య పెరుగుతున్నారు.
ఈ మధ్య ప్లాస్టిక్ రైస్‌ను హోట‌ల్స్‌లో వ‌డ్డిస్తున్న స్టోరీలను కూడా మ‌నం చూస్తూనే ఉన్నాం. దీంతో హోటల్‌కు వెళ్లిన వారు అనుమానంతో బిర్యానీ తినే దుస్థితి ఏర్పడింది. అందుకే హోటల్స్‌కి వెళ్ళిన వాళ్ళు అన్నాన్ని బంతిలా చేసి నేలకోసి కొట్టేవాళ్లు ఎక్కువయ్యారు.
దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ గుడ్లు బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం బ‌య‌ట ప‌డింది. ప్లాస్టిక్ రైస్ అమ్మ‌కాల‌పై ఇరు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హైద‌రాబాద్‌, శ్రీ‌శైలం స‌హా ప‌లు ప్రాంతాల్లో ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని, ఈ రోజు ప‌లుచోట్ల దాడులు చేస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ రైస్ బ‌స్తాల‌ను సీజ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వ్యాపారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.

లేటెస్ట్‌గా హైద‌రాబాద్‌లోని మీర్ పేట్‌లో ప్లాస్టిక్ బియ్యం క‌ల‌క‌లం రేపింది. అశోక్‌కుమార్ అనే వ్యక్తి నందనవనంలోని ఓ కిరాణాషాపులో బియ్యాన్ని కొనుగోలు చేశాడు. అనంతరం అన్నం వండగా ఎందుకో అతనికి అనుమానం వచ్చి అన్నంను ముద్దలుగా చేసి నేలకేసి కొట్టాడు. అన్నం ముద్దలు బంతిలా ఎగరడంతో షాపు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా… ఇప్పటికే పాలు, పచారి వస్తువులన్నీ కల్తీమయం కాగా ఇప్పుడు బియ్యం కూడా కల్తీ చేస్తూ ప్లాస్టిక్ బియ్యం అమ్ముతుండడంతో ప్రజలు బయట ఏది కొనాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మరోవైపు శ్రీశైలం దేవస్థానం దగ్గర కూడా ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. శ్రీశైల దేవస్థానం పరిధిలోని కొన్ని దుకాణాల్లో ప్లాస్టిక్‌ బియ్యాన్ని అమ్ముతున్నారని కొందరు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
మొత్తానికి తినే వస్తువుల్లో ఒకదాని తర్వాత ఇంకొకటి నకిలీ వస్తువులు వెలుగులోకి వస్తుండడంతో జనాలకు కొత్త భయం పట్టుకుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.