‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మూవీ రివ్యూ

Raj Tarun Kittu Unnadu Jagratha Movie Review by Sakalam

Raj Tarun Kittu Unnadu Jagratha Movie Review by Sakalam

 సినిమా:  ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’

నటీనటులు :రాజ్‌త‌రుణ్‌, అను ఇమ్మాన్యుయ‌ల్‌

సంగీతం :అనూప్ రూబెన్స్

నిర్మాతలు :అనిల్ సుంకర

దర్శకత్వం :వంశీ కృష్ణ

ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గతేడాది ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాతో సక్సెస్ సాధించి కిట్టు ఉన్నాడు జాగ్రత్త అంటూ వచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్. మినిమం గ్యారెంటీ మార్కులు కొట్టేసి ఇండస్ట్రీలో మంచి పేరుతెచ్చుకున్న రాజ్ తరుణ్ వంశీకృష్ణ దర్శకత్వంలో అనుఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన కిట్టుఉన్నాడు జాగ్రత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఫస్ట్‌ లుక్ పోస్టర్ విడుదలైనప్పటినుండి ప్రేక్షకుల్లో భారీగా ఉన్న అంచనాలను ఏమేరకు అందుకోగలిగారు.

 కథ :

కార్ల గ్యారేజ్ నడుపుకొనే కిట్టు ( రాజ్ తరుణ్) జానకి ( అను ఇమ్మాన్యుయేల్)తో ప్రేమలో పడుతాడు. అయితే ఒకరోజు కిట్టు గ్యారేజ్‌లో రాత్రికి ఉంచుకోమని జానకి ఓ బ్యాగును ఇస్తుంది. అయితే అందులో ఉన్న 25లక్షల రూపాయలను కిట్టు ఫ్రెండ్ తీసుకొని రాత్రికి రాత్రే జంప్ అవుతాడు. దీంతో ఉదయాన్నే జానకికి బ్యాగ్ ఇచ్చేలోపల అందులో డబ్బులు ఉంచాలని గ్యారేజ్‌కోసం తను దాచిపెట్టుకున్న 10లక్షలరూపాయలను ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. అంతేగాక ఇంకా డబ్బులు సరిపోక మనీ లెండర్ (బాహుబలి ప్రభాకర్) దగ్గర మిగతా డబ్బు తీసుకొని సర్దుతాడు. ఇచ్చిన అప్పు తీర్చకపోతే అవయవాలు తీసి అమ్ముకొనే ప్రభాకర్‌కు తిరిగి డబ్బులు చెల్లించాలని కుక్కలను కిడ్నాప్ చేయడం మొదలుపెడతాడు. అలా కుక్కల కిడ్నాప్ మొదలుపెట్టిన కిట్టు చివరి కిడ్నాప్‌గా తెలియకుండానే జానకి కుక్కను కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. అదే సమయంలో జానకి తండ్రి (నాగబాబు) ఇన్‌కంటాక్స్‌ ఆఫీసర్ చేతిలో దెబ్బతిన్న క్రిమినల్ ( అర్బాజ్ ఖాన్) జానకిని కిడ్నాప్ చేస్తాడు. జానకిని కాపాడాలని కిట్టు చేసిన ప్రయత్నం ఏమేరకు వర్కౌట్ అయ్యింది? చివరికైనా కిట్టు జానకి ప్రేమను పొందగలిగాడా?

ఎనాలసిస్:

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రాజ్ తరుణ్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను ఏమాత్రం తీసిపారేయకుండా జాగ్రత్తగా తీసి మంచి మార్కులు కొట్టేసాడు కిట్టుగాడు. ఇప్పటివరకు రాజ్ తరుణ్ చేసిన సినిమా మాదిరిగాకాకుండా కాస్త భిన్నంగా కొత్త కాన్సెప్ట్‌ తో తనదైన స్టైల్‌లో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. సినిమాలో నిజంగా మెచ్చుకోవాల్సిన అంశం ఇంటర్వెల్ బ్యాంగ్. ఫస్టాఫ్ మొత్తం ఓకె అనిపించేలా వెళ్తుందనుకొనే టైంలో ఇంటర్వెల్ రూపంలో ఎవరూ ఉహించని ట్విస్ట్‌లతో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు వంశీకృష్ణ. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కాస్త రొటీన్‌గానే ఉన్నప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ తన నటనతో ఆకట్టుకుంది. అంతేగాక ఈ సినిమాలో జీవం పోసింది మాత్రం కమెడియన్ పృధ్వీనే. సినిమా సెకండాఫ్లో చివరి అరగంటపాటు రొటీన్‌కు భిన్నంగా పృథ్వీ చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. స్పూఫ్ కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన పృథ్వీనుండి ఇలాంటి కామెడీ ట్రాక్ రావడం నిజంగా కామెడీ లవర్స్‌కి మంచి రిలీఫ్ ఇచ్చినట్లైంది. హీరో క్యారెక్టర్‌తో కుక్కల కిడ్నాప్ అనే ఆలోచన కాస్త వెరైటీగా ఉన్నప్పటికీ స్క్రీన్‌పైన చూడడానికి బాగానే ఉంది. ప్రవీణ్, సుదర్శన్ ల పెర్ఫార్మెన్స్, విలన్‌గా అర్బాజ్‌ఖాన్ నటన, రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి.

అయితే సినిమాలో ఫస్టాఫ్‌లో స్క్రీన్‌ప్లే కాస్త వర్కౌట్ కాలేదనిపించింది. ఇంకాస్త రొటీన్‌కు భిన్నంగా తీస్తే బాగుండేది. బాహుబలి ప్రభాకర్ బ్యాచ్ ఓవరాక్షన్ సీన్లు, రఘుబాబు, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్స్ కథ అక్కడక్కడా అడ్డంపడ్డాయి. అంతేగాక సెకండాఫ్‌లో కామెడీ సీన్లు ఎక్కువడంతో మెయిన్ కంటెంట్‌లోకి ఎప్పుడెప్పుడు వెళ్తుందని వెయిట్ చేయాల్సి  వచ్చింది. అనూప్ రూబెన్స్ సంగీతం ఓకె అనిపించినప్పటికీ, రాజశేఖర్ సినిమాటోగ్రఫీని నిజంగా మెచ్చుకోవాల్సిందే. నిర్మాణ విలువలు సినిమా రేంజ్‌ని పెంచేశాయి.

ఓవరాల్: హిట్ కొట్టిన కిట్టుగాడు

రేటింగ్: 3 / 5

-శరత్

Have something to add? Share it in the comments

Your email address will not be published.