అపర చాణక్యుడికి ఈయేడాదైనా గౌరవం దక్కేనా??

Remembering PV Narasimha Rao On his 96th Birthday

ప్రపంచపటంలో భారతదేశం ఇప్పుడు ఓ మాదిరిగా ఎదుగుతున్న దేశంగా కనిపించడానికి కీలకమైన వ్యక్తి, దేశ ఆర్థిక సంస్కరణలకు పునాదులేసిన మహనీయుడు, తెలుగువారేకాకుండా దేశం మొత్తం గర్వించదగ్గ గొప్ప సంస్కరణాభిలాషి కీర్తి శేషులు పాములపర్తి వెంకట నరసింహారావు. అయనే మనం ముద్దుగా పిలుచుకొనే పీవీ. అపర చాణక్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, బహు భాషా కోవిదుడిగా, దక్షిణాది రాష్ట్రాల నుండి ఎన్నికైన తొలి భారత ప్రధానిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన పివి 96వ జయంతి ఈరోజు. దేశానికి ఇంత మేలు చేసిన పివిని మనం నిజంగానే గౌరవించుకుంటున్నామా అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. ఒక క్రికెటర్ రిటైర్ అవుతున్నాడంటే హడావిడిగా ఆరోజు ఏదో సునామీలో దేశం కొట్టుకుపోతోందన్నట్లు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించుకున్న మనకు దేశ ఆర్థిక మూలాలను ముందుకు తీసుకెళ్ళే సంస్కరణలకు ఆద్యుడైన పీవీని ఎలా మరిచిపోతున్నాం. ఆయన జయంతి, వర్ధంతి రోజుల్లోనే ఆయనను తలచుకొని మిగతా రోజుల్లో గాలికి వదిలేస్తున్నాం. అసలు భారతరత్నకు పీవీ నరసింహారావు అర్హుడు కాదా??

Remembering PV Narasimha Rao On his 96th Birthday

అపర చాణక్యుడిగా పేరుతెచ్చుకొన్న ప్రధాని ‘పి.వి.నరసింహారావు’ గొప్ప పండితుడు. వేయిపడగల్ని హిందీలోకి అనువదించాడు. భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఒకేఒక్క తెలుగువాడు, పాములపర్తి వెంకట నరసింహారావు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.

కాంగ్రెస్ నేతృత్వంలో తుమ్మితే ఊడే ముక్కులాంటి మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపించడం అతనికే దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టి తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు.

1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడు ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్‌ఎల్‌బి చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్‌లతో కలిసి పనిచేసారు. 1951 లో అఖిల భారత కాంగ్రెసు కమిటీ లో సభ్యుడిగా స్థానం పొందారు.

See Also: ఈ నాలుగు నెలల్లో ఏం జరిగింది??

మంథని నియోజక వర్గం నుండి 1957 లో శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవుల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962లో మొదటిసారి మంత్రి అయిన పీవీ ఆ తర్వాత 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రిగాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయశాఖా మంత్రిగా, 1967లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. అంతేగాక కులప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ఒక ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ను వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది.

1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. అందులోభాగంగా తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైన దేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదులో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు.

పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8న కొత్తమంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసారు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతిపాలన ను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది.

శాసనసభ సభ్యుడిగా 1977 వరకు ఆయన కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు.1972లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలు పరచేందుకు చర్యలు తీసుకున్నారు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన.

See Also: ‘నిన్ను కోరి’ ఆడియో సాంగ్స్ విడుద‌ల‌

ఆ తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. లోక్‌సభ సభ్యత్వం, కేంద్ర మంత్రిత్వం. మొదటిసారిగా లోక్‌సభకు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్రలోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికై పదో లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1980 – 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించాడు. ప్రధానమంత్రిగా పీవీ ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది.

1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోద యోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి.

ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవథలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజంవేసారు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్‌సింగ్‌కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చారు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.

See Also: కమిట్మెంట్‌కి మెచ్చుకోవాలా లేక…???

పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే. ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా, ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు .

బహుభాషా పండితుడు, పీవీ. తెలుగుతో సహా, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగ లిగిన ప్రజ్ఞ ఆయనది.1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను అబ్బుర పరచాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరు ను ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది “ఇన్‌సైడర్” అనే ఆయన ఆత్మకథ. ‘లోపలిమనిషి ‘గా ఇది తెలుగులోకి అనువాదమైనది. సహస్రఫణ్: విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలు కు హిందీ అనువాదం. ఈ పుస్తకానికై పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.

తన ఆత్మకథ రెండో భాగం వ్రాసే ఉద్దేశం ఆయనకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004, డిసెంబర్ 23న పి.వి.నరసింహారావు కన్నుమూసారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.