‘నేనోరకం’ మూవీ రివ్యూ

SaiRam Shankar Thrilling Entertainer Nenorakam Movie Review by Sakalam

SaiRam Shankar Thrilling Entertainer Nenorakam Movie Review by Sakalam

సినిమా: నేనోరకం

నటులు: సాయిరాం శంకర్, శరత్ కుమార్, రేష్మీ మీనన్, కాశీ విశ్వనాథ్, వైవా హర్ష

సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి

సంగీతం: మహిత్ నారాయణ్

నిర్మాత: శ్రీకాంత్ రెడ్డి

దర్శకుడు: సుదర్శన్  సలేంద్ర

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్లో సినిమాలు చేస్తున్న హీరో సాయిరాం శంకర్. ఇప్పటివరకు హీరోగా చాలా సినిమాలు చేసినప్పటికీ తనకి బాగా గుర్తింపు తెచ్చి సక్సెస్ అయిన సినిమాలు మాత్రం తక్కువ ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో మంచి స్పీడ్ అందుకున్న ఈ హీరో.. గత కొన్నేళ్లుగా బాగా వెనకబడిపోయాడు. గత రెండేళ్ళలో చేసిన సినిమాలు సైతం సాయిరాం శంకర్‌లో నటుడికి మార్కులేయించినా హీరోగా మాత్రం గట్టెక్కలేకపోయాడు. లేటెస్ట్‌గా సాయిరాం శంకర్ ‘నేనో రకం’ అంటూ తమిళ సీనియర్ నటుడు శరత్‌కుమార్‌తో కలిసి ఓ డిఫరెంట్ కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చేశాడు. నేనోరకం సినిమాపై సాయిరాం శంకర్‌ పెట్టుకున్న అంచనాలను ఏమేరకు అందుకోగలిగింది?

 

కథ:

హైద్రాబాద్‌లో ఓ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే గౌతమ్( సాయిరాం శంకర్) థియేటర్ దగ్గర స్వేచ్ఛ(రేష్మీ మీనన్ )ను కలసి ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత తన ప్రేమను ముందుకు తీసుకెళ్ళటానికి మొక్కలంటే ఎంతో ఇష్టపడే స్వేచ్ఛతో అబద్ధాలు చెప్పి ఆమెతో క్లోజ్‌గా మూవ్ అవుతుంటాడు. అదే సమయంలో గౌతమ్ చెప్పిన సమాచారంతో ఓ ఇంటికి వెళ్ళిన స్వేచ్ఛ అక్కడ ఉన్న నారాయణరావు( ఎంఎస్ నారాయణ)ని గౌతమ్ తండ్రి అనుకొని అతనితో మాట్లాడి వచ్చేస్తుంది. అప్పటినుండి నారాయణరావు కొడుకు వైవా హర్ష స్వేచ్ఛను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెనుక తిరుగుతుంటాడు. అయితే ఓ రోజు గౌతమ్ నారాయణరావు కొడుకు కాదని తెలుసుకున్న స్వేచ్ఛ తనకి అబద్ధాలు చెప్పినందుకు గౌతమ్‌పై కోప్పడుతంది. అయితే తన ప్రేమను పొందడానికే అలా అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందని చెప్పిన గౌతమ్‌ను ఆ తర్వాత రోజు స్వేచ్ఛ ఓ రెస్టారెంట్‌లో కలుద్దామని చెప్తుంది. అలా స్వేచ్ఛని కలవడానికి వెళ్ళిన గౌతమ్‌కు అక్కడ ఓ అనుకోని సంఘటన ఎదురై తన జీవితాన్నే మార్చే దిశగా తీసుకెళ్తుంది? అసలు ఏంటా ఘటన? స్వేచ్ఛ గౌతమ్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఆ రెస్టారెంట్‌కి వస్తుందా? కొత్తగా గౌతమ్ జీవితంలోకి వచ్చిన ఓ అజ్ఞాత వ్యక్తి అతడి జీవితాన్ని ఏ విధంగా మార్చాడన్నదే కథ?

ఎనాలసిస్:

సాధారణంగా ఈమధ్యకాలంలో వస్తున్న సినిమాలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి అసలు ఏమాత్రం బలంలేని, పసలేని, హీరోయిజం చూపించలేని, అనవసర బూతు డైలాగ్స్‌, సినిమా దొబ్బుతుందని తెలిసి కూడా భారీగా ప్రొడ్యూసర్ డబ్బులతో సినిమా తీసి చేతులు కాల్చుకొనే టైప్ ఒకటైతే….. సినిమా ఓపెనింగ్ షాట్ నుండి సినిమా ఎండింగ్ షాట్ వరకు చాలా క్లారిటీతో ఏ క్యారెక్టర్‌ను ఎలా ఎక్కడివరకు వాడుకోవాలో అక్కడివరకే వాడుకొని బలమైన కథతోపాటు అంతేబలంగా కథనాన్ని చెబుతూ ప్రేక్షకుల్లో ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవకుండా సినిమాని ప్రొడ్యూసర్ డబ్బులు ఏమాత్రం పిచ్చిపిచ్చిగా తగలేయకుండా సినిమా తీసి హిట్ కొట్టడం రెండో టైప్. ఇప్పుడు ఆ రెండో క్యాటెగిరీలోకి వచ్చి చేరిన సినిమా ‘నేనోరకం’. చాలారోజుల తర్వాత పూరీ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా, శరత్‌కుమార్ ప్రధాన కీలక పాత్రలో నటించి తెరకెక్కిన ఈ సినిమాతో సాయిరాం శంకర్ తన కెరీర్‌ని ఇంకో దిశలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సాయిరాం శంకర్ తన మొదటి సినిమా 143ని ఎంత ఇష్టంతో చేసినట్లు కనిపించాడో ఈ సినిమాలో తన నటనలోని పరిపక్వతను స్క్రీన్‌పై చాలా బాగా చూపించాడు. ఈ సినిమాలో హీరో సాయిరాం శంకర్ అనేదానికంటే కంటెంటే హీరో అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహంలేదు.

ఈ రోజుల్లో ధియేటర్లకొచ్చి సినిమాలు చూసే జనాల సంఖ్య చాలా తగ్గింది. అప్పుడప్పుడు బాహుబలి, శ్రీమంతుడులాంటి స్టార్‌ల సినిమాలు.. పెళ్లి చూపులులాంటి చిన్న సినిమాలు కధా,కధనాలే హైలెట్ గా తెరకెక్కి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటున్నాయి. ఇప్పుడదే కోవలో కంటెంటే హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్ పరంగా ఎన్నో వేరియేషన్స్, ట్విస్ట్‌లున్న సబ్జెక్ట్‌ అవడంతో కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో శరత్‌కుమార్ గంభీరమైన నటన సెకండాఫ్‌కి జీవం పోసి సినిమాని మరో రేంజ్‌కి తీసుకెళ్ళింది. అంతేగాక సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న చాలా సమస్యల్లో కొన్నింటిని తనదైన స్టైల్లో గౌతమ్ క్యారెక్టర్ ద్వారా పరిష్కరించడానికి ట్రై చేసిన విధానం ఆకట్టుకుంది. అసలు ఏం జరుగుతుందో తెలియక గౌతమ్ పాత్ర ఎంత ఉద్విగ్నతకు లోనవుతుందో సెకండాఫ్‌లో థియేటర్లో ఉన్న ప్రేక్షకుడు సేమ్ అదే ఫీల్ అవుతారు. శరత్‌కుమార్‌కు తోడు స్వేచ్ఛ క్యారెక్టర్ చేసిన రేష్మీ మీనన్ తన పాత్రను న్యాయం చేసింది.

గౌతమ్ క్యారెక్టర్ చేసిన సాయిరాం శంకర్ తన కెరీర్‌లో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేశాడనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు తను చేసిన క్యారెక్టర్లకు ధీటుగా సినిమా ఓపెనింగ్ షాట్ నుండి ఎండింగ్ వరకు తన నటనలో పరిణితిని చూపించాడు. సినిమాలో హోళీ సీన్‌లో, హీరో ఫైటింగ్ సీన్లలో సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. దీనికితోడు బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టారు.

అయితే  ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మైనస్ పాయింట్లు ఎంఎస్ నారాయణ, వైవా హర్ష కామెడీతోపాటు అసందర్భంగా ఉన్న ఒకటి రెండు పాటలు లేకుండా ఉంటే ఇంకాస్త కిక్ ఇచ్చేది. వీటికితోడు ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కిన ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకో పది నిమిషాల ముందు వచ్చి కథ కాస్త సీరియస్ మోడ్‌లో ముందుకు వెళ్తే బాగుండేది అనిపించింది. నిర్మాణాత్మక విలువలు బాగుండడంతో సినిమాలో అన్ని ఫ్రేములు కాస్త రిచ్‌గా కనిపించాయి.

 

ఓవరాల్: కంటెంటే ప్రధానంగా పక్కా స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన నేనోరకం

రేటింగ్: 3.25 / 5

 

-శరత్‌చంద్ర

Have something to add? Share it in the comments

Your email address will not be published.